Sunday, December 22, 2024

పశువుల కాపర్లపై చైనా సైనికుల జులుం?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతదేశ పశువుల కాపర్లను చైనా సరిహద్దు ప్రాంతంలో అటకాయించడం తీవ్రవిషయం అని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ దాడికి దిగింది. ఈస్టర్న్ లద్ధాఖ్ ప్రాంతంలో చైనా సైనికులు భారతీయ పశువుల కాపర్లను అడ్డుకోవడం, ఈ క్రమంలో పరస్పరం తగవుకు దిగడం వంటి పరిణామాలను తెలిపే వీడియోవెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ శుక్రవారం స్పందించింది. భారతదేశ సరిహద్దు ప్రాంత ప్రజలపై చైనా సేనల జులుం గురించి దృష్టికి వచ్చిందా? వస్తే దీనిని అడ్డుకునేందుకు హోం మంత్రి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? తీసుకుంటే వీటిని వివరిస్తారా? అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఓ ప్రకటనలో ప్రశ్నించారు.

చైనా సరిహద్దులలో పశుగ్రాసం కోసం వెళ్లే కాపర్లు ఇప్పుడే కాదు 2020 మే నెల నుంచి కూడా పలు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారని , అప్పటి నుంచి ఇప్పటివరకూ చైనా సైనికబలగాలతో ఎన్నిసార్లు ఇక్కడి స్థానికులు తలపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎంత మంది గాయపడ్డారు? దీనిపై ప్రభుత్వ స్పందన ఏమిటీ? అనేది తెలియాల్సి ఉందని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గత నెలలో ఈస్టర్న్ లద్థాఖ్‌లోని చౌషుల్ దక్షిణ ప్రాంతంలో కాపర్లను అటకాయించారని వార్తలు వెలువడ్డాయి. ప్రత్యేకించి స్థానిక సామాజిక మాధ్యమాలలో సంబంధిత వీడియోలు వరుసగా వెలుగులోకి వచ్చాయని , దీనిని ఉపేక్షించడం అనుచితం అవుతుందని కాంగ్రెస్ నేత రమేష్ నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News