Sunday, January 19, 2025

తీరని పెనుదాహ చింతనమే

- Advertisement -
- Advertisement -

ఒక కవి చేసే పని ఏంటంటే ఒక ఆలోచనని మనలో మేల్కొలపడమే.ఒక అనుభూతినో,ఒక సమస్యనో మన ముందుకు తెచ్చి మనల్ని అందులోకి నెట్టడమే. అందులోనూ మానవ జీవనం సంక్లిష్టమయం చేసుకుంటున్న మనుషులున్న ఈ సమాజాన, ఆ సంక్లిష్టతలను అర్థం చేయించే పనిని ,ఈ సమాజం ఋజు మార్గంలో ప్రయాణించాలని కోరుకునే కవి,రచయిత, కళాకారుడు,శాస్త్రవేత్త,చరిత్రకారుడు,సామాజిక వేత్త, తత్త్వవేత్తలు చేస్తారు.ఒక్కోసారి కవి వీరందరి తరుపునా వకాల్తా పుచ్చుకొని,వాళ్ళందరూ కలిసి చేయాల్సిన పనిని ఒకడే భుజానికెత్తుకుంటాడు.అటువంటి బరువైన,బాధ్యత కల పనిని భుజానికెత్తుకున్న దీర్ఘకవిత ’దాహం..దాహం..’అంతకు ముందు ’ మాట ’ అనే దీర్ఘకావ్యం రాసి ఒప్పించిన చిన్ని నారాయణరావు గారు ఈ సారి సమాజం ఎన్ని రకాల దాహార్తితో కునారిల్లుతుందో పదమూడు విభాగాలుగా ఈ దీర్ఘ కవితలో విశ్లేషించి చెప్పారు

.అపసవ్య దిశలో దొర్లిపోతున్న ఈ సమాజం అనేక ప్రలోభాలతో కునారిల్లుతోంది.అది సమాజాన్ని ఒక క్రమ పద్దతిలో నడిపే ప్రభుత్వ అధికారి, ఒక రాజకీయ నాయకుడు,వ్యాపారవేత్త, విద్యావేత్త లాంటి వాళ్లూ ధన దాహంతో చేస్తున్న పనులను నిలదీస్తున్నాడు కవి.’దేశం శిరసు వంచి సిగ్గుతో తల దించుకునేలా/ నిత్యం తపనతో ప్రజ్వరిల్లే / ఈ గగన తలాన్ని దాటిపోయే / ధనదాహం ఏమిటి ?’ కేవలం కొంతమంది క్రోనీ క్యాపటిలిస్టుల దగ్గర సంపద పోగయి దేశం దివాళా తీయడం,దేశ సామాన్య పౌరుడి జీవనం అస్తవ్యస్తమవడం చూస్తున్నాం.’అంతటికీ అల్లుకుపోయిన / చిత్ర విచిత్రం ఈ దాహం / పుట్టలా పాములు పెట్టిన / పుట్టల్లా దేశమంతా / ఎటు చూసినా దాహపు విద్రోహం’ అంటూ కవి కోపంగా వాపోతున్నాడు.
సమాజ చలనగతిలో మరో అడ్డుగోడ బంధుప్రీతి.ఈ బంధు ప్రీతి మనం అధికారుల్లో,రాజకీయ నాయకుల్లో, వ్యాపారవేత్తల్లో,ధనిక భూస్వాములలో ఎక్కువగా చూస్తుంటాం.అర్హులను తోసిరాజని కాంట్రాక్టులు,పనులు వీరికి కట్టబెడుతుంటారు.’శుభ్రమైన విందులో విరుగుడు పడ్డట్టు / స్వచ్ఛమైన పాలనలో కత్తెర పడ్డట్టు / విలువైన పనిలో చీకటి కమ్మినట్లు / వెలుగులు కమ్ముకొస్తున్న శుభవేళ /

