దళితబంధు ఎంపికపై చెల్కలపల్లి ఆనందం
మీరు గౌరవంగా బతకాలన్నదే సీఎం కేసీఆర్ కోరిక
వారంలో మీ బ్యాంకు ఖాతాలో దళితబంధు10 లక్షలు జమ
సిద్దిపేట: మా చెల్కలపల్లి గ్రామం దళితబంధుకు ఎంపికైంది. చాలా ఆనందంగా ఉన్నదని దండాలయ్య హరీశన్న అంటూ తమ సంబురాన్ని మంత్రి హరీశ్ రావుతో పంచుకున్నారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం చిన్నకోడూర్ మండలం చెల్కలపల్లి గ్రామస్తులు పూలబొకే, శాలువతో మంత్రిని సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వారం రోజుల్లో మీ బ్యాంకు ఖాతాలో దళితబంధు 10 లక్షలు జమ అవుతాయని, వాటిలో 9 లక్షల 90 వేలు ఇస్తారని, మిగతా 10 వేలు మీ భద్రతకై గ్రామ పంచాయతీలో నిధిగా ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వం ఇస్తున్న దళితబంధు డబ్బులు వృథా చేసుకోకుండా.. బతికే పని చేసుకోవాలని హితవుపలికారు. మీ జీవితంలో మీరు వెనుక అడుగు వేయొద్దని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆదాయం వచ్చే పనులు చేసుకుందామని, బతికే పని చేసుకుంటూ ప్రణాళికతో ముందుకెళ్దామని గ్రామస్తులకు కాసేపు అవగాహన కల్పించారు. త్వరలోనే సమావేశమై మీతో సహపంక్తి భోజనం చేసి ఒక్కొక్కరితో చర్చిస్తానని చెల్కలపల్లి గ్రామస్తులకు వారంలో తిరిగి కలుద్దామని మంత్రి హరీశ్ మాట ఇచ్చారు. కార్యక్రమంలో వైస్ ఏంపీపీ కీసర పాపయ్య, గ్రామ సర్పంచ్ లక్కపాక జీవిత బాబు, కనకవ్వ, విజయ, వజ్రవ్వ, స్వప్న, మల్లవ్వ, లచ్చవ్వ, తిరుపతి, శంకర్, శ్రీనివాస్, ఎల్లం, మధు, భూపేష్, ముత్యం తదితరులు పాల్గొన్నారు.