Tuesday, April 8, 2025

విరోధం విడిచి భాగస్వాముల్లా పనిచేద్దాం

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : తూర్పు లద్దాఖ్‌లో నాలుగేళ్ల పాటు సాగిన సైనిక బలగాల ప్రతిష్టంభనకు గత ఏడాది ముగింపు పలకడంతో చైనాభారత్ దేశాల మధ్య అన్ని స్థాయిల్లో సానుకూల పురోగతి లభిస్తోందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి శుక్రవారం వెల్లడించారు. వార్షిక పాత్రికేయ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సరిహద్దు సమస్య కానీ మరేవైనా విభేదాలు కానీ ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపించవని స్పష్టం చేశారు. రష్యా లోని కజన్ సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య సుహృద్భావ చర్చలు జయప్రదం అయిన తరువాత గత ఏడాదిగా సానుకూల పురోగతి కనిపిస్తోందని పేర్కొన్నారు.

ఒక ఒప్పందం కుదిరిన తరువాత తూర్పు లద్దాఖ్ లోని ఆఖరి సంఘర్షణ ప్రాంతాలైన డెస్పాంగ్, డెమ్‌చోక్ నుంచి రెండు దేశాలు తమ సైనిక బలగాలను వైదొలగించడం పూర్తయిందని, సంబంధాల ప్రతిష్ఠంభన ముగిసిందని పేర్కొన్నారు. సరిహద్దులో శాంతి, ప్రశాంతి సాధించడానికి ప్రాచీన నాగరికతా దేశాలమైన మనకు తగినంత జ్ఞానం, సామర్ధం ఉన్నాయని అభివర్ణించారు. పరస్పరం విరోధం పెంచుకునే కంటే భాగస్వాముల్లా కలిసి పనిచేయడం ఉత్తమమని వాంగ్‌యీ అభిప్రాయపడ్డారు. ఆసియాలో కీలకమైన తమ రెండు దేశాల మధ్య సహకారం అత్యంత ముఖ్యమన్నారు.

దీనిని ఆయన సమన్వయంతో చేసే నృత్యంతో పోల్చారు. “ చైనాభారత్ భాగస్వాములుగా పరస్పర విజయానికి సహకరించుకోవాలి. దీనిని సాధించడానికి డ్రాగన్ ఎలిఫెంట్ డ్యాన్స్ ఒక్కటే ఇరుపక్షాలకు ఉన్న సరైన మార్గం ” అని వ్యాఖ్యానించారు. ఇరుదేశాలు పరస్పరం చిన్నబుచ్చుకోవడం కంటే, ఒకరినొకరు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. పరస్పర సహకారమే రెండు దేశాల ప్రజల ప్రాథమిక ప్రయోజనాలను బలోపేతం చేస్తుందన్నారు. ఉభయదేశాల సంబంధాలు ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ సౌత్ దేశాలకు కూడా ప్రయోజనమన్నారు.

అంతర్జాతీయ సంబంధాల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి, అంతర్జాతీయ వేదికలపై గ్లోబల్ సౌత్ ( పేద దేశాల ) స్థానాన్ని శక్తిమంతం చేస్తుందన్నారు. ఇరు దేశాల మధ్య వివాదాలను దౌత్య మార్గంలో పరిష్కరించుకొంటామని, సమష్టి ప్రయోజనాలను కాపాడుకోవడానికి సహకారం అవసరమని వాంగ్ అభిప్రాయపడ్డారు. “ చర్చల ద్వారా పరిష్కారం కానీ సమస్యే లేదు. అదే సమయంలో సహకారంతో చేరుకోలేని లక్షాలు లేవు ” అని వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో జరిగిన జీ 20 విదేశాంగ మంత్రుల భేటీలో భారత మంత్రి జైశంకర్‌తో చైనా మంత్రి వాంగ్ యీ భేటీ అయిన తరువాత కొన్ని వారాల్లోనే ఈ ప్రకటనలు వెలువడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News