Sunday, December 22, 2024

రామానుజ విగ్రహావిష్కరణ: గవర్నర్ తమిళిసైకి చినజీయర్ స్వామి ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

Chinjiyar Swamy's invitation to Governor Tamilsai

 

మన తెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ ఆశ్రమంలో జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ని చినజీయర్ స్వామి ఆహ్వానించారు. రామానుజాచార్యులు భూమిపై అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా ఆశ్రమంలో ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు మహోత్సవాలు నిర్వహిస్తున్నామని గవర్నర్‌కు వివరించారు. సమతామూర్తి పేరిట 214 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చినజీయర్ స్వామి తెలిపారు.

ఫిబ్రవరి 13న నిత్య పూజల కోసం 120 కిలోల పుత్తడితో రూపొందించిన రామానుజాచార్యుల విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆవిష్కరిస్తామని.. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కోరారు. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఏర్పాటైంది. శ్రీరామ నగరం, చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆశ్రమం.. వైష్ణవ తత్వాన్ని విశ్వవ్యాపితం చేసేందుకు కృషి చేస్తోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగానే విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన రామానుజాచార్యులకు ఆకాశమంత గౌరవం కల్పించేందుకు సిద్ధమైంది.

వెయ్యేళ్ల క్రితమే.. సమాజంలో అందరూ సమానులేనంటూ ఎక్కువ తక్కువలు లేకుండా సమతా భావనను అనుసరించిన మహాపురుషుడికి ఘనమైన గుర్తింపునిచ్చేందుకు ప్రయత్నిస్తోంది. రామానుజాచార్యులు కూర్చున్న భంగిమలో 214 అడుగుల భారీ లోహ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చాలా పనులు పూర్తవ్వగా.. మరికొన్ని పనులు తుదిదశకు చేరుకున్నాయి. దివ్య సాకేతంలో రామానుజుల విగ్రహంతో పాటే 108 దివ్య ఆలయాలను నిర్మించారు. వీటిలో శాంతి కళ్యాణాలు చినజీయర్ స్వామి నిర్వహించనున్నారు. ఆ తర్వాతనే రామానుజామూర్తి సహా 108 ఆలయాల సందర్శనకు ప్రజలను అనుమతించనున్నారు. కాగా.. ఈ ఆశ్రమానికి ప్రముఖులు రానున్న నేపథ్యంలో అన్ని మార్గాలలో కొత్త రోడ్లు వేస్తున్నారు.

ఈ ఆధ్యాత్మిక నగరం హైదరాబాద్‌కు సరికొత్త గుర్తింపు తెస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమ బాధ్యతల్లో కొన్ని భుజానికెత్తుకుంది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంపై చినజీయర్‌స్వామితో చర్చించారు. ఇటీవలే ముచ్చింతల్‌లోని దివ్యసాకేతాన్ని సందర్శించి ఆయన ఇక్కడ ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ సిఎం కెసిఆర్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖులను స్వయంగా కలిసి ఉత్సవాలకు రావాలని చినజీయర్‌స్వామి ఆహ్వానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News