Monday, January 20, 2025

భారత్‌కు తిరిగి చైనా పెట్టుబడులు!

- Advertisement -
- Advertisement -

ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్ చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి) కేంద్ర శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ చెప్పినట్లు, నాలుగేండ్లనాటి ఆంక్షల ఎత్తివేతకు ఇది సూచిక అని జనవరి 18వ తేదీన రాయిటర్స్ ఇచ్చిన వార్తకు అంతర్జాతీయ, జాతీయ మీడియా ఎంతో ప్రాధాన్యతనిచ్చింది.దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక 54వ వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు రాజేష్ కుమార్ సింగ్ వెళ్లారు. అక్కడ రాయిటర్స్ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ వార్త చైనాతో సత్సంబంధాలు కోరుకొనే పౌరులు, లబ్ధి పొందాలని చూస్తున్న పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ఆశలు రేకెత్తించేదైతే, కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకులకు మింగుడుపడనిదే. అయితే వెంటనే ఏదో అయిపోతుందని అనుకోనవసరం లేదు గానీ నరేంద్ర మోడీ సర్కార్ మీద దేశీయ కార్పొరేట్ శక్తుల నుంచి వస్తున్న వత్తిడికి కూడా ఇది సూచికే.

దిగుమతులను అనుమతించుతున్నట్లుగానే పెట్టుబడులను కూడా అంగీకరించక తప్పనట్లు కనిపిస్తోంది. 2020లో జరిగిన గాల్వన్ లోయ వివాదాల తరువాత మన సరిహద్దులలో ఉన్న దేశాల పెట్టుబడులను తనిఖీ చేయకుండా అనుమతించరాదంటూ కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇవి పరోక్షంగా చైనా పెట్టుబడులను అడ్డుకొనేందుకే అన్నది స్పష్టం. ఎందుకంటే మన నుంచి తీసుకొనేవే తప్ప మరొక సరిహద్దు దేశమేదీ మనకు పెట్టుబడులు పెట్టే స్థితిలో లేదు. అనేక మంది నోటితుత్తర జనాలు చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపులు ఇచ్చినప్పటికీ మన దిగుమతిదారులు వాటిని ఖాతరు చేయకుండా రికార్డులను బద్దలుకొట్టి మరీదిగుమతులు చేసుకున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. సరిహద్దు ఉదంతాల తరువాత రెండు దేశాల వాణిజ్యం 32% పెరిగింది. నాలుగేండ్లుగా చైనా పెట్టుబడులు, అంతకు ముందు ప్రతిపాదనలు ఏ మాత్రం ముందుకు సాగలేదు. ‘ఒకసారి మా సంబంధాలు, సరిహద్దు సమస్యలు స్థిరపడితే మార్పు రావచ్చు. పరిణామాలు సక్రమంగా ముందుకుపోతే పెట్టుబడుల అంశంలోకూడా సాధారణ లావాదేవీలను పునరుద్ధరించవచ్చని నేను చెప్పగలను.

సరిహద్దులను ఎవరైనా కొద్దికొద్దిగా ఆక్రమించుకుంటూ ఉంటే మనమేమీ చేయలేం, అటువైపు నుంచి పెట్టుబడులకు ఎర్రతివాచీ మర్యాదలు జరపలేము’ అని రాజేష్ కుమార్ చెప్పారు. ఇటీవలి సంవత్సరాలలో విదేశీ పెట్టుబడుల విషయంలో ఒక అడుగు వెనక్కు వేసి ఆటంకాలను తగ్గించినట్లు చెప్పారు. ‘గతేడాది కాలంగా ఎలాంటి ఉదంతాలు లేవు గనుక సాధారణ ఆశ కనిపిస్తోంది, పరిణామాలు స్థిరపడతాయి, మెరుగుపడతాయి అనుకుంటున్నాను. అమెరికా, ఆస్ట్రేలియాల్లో మాదిరి అన్ని దేశాలకు సంబంధించిన విదేశీ పెట్టుబడుల సమీక్షకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నాం, పెట్టుబడులకు స్వాగతం పలకాలనే పరిస్థితిని కొనసాగించాలని భారత్ కోరుకుంటున్నదని రాజేష్ కుమార్ చెప్పారు. 2020లో గాల్వన్ లోయలో జరిగిన పరిణామాల తరువాత చర్చ ల మీద చర్చలు కొనసాగుతున్నాయి. 2022లో రెండు సార్లు స్వల్ప ఘర్షణలు తప్ప ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు జరగలేదు. చర్చలతో ఒక అవగాహనా కుదరలేదు. ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నారు. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. మన వైపున 50 వేల మంది సైనికులు మోహరించి ఉన్నారు.