అంతర్లీనంగా అడ్డుకట్ట వేసే / బలమైన ఆయుధం మన బంధువన్న మూఢత్వం’ బలపడటం, దానిని వదులుకోలేక పోవడం ఒక వదలలేని దాహమని కవి అంటున్నాడు. మనకు మన అనే దాహం వుండాలని కవి అంటున్నాడు. ఇది వుండాల్సిన దాహమా లేదంటే వదులుకోవాల్సిన దాహమా చర్చించాల్సిందే.మనతనం దాహం అనే దాహం కొన్ని చోట్ల కులం రంగు పులుముకోవచ్చు.కొన్నిసార్లు మన ఆశయాలు కలిగిన సమూహాల రూపును తీసుకోవచ్చు. ’మనం నిర్మించే స్వాగత ద్వారాలు / కొందరికే ఆహ్వానం పలుకుతాయి./ మనం వెలిగించే దివిటీలు/ కొందరికే వెలుగులు పంచాలి’ అనడం ద్వారా ఇలా అనుకోవచ్చు. వారసత్వ దాహం మరోటి.మన తర్వాత మనని కొనసాగించడానికి వారసత్వం కావాలని ఎవరైనా అనుకుంటారు.అది సరయిన దిశలో వుంటే ప్రశ్నే లేదు. కానీ అది కుటుంబపరమయిన వారసత్వం కాకుండా,ప్రజా జీవితాలను ప్రభావితం చేసే వారసత్వం అయితే కొంత ఆలోచించవలసిందే. ఎందుకంటే..వారసత్వం అలివికాని అనుబంధం కదా / ఎన్ని న్యాయాలు భువిపై విలసినా / బంధుత్వ న్యాయం / వారసత్వ న్యాయంలా / మరేదీ పరవశించదు.’ అని కవి అంటున్నాడు. మాట దాహం కూడా నేడు సమాజంలో చొరబడింది.

మనిషికి మనిషికి మధ్యన మాట ఒక వారధి లాంటిది.నేడు నెలకొన్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల మనిషి మాటకు దూరమై మెషీన్లకు దగ్గరయాడు.అందుకే కవి ఆవేదనగా ’మాట దాహంతో ప్రజానీకం / కుళ్ళి కునారిల్లుపోతున్నది./ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కొండెక్కాక / విస్తారమైన మానవ అడవిలో / మనిషి ఒంటరి పక్షి అయిపోయాడు.’ అంటున్నాడు.కుటుంబ బాంధవ్యాల మధ్య మాట కరువైపోయి, ఆత్మీయతలు అరుదయిపోయాయి. యాంత్రికత ప్రవేశించి మనిషిని మనిషిలా వుంచకుండా డొల్ల చేసేస్తుంది.’ఆకలికి ఆహారం లాంటిదే కదా / వేదనకు ఔషధం లాంటిదే కదా / మనసుకు మాటంటే !’ అని కవి మాట మనిషికి ఎంత జీవ ధాతువో గుర్తు చేస్తున్నాడు మునుపు మాట మీద ఒక దీర్ఘకవితే రాసిన ఈ కవి చిన్ని నారాయణరావు గారు.
మానవ జీవితాల్లోకి చొచ్చుకొచ్చి,మనిషిని గుప్పెట్లోకి తీసుకున్న మరో సాంకేతిక మాయ సెల్ ఫోన్.ఇదొక మంత్రదండం లా మనుషులను ఆడిస్తోందని..ఇదొక తీరని దాహమని కవి ఊహిస్తూ దీనిని మంత్రదండ దాహం అంటున్నాడు.’ఓ చిన్న సైజు మెషీను ప్రపంచాన్ని / మనిషి చేతిలో బంధించే నక్షత్రమై / గుండెను తగుల్తూ జేబులోకి చేరింది.’అంతే కాదు.ఇదొక విరాట్ వ్యాపారానికి కేంద్ర బిందువయింది.మనిషిని కట్టు బానిసను చేసుకుంది.

దీని వల్ల ఎన్ని అనుకూలతలు వున్నాయో,అన్ని ప్రతికూలతలు వున్నాయి.సాంకేతికతను సవ్యంగా వాడకపోతే దుష్ప్రభావాలు వుంటాయి.బంధాలు అనుబంధాలు దూరమవుతాయి.’కాపురాల్ని కూల్చినా / కన్నపేగు కువకువలాడినా / మనిషికిదే దాహం / మనిషి దానికే దాసోహం’ అంటాడని కవి ఈ దాహాన్ని అదుపులో వుంచుకోవాలని అంటున్నాడు. సమాజాన్ని,ముఖ్యంగా యువతను పెడదోవ పెట్టిస్తున్న మరో వైపరీత్యం..సెక్స్.అంతర్జాలంలో విపరీతంగా అందుబాటులో వున్న ఈ సెక్స్ సైట్లు, అంగాంగ ప్రదర్శనలు,సినిమాలు యువత ఆలోచనలు పెడతోవ పట్టిస్తున్నాయి.ముఖ్యంగా యువకులు ఈ కామ దాహానికి లోనవుతున్నారు.ఈ దాహం తీర్చుకోవడానికి ఎంతకయినా తెగిస్తున్నారు.’పురుషుని హృదయం ఇప్పుడు నగ్నత్వాన్ని / ఆరాధిస్తోంది,ఆ దాహంలో ఓలలాడుతోంది/ కన్పించే స్త్రీలో మాతృత్వాన్ని కాక / పడక సుఖాలకై ప్రాకులాడ్డం / నిరంతర పాకులాట అయిపోయింది.’ అని ఈ అస్తవ్యస్తని అసహనంతో ప్రశ్నిస్తున్నాడు.మనుషుల్లో వుండే మరో బలహీనత ప్రచార దాహం.తనను తాను హెచ్చించి మంది చేత గుర్తించబడాలనే గుర్తింపు సంక్షోభం తో ఎక్కువ మంది బాధపడుతూ వుంటారు.చేసేది ఇసుమంతయినా దానిని కొండంతగా చెప్పుకోవాలని తాపత్రయ పడుతుంటారు.

