దుష్రచారం చేసేవారి అమాయకత్వానికి జాలి కలుగుతోంది
గ్రామ దేవతలు, మహిళలను
కించపరుస్తూ నేను మాట్లాడినట్లు
జరిగిన ప్రచారంలో ఎంతమాత్రం
నిజం సిఎం కెసిఆర్‌తో
ఎటువంటి విభేదాల్లేవు నేనొక భిక్షుక
సన్యాసిని, సాధారణ సాధువుని
రాజకీయాల్లోకి వచ్చే యోచన, ఆ
చతురత లేవు : విజయవాడలో
మీడియాతో చినజీయర్ స్వామి
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ ఆధ్యా త్మిక వేత్త చినజీయర్ స్వామి వ్యాఖ్యలు దేవతల ను, మహిళలను, ఆదివాసీలను కించపరిచేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యం లో, వాటన్నిటికీ తగిన వివరణలిస్తూ శుక్రవారం నాడు విజయవాడలో ఆయన విలేఖరులతో మా ట్లాడారు. ఆదివాసీలు, గ్రామదేవతలు, మహిళల నూ తాను తూలనాడినట్లు జరిగిన ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని ఆయన అన్నారు. ఆది వాసీలను తానెప్పుడూ వేరు చేసి చూడలేదని, వా రిని తక్కువగా అసలే చూడనని స్పష్టం చేశారు. సమానత్వాన్ని పాటిస్తూ దానిగురించి ప్రజలకు చాటిచెప్పే తనకు నాస్తికులూ, ఆస్థికులూ కూడా మిత్రులేనని పేర్కొన్నారు.
హిందువులే దుష్ప్రచారం చేయడం బాధకలిగిస్తోంది
దేవతా మూర్తులను తాను చిన్నచూపు చూడడం, తక్కువ చేసి మాట్లాడడం పూర్తిగా అవాస్తవమనీ, వేరు వేరు అవతారాల్లో ఉండే దేవతామూర్తులంటే తనకు ఎనలేని భక్తి అని తెలిపారు. నిజానికి తన భక్తి గురించి ప్రత్యేకంగా ప్రదర్శించుకోవాల్సిన అవసరం తనకి లేదన్నారు. హిందువు మతానికి చెందిన వారే తనమీద ఈ తరహాలో దుష్ప్రచారం చేయడం బాధకలిగిస్తోందని, వారి అమాయకత్వానికి జాలికూడా కలుగుతోందని తెలిపారు. సమతా మూర్తి క్షేత్రానికి ప్రవేశ రుసుము గురించి విలేఖరులు ప్రశ్నించగా తాను సమానత్వం గురించి పరులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాననీ., డబ్బు సంపాదన గురించి తానెప్పుడూ ఆరాట పడలేదనీ, తనకి ఏ బ్యాంక్ లోనూ ఒక ఖాతా కూడా లేదని, ప్రవేశ రుసుము కేవలం ఆలయ నిర్వహణ కోసం మాత్రమేనని మీడియా వారికి తెలిపారు. ప్రసాదానికీ, దర్శనానికీ టిక్కెట్లే లేవనే విషయం విలేఖరులు గుర్తించాలన్నారు.
ముఖ్యమంత్రితో విభేదం ముమ్మాటికీ అవాస్తవం
సిఎం కెసిఆర్ కి, తనకి మధ్య వచ్చిన గ్యాప్ గురించి అడిగిన ప్రశ్నకు వివరణ ఇస్తూ, తమ మధ్య ఎటువంటి విభేధాలూ లేవని చినజీయర్ స్వామి స్పష్టం చేశారు. తానొక భిక్షుక సన్యాసిననీ, సాధారణ సాధువుననీ, రాజకీయం వైపు వచ్చే ఆలోచన గానీ, రాజకీయాలు చేసే చతురత గాని తనకు లేవన్నారు. ఎవరైనా తనకు దూరంగా ఉంటే తనకేం సంబంధం లేదని వివరణ ఇచ్చారు. తాను ఎవరితోనూ అత్యంత చనువుగా తిరగమని తేల్చి చెప్పారు. మంచి లక్ష్యంతో మంచి కార్యక్రమాలు చేయాలని, మోసం చేయకుండా ఉండాలనే మార్గంలో తాను నడుస్తానని ఆయన వివరించారు.
ఇలా ఉన్నందునే తాను ఏ విషయమై ధైర్యంగా మాట్లాడుతున్నాననీ, 1986 లో చల్లా కొండయ్య కమిషన్ కు వ్యతిరేకంగా కూడా ధైర్యంగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఎవరైనా ఏదైనా సలహా అడిగితే చెప్పడం, ఏదైనా పని చేసి పెట్టాలని ఎవరైనా కోరితే ఆ పని చేసి పెట్టడం తమ బాధ్యత అని చెప్పారు. ఒకవేళ ఏదైనా బాధ్యతను తాను తీసుకుంటే ఆ బాధ్యతను నెరవేర్చేందుకు వందకు వంద శాతం న్యాయం చేస్తానని వివరించారు. అంతేగాని తనకు ఫలానా బాధ్యతలు కావాలని కూడా ఏనాడూ ఎవరి వెంటా పడి తిరగలేదన్నారు. పిలిస్తే వెళతామనీ, లేదంటే చూసి ఆనందిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు మాంసాహారం తగదని చెప్పారనే ప్రశ్నకు సమాధానంగా సాంప్రదాయ ధీక్ష తీసుకోవాలనుకునే వారిన కోసం మాంసాన్ని ముట్టద్దన్నాననీ, అది అందరికీ వర్తిస్తుందని తాను చెప్పలేదన్నారు.
వారి బాటలోనే నేనూ
జన్మరీత్యా దళితుడైన తిరుమళిసై మనుషులలో జాతి భేషజాలను పక్కన పెట్టి అందరికీ సమానంగా విద్యాబుద్ధులు నేర్పిన సంఘటననీ, కాంచీపురంలో ఆదివాసీలకు విద్యాబుద్ధులు నేర్పిన ఆచార్య నల్లాన్ చక్రవర్తులవారు కాలం చేస్తే ఆయన చరమ సంస్కారాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసిన ఒక బ్రాహ్మణుల బృందాన్ని ఊరి వాళ్లు వెలివేయడంతో బయలుదేరిన ఆ బ్రాహ్మలు తమిళనాడు కర్ణాటక మధ్య అడవులలో బస చేసి అక్కడి ఆదివాసీలందరినీ చక్కటి భక్తులుగా, జ్ఞానవంతులుగా తీర్చి దిద్దారని, అటువంటి వారి బాటలోనే తానూ పయనిస్తున్నాననీ, తనమీద ఎటువంటి దుష్ప్రచారం చేసినా ప్రజలకు మేలు చేయడానికి, సమానత్వ జ్ఞానాన్ని పెంపొందించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాననీ చినజీయర్ స్వామి వివరించారు.