వాస్తవాధీన రేఖ ఉల్లంఘనల గురించి పరస్పర ఆరోపణలు కూడా చేసుకున్నారు. రెండు వైపులా సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణం, అభివృద్ధీ జరుగుతున్నది. గాల్వన్ ఉదంతాలకు ముందు కూడా వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలలో చైనా సైనికులు మన వైపు చొచ్చుకురావడం, మనవారు అటువైపు వెళ్లడం జరిగినప్పటికీ చేతులతో నెట్టుకోవడం తప్ప ఆయుధాలను ఉపయోగించలేదు. సగటున ఏడాదికి ఐదు వందల సార్లు చైనీయులు అతిక్రమిస్తున్నట్లు మన అధికారులు గతంలో వెల్లడించారు. ప్రతి ఉదంతమూ మీడియాలో రాదు. 2015లో చైనా వైపు నుంచి 428 సార్లు అతిక్రమణలు జరగ్గా అవి 2019 నాటికి 663కు పెరిగాయి. మన వైపు నుంచి జరిగేవి చైనా వారు చెబుతారు తప్ప మనం చెప్పుకోం. నరేంద్ర మోడీ తొలిసారి ప్రధానిగా పదవి చేపట్టిన తరువాత జి జిన్‌పింగ్ మన దేశాన్ని తొలిసారి సందర్శించనున్న తరుణంలో 2014లో సెప్టెంబరు 16న లడఖ్ తూర్పు ప్రాంతంలోని చుమార్ గ్రామ సమీపంలో చైనా ఒక రోడ్డు నిర్మిస్తుండగా అది తమ ప్రాంతమంటూ మన సైనికులు అడ్డుకొన్నారు. ప్రతిగా దానికి సమీపంలోని డెవ్‌ుచోక్ వద్ద నిర్మిస్తున్న కాలువ పనులను చైనా మిలిటరీ అడ్డుకుంది. ఇలా రెండు దేశాల దళాలు 16 రోజుల పాటు మోహరించి తిష్ట వేశాయి.

చివరికి ఉన్నత స్థాయి చర్చల తరువాత ఉభయ పక్షాలూ వెనక్కు తగ్గాయి. రోడ్డు నిర్మాణాన్ని చైనా విరమించుకుంటే దానికి ప్రతిగా మన దేశం పరిశీలక కేంద్రాన్ని కూల్చివేసేందుకు, బంకర్ల నిర్మాణాన్ని నిలిపి వేసేందుకు అంగీకరించింది. తరువాత 2015లో లడఖ్ ఉత్తరప్రాంతంలోని బర్టసే అనే గ్రామం వద్ద చైనా మిలిటరీ నిర్మించిన ఒక పరిశీలన కేంద్రాన్ని ఇండోటిబెటన్ సరిహద్దు పోలీసులు కూల్చివేశారు. దాంతో చైనా మిలిటరీ రాగా పోటీగా మన సైనికులు కూడా వెళ్లడంతో వారం రోజు వివాదం తరువాత ఇరుదేశాల స్థానిక మిలిటరీ అధికారులు సర్దుబాటు చేశారు.తరువాత రెండు దేశాల మిలిటరీల మధ్య పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు పన్నెండు రోజుల పాటు సంయుక్త మిలిటరీ విన్యాసాలు జరిపారు. చైనా భూటాన్ మధ్య సరిహద్దు సమస్యలున్నాయి. వాటిలో డోక్లాం ఒకటి. ఆ ప్రాంతం మన దేశంలోని సిలిగురి కారిడార్‌కు దగ్గరగా ఉంటుంది. డోక్లాంలో చైనా మిలిటరీ రోడ్లు, తదితర నిర్మాణాలను చేపట్టడంతో అంతకు ముందు భూటాన్ చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా మన దేశం జోక్యం చేసుకొని చైనాను నిలువరించింది. 2017లో 73 రోజుల పాటు ఆ వివాదం కొనసాగింది.