సహజంగా మనం రాజకీయ నాయకుల్లో, నకిలీ ప్రజాసేవకుల్లో మనమీ లక్షణాలు గమనిస్తాం.’చేస్తున్న గోరంత కార్యానికి / కొండల్ని వేదిక చేసుకోవాలన్న..భూన భోంతరాళాలు దద్దరిల్లేలా / ప్రచార సభలు / సంరంభ సభా వేదికలు’ అని కవి వారిని ఎద్దేవా చేస్తున్నాడు.అది తన సహ కవుల్లో కూడా పొడసూపినపుడు వారికీ చురక అంటిస్తున్నాడు. ’కాసింత కవిత్వం విరిస్తే / ఓ ఆలోచన రూపు దాలిస్తే / యాప్‌లన్నీ నింపి లైకుల కోసం / ఎదురుచూసే ప్రచారార్భాటాలు’ .ఈ ధోరణి సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పెరిగింది.వీరి వలన సాహిత్యానికి చెరుపు. విద్య,వైద్యం,ఆర్థిక సేవలు అత్యున్నతంగా వున్న సమాజాలనే అభివృద్ధి చెందిన సమాజాలు అంటారు.కొన్ని ఆధునిక సమాజాలలో విద్య,వైద్యం ప్రజలకు ఉచితంగా అందుతాయి.కానీ దురదృష్టవశాత్తు కొన్ని సమాజాలలో వైద్యం బహు ఖరీదు.బహుదా ఆదాయ మార్గం.ప్రజల ఆరోగ్యాల మీద,వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి చేసున్న అమానవీయ వ్యాపారం.కొంత మంది పెట్టుబడిదారుల కార్పోరేట్ల ఆసుపత్రులే కాదు.కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ప్రజలకు వైద్యం అందకుండా నిర్లక్ష్యంగా ప్రజల జీవితాలతో ఆటలాడుతుంటాయి.

ఇక్కడ మేట వేసిన నిర్లక్ష్యం,లంచగొండితనం,సౌకర్యాల లేమి ప్రజలను ప్రైవేట్ ఆసుపత్రుల వైపు నడిపిస్తున్నాయి.సాధారణ ప్రజలను వైద్యం పేర దోచుకునే ఒక వికృత వ్యవస్థ ఇక్కడ ఊడలు దిగి వుంది.’దోసిళ్ళతో నా కన్నీళ్ళను / వెల్లువవుతున్న నా వేదనలను / అంచెలంచెలుగా, మందులుగా / ఇంజెక్షన్ల రూపంలో / అమ్ముకుంటున్న దుర్మార్గ వ్యవస్థ ఇది / వ్యాధిగ్రస్తుల బాధల్ని రాద్ధాంతం చేసి / రక్తపు బొట్లుగా పరీక్షా కేంద్రాల్లో /విడిది చేయిస్తూ వైద్య కామాందుల / రాక్షస నీతి ఇది’ అని అడగకుండా కవి వుండలేక పోయాడు.కరోనా కాలంలో ప్రజలకు అండగా వుండాల్సిన ప్రభుత వైద్యం పేరుతో పాల్పడిన నిసిగ్గు దోపిడీ చూసాం.కళ్ళ ముందే జరుగుతున్న కార్పోరేట్ ఆసుపత్రుల నిలువుదోపిడీని కళ్ళప్పగించి చూస్తూ వుండిపోయిన ప్రభుత్వాన్ని చూసాం.నిస్సహాయంగా వైద్య సహాయం అందక అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన వేలాది మందిని చూసిన కవి హృదయం భగ్గున మండింది.ఈ వైద్య దాహం ఏమిటని సమాజాన్ని పట్టుకు నిలదీస్తున్నాడు. ’కోకిలల్లా పూలు పరచాల్సిన చోట / శిశిరాల్ని మూటగట్టి ఇచ్చే / దౌర్భాగ్య జీవుల్ని ఏమనాలి ?’ అని కన్నీళ్ళతో అడుగుతున్నాడు.వైద్యం ఒక మహా వ్యాపారమయిన చోట,

