Monday, January 20, 2025

తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌గా చిన్నారెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌గా మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అపారమైన రాజకీయ అనుభవం ఉనన చిన్నా రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా పని చేశారు. పార్టీ తెలంగాణ ఎంఎల్‌ఎల ఫోరం చైర్మన్‌గా తన వాణి వినిపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి టికెట్‌ను మొదట చిన్నారెడ్డికి కేటాయించిన కాంగ్రెస్ ఆ తర్వాత ఆ టికెట్‌ను తూడి మేఘారెడ్డి కి మార్చింది. ఈ సందర్భంగా సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ అధిష్టానం చిన్నారెడ్డికి భరోసా ఇచ్చింది. ఆ తర్వాత ఆయన రాజ్యసభ టికెట్ ఆశించినా అదీ దక్కలేదు. ఈ నేపథ్యంలో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సమర్థతకు పట్టం కట్టిన సిఎం రేవంత్ రెడ్డి
క్రమశిక్షణకు మారుపేరు అయిన చిన్నారెడ్డిని ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించడం సమర్థకతకు పట్టం కట్టినట్టైంది. చిన్నారెడ్డి 4 సార్లు వనపర్తి ఎంఎల్‌ఎగా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ సమర్థ నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

చిన్నా రెడ్డికి క్యాబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజకీయాల్లో మిస్టర్ కూల్ గా, రాజకీయ చాణుక్యుడుగా పేరు గాంచిన చిన్నారెడ్డి క్యాబినెట్ మినిస్టర్ ర్యాంకు కలిగిన రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ పదవికి వన్నెతెస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజకీయాల్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా క్రమశిక్షణకు మారుపేరు. అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా, రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా, తెలంగాణ రీజినల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ గా, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా చిన్నారెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మెఘా రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడం కోసం తన వంతు కృషి చేశారు. చిన్నారెడ్డి సమర్థతను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ హోదాలో రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. ఎంఎస్‌సి ( అగ్రికల్చర్ ), ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి పట్టా పొందిన చిన్నారెడ్డి పిహెచ్‌డి డాక్టరేట్ ను మలేషియా యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు. మహబూబ్ నగర్ జిల్లా గోపాల్ పేట్ మండలం జయన్న తిరుమలపూర్ చిన్నారెడ్డి స్వగ్రామం. హై స్కూల్ విద్యాభ్యాసం వనపర్తిలో సాగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News