Monday, December 23, 2024

చైనా నౌక కదలికలతో భారత్ కలవరం

- Advertisement -
- Advertisement -

డ్రాగన్ సీ గన్
చైనా నౌక కదలికలతో భారత్ కలవరం
లంకకు బయలుదేరిన యువాన్
దారివెంబడి లోగుట్టు పసికట్టు
న్యూఢిల్లీ:అత్యంత శక్తివంతమైన అధునాతన సాధన సంపత్తి గల చైనా యుద్ధ నౌక చైనా నుంచి శ్రీలంక రేవుకు బయలుదేరింది. బాలిస్టిక్ క్షిపణులను, శాటిలైట్లను పసికట్టి వాటిని పనిచేయనిస్థితికి తెచ్చే పరిజ్ఞానపు వ్యవస్ధతో కూడిన యువాన్ వాంగ్ శ్రేణి నౌక ఈ నెల 11 లేదా 12వ తేదీలలోనే లంకలోని హంబన్‌టోటా పోర్టుకు చేరుతుంది. ఈ చైనా నౌక కదలికలపై భారతదేశం రక్షణపరంగా ఆందోళన చెందుతోంది. శ్రీలంకకు అత్యంత కీలకమైన తైవాన్ పరిణామాల నేపథ్యంలోనే చైనా నౌక బయలుదేరడం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అని మార్గమధ్యంలో పలు తీర ప్రాంత రేవుపట్టణాలు, కీలక సైనిక స్థావరాలు నెలకొని ఉన్న భారతదేశం కలవరం చెందుతోంది. శాటిలైట్లను ఈ షిప్ పసికడుతుంది. ఖండాంతర క్షిపణులను కూడా అచేతనం చేస్తుంది. ఉన్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానపు యాంటెనాలు, పలు సెన్సార్‌లను సంతరించుకుని ఉంది. ఇంతవరకూ ఈ షిప్ ఏ సముద్ర మార్గంలో వెళ్లుతుందనేది స్పష్టం కాలేదు.

అయితే ఇది హిందూ మహాసముద్ర జలాల మీదుగా వెళ్లితే తీర ప్రాంతం వెంబడి ఉండే వీలార్ ఐలాండ్ నుంచి జరిగే క్షిపణి ప్రయోగాలు, ఇతర ప్రాంతాలలో శాటిలైట్ల పరీక్షల విషయాలను ఈ నౌక పసికడుతుంది. సాధారణంగా వెళ్లుతూ ఉన్నట్లుగా ఉంటూనే దీనినుంచి ఇండియాకు చెందిన పూర్తి స్థాయి రక్షణ సామర్థాలను, స్థితిగతులను అంచనావేసుకునేందుకు, రికార్డు చేసుకుని ముందుకు సాగేందుకు వీలేర్పడుతుంది. తరువాత చైనా తన సైనిక సామర్థతను పెంచుకునేందుకు దీనిని వాడుకోవచ్చునని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఇది అణ్వాయుధేతర నౌక కాబట్టి తమ రేవు పట్టణానికి దీనిని అనుమతిస్తున్నామని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. అయితే హిందూమహాసముద్రంపై పూర్తిస్థాయి పర్యవేక్షణకు, నౌకాయాన ఆధిపత్యానికి దీనిని పంపిస్తున్నామని కూడా చైనా తెలిపిందని లంక రక్షణ మంత్రిత్వశాఖ మీడియా ప్రతినిధి కల్నల్ నళిన్ హెరాత్ తెలిపారు. ఈ చైనా నౌక దగ్గరి దారులలో వెంటనే హిందూ మహాసముద్రంలోకి వస్తుంది. ఎక్కువగా భారతీయ తీర ప్రాంతాలపై నిఘా పెడుతూనే వెళ్లుతుంది. ఆ తరువాత ఇది లంక పోర్టులో ఎంతకాలం తిష్టవేస్తే అంతకాలం భారతదేశానికి పలు రకాల భద్రతా సవాళ్లు ఏర్పడుతాయని అనుమానిస్తున్నారు. ప్రస్తుత అంశంపై జాతీయ భద్రతా సంస్థ ఇంటలిజెన్స్ వర్గాలతో క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.

Chinese Spy Ship move to Sri Lanka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News