బీజింగ్: కుటుంబ నియంత్రణ విధానాన్ని సడలిస్తూ చైనా జాతీయ అసెంబ్లీ నిర్ణయం తీసుకున్నది. ఒక్కో జంట ముగ్గురు పిల్లల్ని కనడానికి అనుమతించే చట్టానికి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్‌పిసి) స్టాండింగ్ కమిటీ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకూ అమలులో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను సడలించాలని ఈ ఏడాది మే నెలలోనే చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సిపిసి) సిఫారసు చేసింది. చైనాలో వృద్ధుల జనాభా పెరుగుతుండగా, పని చేయాల్సిన యువకుల సంఖ్య తగ్గుతున్నదన్న ఆందోళనతో సిపిసి ఈ సిఫారసు చేసింది. ముగ్గురు పిల్లల్ని కనేవారికి పలు రాయితీలను కూడా చైనా ప్రకటించింది. పిల్లల పెంపకం, విద్యాభ్యాసానికయ్యే ఖర్చును తగ్గించేందుకు పలు రాయితీలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నది.
2016నుంచి ఇద్దరు పిల్లల నిబంధన చైనాలో అమలవుతోంది. అంతకుముందు మూడు దశాబ్దాలపాటు ఓ కుటుంబానికి ఒక్కరే అన్న నిబంధనను చైనా కఠినంగా అమలు చేయడం గమనార్హం. ఆ సమయంలో 40 కోట్ల నూతన జననాలను నిరోధించగలిగామన్నది చైనా అంచనా. చైనాలో ప్రస్తుతం 60 ఏళ్లు పైబడినవారి సంఖ్య 26.40 కోట్లు. ఐక్యరాజ్యసమితి నివేదిక2019 ప్రకారం చైనా జనాభా 143 కోట్లు కాగా, భారత్ జనాభా 137 కోట్లు. 2027కల్లా ఇండియా జనాభా చైనాను దాటుతుందని అంచనా. చైనాలో పునరుత్పత్తి రేట్ బాగా తగ్గిన నేపథ్యంలో ముగ్గురు పిల్లల నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. 2020లో చైనాలో కోటీ 20 లక్షల నూతన శిశువులు జన్మించారు. ఇది గతంతో పోలిస్తే చాలా తక్కువ అన్నది గమనార్హం.