Monday, December 23, 2024

మాటను ఒడిశెల రాయినిచేసి విసరడం తెలిసిన కవి

- Advertisement -
- Advertisement -

చిన్ని నారాయణరావు తెలుగు కవిత్వానికి పాత కాపు. జీవితం ఓ విజయం, అంతర్ముఖం, గుండెదీపం, గంపకూడు వంటి ఆర్ద్ర కవితా సంపుటులు, మాట, దాహం వంటి ఆలోచనాత్మకమైన దీర్ఘకవితలు వెలువరించిన కవిత్వ స్వాప్నికుడు. ఇప్పుడు ‘బతుకొక ఉత్సవం’ అంటున్నాడు. ఎంత బాగుందీ మాట. ఇస్మాయిల్ గారు ఒకచోట ఠాగూర్ సౌందర్య జీవన విధానం గురించి చెబుతూ ‘జీవితోత్సవం’ అన్నారు. నారాయణరావు కూడా బతుకును కేవలం బతుకుగా కాక ఒక ఉత్సవంగా బతకమంటున్నాడు. దీన్నే మనవాళ్ళు పాజిటివ్ థింకింగ్ లేదా సానుకూల దృక్పథం అంటున్నారు. అటువంటి సానుకూల దృక్పథం వుంటే ఎదురైన సమస్యల మేరువులు మైదానాలై సాగిలపడతాయంటాడు కవి.‘సమస్యలకు పరిష్కారాలుంటాయి/నదికి పాయలున్నట్లు/ పరిష్కారాల్లేని జీవన పోరాటాలు/ ఎప్పుడూ వుండవు‘ అనే సానుకూల దృక్పథంతో ఈ కవితా సంపుటి ప్రారంభమవుతోంది. ఒక కావ్య సంపుటికి ఇంతకంటే గొప్ప శుభారంభం వుంటుందని నేను అనుకోను. చీమలకూ, కెరటాలకు కూడా సమస్యలుంటాయి.

అయితే అవి నిష్క్రియాపరత్వాన్ని దూరం పెట్టడం వల్ల సమస్యలను అధిగమించాయి అని చెబుతూ సమస్యల సమాధుల మీద నుంచి ఛాతీలో దాక్కొన్న ఆత్మను/ వెలికి తీసైనా సరే/ స్వప్నాల్ని సాకారం చేస్తేనే కదా/ బతుకొక ఉత్సవం అయ్యేది/ ఊపిరి వేడుకగా పరిణమించేది‘ అని బతుకును ఉత్సవంగా చేసుకోవడానికి నిష్క్రియాపరత్వాన్ని దూరంగా వుంచడమే అనే ’కీ’ని మనకు అందిస్తున్నాడు కవి.బతుకును ఉత్సవంగా చేసుకున్న కవి మానవ సంబంధాల మనుగడ ప్రశ్నార్థకం అయినచోట కలవరపడకుండా ఎలా ఉండగలడు . మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు భారమై పశువు లను కబేళాకు తరలించినట్లు వారిని వృద్ధాశ్రమాలకు చేర్చడం ఒక ఎత్తయితే, ఆస్తుల కోసం హతమార్చడం, బతికుండగానే శ్మశానాలకు తరలించడం వంటివి తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇటువంటి సందర్భాలను అపురూపంగా చూసుకోవాల్సిన/ అమ్మతనాన్ని /కడతేర్చడం/ పతనానికి పరాకాష్ట/ ఏ విస్పోటనానికో ఇది సంకేతం‘ అని హెచ్చరిస్తాడు. అంతేకాదు, మాతృత్వం మరణిస్తే/మనిషి గమ్యం శూన్యం అనీ, ఆ విస్ఫోటనాన్ని మన ముందు వుంచుతాడు.

మానవజీవితంలో కాలంతోపాటు దైహికంగా వచ్చే అనివార్యమైన పరిణామం వృద్ధాప్యం-మానవుడు జరను జయించే ప్రయత్నంలో జరిగే పరిశోధనలో మంచి ఫలితాలు వస్తున్నట్టు వార్తలు సూచిస్తున్నాయి. అది సాధ్యపడితే జీవిత కాలానికి కొంత పొడిగింపే కానీ మరణజయం కాదు. అది కూడా మిలియనీర్ సంపన్నులకే కానీ సామాన్యుడికి కాదు. సామాన్యుడు వృద్ధాప్యాన్ని ఎదుర్కోక, ఎదుర్కొని జీవించక తప్పదు. తెలుగు కవిత్వంలో వృద్ధాప్యం మీద ఎంతో కవిత్వం వచ్చింది. ఎన్నో దీర్ఘ కావ్యాలూ వచ్చాయి. నారాయణరావు కూడా వృద్ధాప్యానికి ఆశ్రయంగా వుండే ఆశ్రమాల పట్ల కవితాత్మకంగా స్పందించారు. ’నాకో వృద్ధాశ్రమం కావాలి’ కవితలో.‘తీరం చేరని వ్యక్తుల జీవితాల్లో వెల్గులు పూయించేవి/నడిసంద్రంలో ఆలంబనగా నిలిచేవి అక్కున చేర్చుకునేవి/ వృద్ధాశ్రమ ఉద్దీపన వాకిళ్ళే కదా’ అంటారు. వృద్ధాశ్రమాలను ’ఉద్దీపనవాకిళ్ళు’ అనడంలోనే ఆశ్రమాలు నిర్వర్తించే గురుతర బాధ్యతను, సేవా తత్పరతను కవి సూచించాడు.

