Wednesday, January 22, 2025

టిబెటన్ల సత్తా చైనాకు తెలిసొచ్చింది : దలైలామా

- Advertisement -
- Advertisement -

ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్ ): టిబెటన్ల మనోబలం చాలా గొప్పదని చైనాకు తెలిసొచ్చిందని, టిబెట్ సమస్యలపై చైనాతో చర్చించడానికి తాను సిద్ధమని ప్రముఖ బౌద్ధమత గురువు దలైలామా అన్నారు. టిబెట్ ప్రజల ధైర్యాన్ని చైనా ఇప్పుడు గుర్తించిందని, అందుకే టిబెట్ సమస్యల పరిష్కారానికి చైనా నేతలు తనను సంప్రదిస్తున్నారని ఆయన అన్నారు. న్యూఢిల్లీ లడఖ్ లలో పర్యటించడానికి ముందు ధర్మశాలలో పాత్రికేయులతో ఆయన మాట్లాడారు.

చైనాతో చర్చలను పునరుద్ధరించాలని కోరుకుంటున్నారా ? అని ప్రశ్నించగా, మేం స్వాతంత్య్రం కోరుకోవడం లేదు.పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో కొనసాగాలని చాలా సంవత్సరాల క్రితమే నిర్ణయించుకున్నాం. ఇప్పుడు చైనా మారుతోంది. చైనీయులు అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ నన్ను సంప్రదించాలని కోరుకుంటోంది అని దలైలామా చెప్పారు. తాను టిబెట్‌లో జన్మించానని, తన పేరు దలైలామా అని, టిబెట్ లక్షం కోసం కృషి చేయడంతోపాటు తాను చైతన్య శీలులందరి సంక్షేమం కోసం కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.

ఆశావాదాన్ని వదులుకోకుండా , దృఢ సంకల్పం ఆవిరై పోకుండా తాను చేయగలిగిన దానిని చేశానని చెప్పారు. తనకు ఎవరిపైనా కోపం లేదని, టిబెట్ పట్ల కఠిన వైఖరిగల చైనా నేతలపై కూడా తనకు కోపం లేదని చెప్పారు. చారిత్రకంగా చైనా బౌద్ధ దేశమని, అక్కడ ఉన్న బౌద్ధ విహారాలు, దేవాలయాలు, ఇందుకు నిదర్శనమన్నారు. టిబెట్ సంస్కృతి, మతం గురించిన పరిజ్ఞానం ప్రపంచం మొత్తం మీద మేలు చేస్తుందని చెప్పారు. ఇతర మతాలను, సంప్రదాయాలను తాను గౌరవిస్తానని, ప్రేమ, కరుణ వ్యాప్తి చేయాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన అనుచరులకు సందేశం ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

“ నాకు వస్తున్న స్వప్నాలలో కనిపిస్తున్న సంకేతాలు, ఇతర జోస్యాల ప్రకారం, నేను 100 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు వరకు జీవిస్తాను. ఇప్పటివరకు నేను ఇతరులకు సేవ చేశాను, ఇకపై కూడా దానిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. ఈ ప్రాతిపదికపై నా ఆయురారోగ్యం కోసం ప్రార్థించండి” అని దలైలామా కోరారు. దలైలామా 88 వ జన్మదినోత్సవాలు జులై 6న ధర్మశాలలో జరిగాయి. ఆ రోజు ఆయన ఇక్కడి ప్రధాన టిబెటన్ టెంపుల్ ప్రాంగణం లోకి వెళ్లారు. దీనికి సమీపం లోనే ఆయన నివాసం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News