తూర్పు లడఖ్ వద్ద వెనక్కి వెళ్తున్న భారత, చైనా సైన్యాలు
తాత్కాలిక నిర్మాణాల్ని ధ్వంసం చేసిన చైనా
వివాదాస్పద ఫింగర్4 వద్ద గుడారాల తొలగింపు
ఉపగ్రహ చిత్రాలు, భారత సైన్యం విడుదల చేసిన వీడియోల్లో వెల్లడి
న్యూఢిల్లీ: భారత, చైనా సరిహద్దు ప్రాంతం వాస్తవాధీనరేఖ(ఎల్‌ఎసి)లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైన్యం వెనక్కి మళ్లడం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను భారత సైన్యం విడుదల చేసింది. ఉపగ్రహ ఛాయాచిత్రాల్లోనూ చైనా సైన్యం పర్వత ప్రాంతంలోని తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేయడం, వివాదాస్పద ఫింగర్4 వద్ద గుడారాలను తొలగించడం కనిపించింది. చైనా సైనికులు తమ సామాన్లను ట్రక్కుల్లో వేసుకొని వెనక్కి వెళ్తున్న దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. దీంతో, ఇరు దేశాల సరిహద్దుల్లో ఏడాది కాలంగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడనున్నట్టు భావిస్తున్నారు. గత వారం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు మొదట తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతంలోని వివాదాస్పద ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైన్యాన్ని వెనక్కి మళ్లించాలి. గతేడాది మే నెలలో ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తత ప్రారంభమైన ప్రాంతం ఇదే. ఆ తర్వాత జూన్ నెలలో పర్వత ప్రాంతంలోని ఫింగర్4 వద్ద ఇరు సైన్యాలు ఘర్షణ పడటం, రెండు వైపులా ప్రాణ నష్టం జరగడం తెలిసిందే.
జూన్ ఘటన తర్వాత మరికొన్ని ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. ఇరు దేశాల మధ్య వైషమ్యాలు మరింత ముదరకుండా ఉండేందుకు పలు దఫాలుగా జరిగిన చర్చలు ఓ కొలిక్కి వచ్చి చివరికి ఓ అంగీకారం కుదిరింది. సరస్సు ప్రాంతం వద్ద ఇరు దేశాల బలగాల మళ్లింపు పూర్తయిన తర్వాత మిగతా ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లడంపై మిలిటరీ కమాండర్లు చర్చిస్తారని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు.
ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కుదిరిన ఒప్పందంమేరకు చైనా సైన్యం పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలోని పర్వత ప్రాంతంలో ఫింగర్ 8 వరకు వెనక్కి వెళ్లాలి. అందుకు ప్రతిస్పందనగా భారత సైన్యం ఫింగర్ 3 వరకు వెనక్కి రావాలి. అక్కడి ధనాసింగ్ థాపాలోని శాశ్వత పోస్ట్ వద్ద భారత సైన్యం మకాం వేస్తుంది. ఫింగర్ 8 నుంచి ఫింగర్ 3 మధ్య ఉన్న ప్రాంతాన్ని మానవరహిత ప్రాంతంగా ఉంచేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఆ ప్రాంతంలో ఎవరూ పెట్రోలింగ్ చేయొద్దనేది షరతుగా ఉంటుంది.
Chinese troops vacating Finger 4 area at Pangong