మోడీకి రాహుల్ ఘాటు ప్రశ్న
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ దేశం కోసం ఖాదీ అంటారు అయితే జాతీయ జెండా కోసం చైనా పాలిస్టర్ వాడుతారని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాని మోడీ మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. ప్రధాని మోడీ శనివారం సబర్మతి వద్ద జరిగిన ఖాదీ ఉత్సవ్ కార్యక్రమంలో ఖాదీ ఉత్పత్తులను అంతా ప్రోత్సహించాలని పిలుపు నిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్‌కు ఖాదీయే స్ఫూర్తినిస్తుందన్నారు. దీనిపై రాహుల్ ఆదివారం ట్వీటు వెలువరించారు. జాతీయ జెండా దేశీయ ఉత్పత్తులకు ప్రతీక అయితే కేంద్రం జెండా కోడ్‌ను ఎందుకు సవరించిందని కాంగ్రెస్ ప్రశ్నించింది. జెండా చేతితో నేచిన వస్త్రంతో కానీ మెషిన్‌తో చేసింది కానీ , కాటన్ లేదా ఉన్ని పాలిస్టర్ లేదా పట్టుఖాదీ వస్త్రం ఏదైనా వినియోగించుకోవచ్చునని కొత్త నిబంధనలను రూపొందించారు. గతంలో ఉన్న నిబంధనల మేరకు పాలిస్టర్ జెండాలు, యంత్రాలతో చేసిన జెండాలను వాడరాదు. ఇప్పుడు ఏకంగా చైనాలో తయారయిన పాలిస్టర్‌తో చేసిన జెండాను వాడారని ఇది ఏం పద్ధతి అని రాహుల్ ప్రశ్నించారు.