తరువాత సద్దుమణిగింది. 1962లో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పటికీ తరువాత కాలంలో సంబంధాలను మెరుగుపరుచుకొనేందుకు సరిహద్దు వివాదం, చిన్నచిన్న ఘర్షణలు అడ్డం రాలేదు. కొంత కాలం ఎడముఖం పెడముఖంగా ఉన్నప్పటికీ సాధారణ సంబంధాలు ఏర్పడ్డాయి. గాల్వన్ ఉదంతం నిస్సందేహంగా మరోసారి సంబంధాలను దెబ్బతీసింది. తరువాత పెద్ద ఉదంతాలేమీ జరగలేదు గనుక సీనియర్ అధికారి రాజేష్ కుమార్ సింగ్ చేసిన వ్యాఖ్యల వెనుక ప్రభుత్వ ఆలోచనా ధోరణి కనిపిస్తున్నది. చైనా తన వస్తువులను తక్కువ ధరలకు మన దేశంతో సహా ప్రపంచంలో కుమ్మరిస్తున్నదని కొంతమంది నిరంతరం ఆరోపిస్తుంటారు. అలాంటి వివాదాలను, సమస్యలను పరిష్కరించడానికి ప్రపంచ వాణిజ్య సంస్థ ఉంది. చైనా మీద ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని అనేక దేశాలు అనుకుంటున్నట్లుగానే మనదేశంలో కూడా కొందరు సూచిస్తున్నారు. తప్పేమీ లేదు. చైనా బదులు ప్రపంచం మన మీదే ఆధారపడే విధంగా చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా, ఆత్మనిర్భర పిలుపులు ఇచ్చారు. మంచిదే, ఎవరూ కాదనటం లేదు.

కానీ కొంత కాలానికి మన దేశం మీద ఆధారపడకూడదని ఇతర దేశాలు అనుకోవన్న గ్యారంటీ ఏమిటి? అసలు సమస్య అది కాదు. ఏ దేశానికి ఆ దేశం అన్నిరంగాల్లో స్వయం సమృద్ధమయ్యే పరిస్థితి వచ్చేంత వరకు పరస్పరం ఆధారపడక తప్పదన్నది వాస్తవం. అనుభవమైతే గానీ తత్వం తలకెక్కదంటారు పెద్దలు. గాల్వన్ ఉదంతం తరువాత దేశంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేక ప్రచారం, వస్తు బహిష్కరణ పిలుపుల సంగతి, చైనాతో విడగొట్టుకోవాలన్న స్థానిక, అంతర్జాతీయ పెద్దల సలహాలు ఎరిగినవే. అయినప్పటికీ చైనా నుంచి దిగుమతులలో ఏడాదికేడాది స్వల్పతేడాలుండవచ్చుగానీ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. చైనాకు మన ఎగుమతులు పెరగడం లేదు. చైనా కంటే ముందు గతంలో జపాన్, దక్షిణకొరియా ఎలక్ట్రానిక్, మోటారు వాహనాలు, సెల్‌ఫోన్లు మన మార్కెట్‌ను ముంచెత్తాయి. ఇప్పటికీ గణనీయంగానే ఉన్నా యి. అవి కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇచ్చి ఎగుమతులు చేశాయన్నది తెలిసిందే. మన వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు వాటిని ఇక్కడే తయారు చేస్తే అనే ఆలోచన రాలేదనుకుంటే పొరపాటు. అందుకు అనువైన పరిస్థితి మన దేశంలో అప్పుడూ ఇప్పుడూ లేదు.

గతంలో ఉన్న కాంగ్రెస్ పాలకులకూ, ఇప్పుడున్న నరేంద్రమోడీకి అది పట్టలేదు. చౌకగా వస్తూత్పత్తికి అవసరమైన పరిశోధన, అభివృద్ధికి భారీ మొత్తంలో ప్రభుత్వాలు ఖర్చు చేయకుండా వీలుకాదు. అందుకే ఉత్పత్తి కంటే దిగుమతి చేసుకుంటే వచ్చే లాభాలే ఎక్కువని అప్పుడూ ఇప్పుడూ మన కార్పొరేట్ శక్తులు భావిస్తున్నాయి. జపాన్ కంపెనీలు తమ మార్కెట్ కోసం మన దేశంలోని స్థానిక కార్పొరేట్లతో సంయుక్త భాగస్వామ్య కంపెనీలను ఏర్పాటు చేశాయి. కనుకనే మారుతీ సుజుకీ, హీరోహోండా, స్వరాజ్‌మజడా వంటి కంపెనీలు రంగంలోకి వచ్చాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటారు వాహన రంగంలో చైనా ముందుంది. దానితో సంయుక్త భాగస్వామ్యానికి మన పాలకులు అంగీకరిస్తే జపాన్ మారుతీ కార్ల మాదిరి చైనా ఎలక్ట్రిక్ వాహనాలు,ఇతర ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తుతాయి. ఇప్పటికిప్పుడు ఆ రంగంలో మనం పోటీపడలేం గనుక ఆ లాభాల కోసం మన కార్పొరేట్లు చైనా పెట్టుబడులను అనుమతించాలని వత్తిడి చేస్తున్నాయా? ప్రభుత్వం అంగీకరిస్తుందా? దానికి సూచికగానే మన ఉన్నత అధికారి రాజేష్‌కుమార్ సింగ్ దావోస్‌లో మాట్లాడారా? చూద్దాం ఏం జరుగుతుందో!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News