Saturday, November 23, 2024

అరుణాచల్‌లో ప్రదేశాలకు చైనా కొత్త పేర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనని వాదిస్తున్న చైనా తాజాగా ఆ రాష్ట్రంలోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఎసి) వంబడి ఉన్న 30 ప్రదేశాలకు నామకరణం చేసింది. పరిపాలనా పరమైన విభాగాలకు పేర్లు పెట్టే చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వశాఖ అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రదేశాలకు తమ సొంత పేర్లు పెడుతూ నాలుగవ జాబితాను విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా తన సొంత భాషలో జాంగ్‌నాన్ అని వ్యవహరిస్తోంది. చైనా విడుదల చేసిన తాజా జాబితాలో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, 4 నదులు, ఒక పర్వత కనుమ, కొంత భూమి ఉన్నాయి. ఆ పేర్లు చైనీస్ పదాలు ఉన్నాయి. అక్షాంశం, రేఖాంశంతో కూడిన జాంగ్‌నాన్ చిత్రపటాన్ని కూడా మంత్రిత్వశాఖ విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో పేర్ల మార్పునకు సంబంధించి చైనా ఆరు ప్రదేశాల పేర్లతో 2017లో మొదటి జాబితాను, 15 ప్రదేశాల పేర్లతో 2021లో రెండవ జాబితాను, 22 ప్రదేశాల పేర్లతో 2023లో మూడవ జాబితాను విడుదల చేసింది.

కాగా..అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రదేశాల పేర్ల మారుస్తూ చైనా చేపట్టిన చర్యను భారత్ ఇదివరకే తోసిపుచ్చింది. ఆ రాష్ట్రం భారత్‌లో అంతర్భాగమని పునరుద్ఘాటిస్తూ, కొత్త పేర్లు సృషించడం వల్ల వాస్తవం మారబోదని భారత్ ఇదివరకే స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రదేశాల పేర్లు మారుస్తూ చైనా విడుదల చేసిన జాబితాలు తమ దృష్టికి వచ్చాయని, దీన్ని తాము తిరస్కరిస్తున్నామని 2023లో అప్పటి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందం బగ్చి తెలిపారు. అరుణచాల్ ప్రదేశ్ అప్పుడు.. ఇప్పుడు..ఎప్పుడూ భారత్‌లో అంతర్ఘామేనని, పేర్లు మారుస్తూ చేపట్టిన చర్యల వల్ల వాస్తవం మారబోదని ఆయన చెప్పారు.

ఇలా ఉండగా..ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌ను సందర్శఙంచిన భారత ప్రధాని నరేంద్ర మోడీ 13,000 అడుగుల ఎత్తులో నిర్మించిన సొరంగ మార్గాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన సందర్శనపై చైనా దౌత్యపరమైన నిరసన తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా పదే పదే చేస్తున్న వాదనలను భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ మార్చి 23న ఖండిస్తూ ఈ వాదనలను హాస్యాస్పదంగా అభివర్ణించారు. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో సహజమైన భాగమని చెప్పారు. ఇది చైనా కొత్త వాదన కాదని, ఇప్పుడు తన వాదనను విస్తరిస్తోందని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News