కవి చుట్టూ వున్న సమస్యలపై ఎంత దృష్టి సారించినప్పటికీ తాను నిలబడి వున్న నేల తన స్థానీయతను గుర్తు చేస్తూనే వుంటుంది. ఉపరితలం మీద నుండి చూసినప్పుడు స్థానీయతలు వేటికవే విడి విడి అస్థిత్వాలుగా కనపడతాయి కానీ క్షేత్రస్థాయిలో అన్నిటినీ కలిపి చూసినప్పుడు అది గొప్ప సంస్కృతీ వారసత్వంగా గోచరిస్తుంది. ఏ ప్రాంతపు స్థానీయత అక్కడి ప్రత్యేకతను పరిమళాన్ని తెలియజేస్తుంది. ఈ కవి విక్రమసింహపురి (నెల్లూరు) జిల్లాకు చెందిన వారు. నెల్లూరు అనగానే ఉభయ కవిమిత్రుడు తిక్కన నుండి తిక్కవరపు పఠాభి వరకు గుర్తుకొస్తారు. శ్రీనాధుని నెల్లూరి నెరజాణలు చాటువు గుర్తుకొస్తుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు నుండి భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గుర్తుకొస్తారు. జమీన్ రైతు నుండి విశాలాక్షి పత్రికలు గుర్తుకొస్తాయి- ఇంకా నెల్లూరు మొలగొలుకులు ధాన్యం నుండి పెద్దారెడ్డి చేపల పులుసు కూడా గుర్తుకొస్తుంది. తెలుగు నేలమీద ప్రతీ ప్రాంతానికీ ఇలాంటి స్థానీయతలు కోకొల్లలు. ఈ పీఠికా కర్త తన స్థానీయత నేపథ్యం నుండి ’యానాం కవితలు’ పేరుతో ఒక కవితా సంకలనమే వె లువరించారు.

ధాన్యాల్లో నెల్లూరు మొల గొలుకుల ధాన్యం రాజనాల వంటివి. ఆ ధాన్యానికి అంత ప్రశస్తి రావడానికి నెల్లూరు సీమ మట్టిలో/తియ్యందనాలు ఉబికి వెల్లువలై/మొలగొలుకులై మొలకెత్తాయేమో అని కవి ఆశ్చర్యపోతాడు. పెన్నమ్మ నీటి మహిమ, నేలతల్లి స్తన్యం లోని తీపి మొలగొలుకులకు అంతటి తీపిని తెచ్చి పెట్టిందంటాడు- ఇక మొల గొలుకుల అన్నంతో నెల్లూరు చేపల పులుసు, గోంగూర పచ్చడితో కలిపి తింటే స్వర్గమే భువిపై నాట్యం చేస్తుందంటాడు. అంతకంటే ఏం కావాలి? నెల్లూరు వాసి మాత్రమే రాయ గలిగిన కవిత మొలగొలుకులు- ఈ కవిత రుచి చూశాక మిగతావి రుచిస్తాయా? ప్రయత్నిద్దాం. కొత్తనీరు వచ్చాక పాతనీరు కలకబారుతుంది. కొత్త ఆవిష్కరణలు వచ్చాక పాతవి మరింత మరుగున పడిపోతాయి. అలాంటిదే ఫొటో స్మృతికవిత. ఈ కవిత చదువుతుంటే డా.సి. నారాయణరెడ్డి గారి ’అమ్మబొమ్మ’ కవిత స్మృతిలో మెదిలింది./ ఇప్పుడు ఫొటో/ పల్లవిలేని పాటయ్యింది పందిరిలేని తీగయ్యింది/ చట్రంలేని చిత్రమయింది అన్న మాటలతోనే మొత్తం కవిత ఆత్మ ఆవిష్కృతమైంది. ఫుట్పాత్ వ్యాపారాల మీద రాసిన రోడ్డు మ్యూజియం, బంట్రోతు కవితలు కవి ఎవరి పక్షమో చెప్పక చెప్తాయి./ వీటన్నిటితో పాటు కవి సామాజిక దృష్టికోణాన్ని పట్టి యిచ్చే కవితలు అనేకం వున్నాయి.

రెండో వ్యవసాయిక దేశమైన భారతదేశ రైతుల అస్తిత్వానికి ముప్పు కలిగించే చట్టాలను బలవంతంగా రుద్దడంపై భారత రైతాంగం ఏడాదికి పైగా నిరవధిక సమ్మె, వందలాది రైతుల మరణం తర్వాత ఆ చట్టాలను ఉపసంహరించుకోవడం. ’మాతృస్పర్శతో అన్నం పెట్టిన వ్యక్తిని/ అనాధను చేస్తే అతను/ రోడ్డెక్కాడు/ ధరణీపుత్రుడు చిందించిన స్వేదం/సేద్యమై కాటేస్తే రాబోయే రోజుల్లో పట్టెడన్నం కోసం/ పోరాటాలు చేయాల్సి వస్తుందని’ కవి హెచ్చరిస్తాడు.ప్రపంచాన్ని పట్టి కుదిపేసిన మహమ్మారి కరోనా కాలంలో కవి ఈ రచనలు చేశాడు. అందుకే ఈ సంపుటిలో పదుల సంఖ్యలో కరోనాపై కవితలు, సందర్భాలు వున్నాయి. ఏ కవితను తడిమినా ఒకటే మృత్యుభయం, మరణశోకం. ‘కాలం నిశ్శబ్దంగా చురకత్తులు విసురుతున్నది/మనిషి ఆకురాలినంత ధ్వని ఆవహించి/మరణ వాంజ్ఞలంలోకి జారుకుంటున్నాడు. వంటి వాక్యాలు ఇప్పుడు చదువుకున్నా వెన్నులో వణుకు మొదలవుతుంది. ఇలా చిన్ని నారాయణరావుగారు ఏ సందర్భంలో రాసినా మాటను వడిసెలరాయిని చేసి వొడుపుగా విసరడం తెలిసిన కవి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News