మందులు మాఫియాల చేతుల్లో చిక్కుకుపోయిన చోట కవి ప్రశ్నలు ఏ చెవిటి రాజ్యానికీ వినిపించవు. మానవ సమాజం మొత్తం నడిచే ఇరుసు ప్రేమ.కానీ రాను రాను ఈ భావన కృత్రిమమైనదిగా అయిపోయింది.స్త్రీ పురుషుల మధ్య సహజంగా ఇరువురికి వుత్పన్నమవవలసిన ప్రేమ దారి తప్పి, బలవంతపు ప్రేమ దాహంగా మిగిలిపోయే దుస్థితికి మనం చేరుకున్నాం.ప్రేమ అనే భావన ఇప్పుడు కామం అనే భావనకు సమానార్థకంగా కుదించబడింది. అపరిపక్వ ఆలోచనలతో పక్వానికి వచ్చిన వయసును, కోరికలను బలవంతంగానయినా తీర్చుకునేందుకు ఎగబడుతున్నారు. ’ఈ సమూహాల్లో నేనో ఏకాంత సమూహాన్నై / తరగని నా దాహార్తిని తీర్చుకునే / సమయం కోసం ఎదురు చూస్తున్నా..’ ననే ధోరణి ప్రబలింది. ప్రణాళిక రచించి.. ముగ్గులోకి లాగి తన కోరికలు తీర్చుకునేందుకు ప్రయత్నించడమే నేడు సమాజంలో జరుగుతున్న అనేక అత్యాచారాలకు కారణం.ఈ విపతీత దాహం ప్రేమ అనిపించుకోదు.ప్రేమ ఎదుట మనిషి ఉన్నతిని కోరుకుంటుంది తప్ప తన ప్రేమను వారించిన వారి పట్ల పగను పెంచుకొని, మృత్యువులా మీద పడదు.

మైకు దాహం వల్ల సమాజానికి వచ్చిన ముప్పు ఏమీ లేదు గానీ మానవ సమూహమయిన సమాజంలోని మనుషుల నేలబారు మనస్తత్వం తెలియజేస్తుంది.శ్రోతల అవస్థలను పట్టించుకోకుండా చేసే ఉపన్యాసం వ్యర్థం కదా. ’గంటల సమయాన్ని నీటి బిందువుల్లా / వెచ్చిస్తాడు / మాటల జాడ ఊటబావిలా ఊరిపోతుంది.’ విషయం ఆసక్తిదాయకం కాకుండా,ఊదరగొట్టే విషయాలు ఉపన్యాసం పట్ల విముకత కలిగిస్తాయి.దీనికి కవులు , కళాకారులను కూడా కవి మినహాయింపులు ఇవ్వలేదు. ’అంతర్గతంగా విషయ పరిణితి లేని / నేతలకు, రచయితలకూ / ఆడంబర మైకు దాహమెక్కువ !’ అని కవి అసహనంతో అనేశాడు.కనుక వాగాడంబరం వ్యక్తిత్వానికి హానికరం. విద్య వ్యాపారం అయినచోట దేశంలో ప్రతిభ తగ్గిపోతుంది.ధనికులు మాత్రమే చదువుకొని, మిగతా వర్గాలకు చదువును దూరం చేస్తే మన సమాజాలే నష్టపోతాయి.’మేనేజిమెంట్ కోటా కింద / కోటానుకోట్ల దండయాత్రలు / సాగించే సామ్రాజ్యాధినేతలు / డబ్బును పారించి విద్యకే /కళంకాన్ని ఆపాదించే…’ పరిస్థితులను కవి గ్రహించి వీటిని గర్హిస్తున్నాడు.’వాళ్ళ వాళ్ళ కోటాల కింద / కాసులు కొమ్ము కాసి పెట్రేగితే / చివరకు విద్యార్థి లోకం / నేర్చుకునేదేముంటుంది’ అని దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తున్నాడు.ఇది ఒక కీలకమయిన, మౌలికమయిన, బాధ్యత కలిగిన ప్రశ్న.సమాజం సమాధానం చెప్పాలి.

దాహం..అని ఇన్ని విభాగాలుగా మనకు సమాజంలోని లోపాలను ఎత్తి చూయించిన కవి దాహం అనే ఒక పదాన్ని ఒక ప్రతీకగా తీసుకున్నాడని అర్థం అవుతుంది. కవి ఇప్పుడున్న సమాజం ఇలా వుండకూడదని,మరింత మెరుగ్గా వుండాలని,ప్రజా క్షేమయుతంగా ప్రభుత్వాలు, అధికారులు,రాజకీయ నాయకులు,వ్యాపారులు,ఇతర కీలక స్థానాలలో వున్న వ్యక్తులు,వ్యవస్థలు వుండాలని కాంక్షిస్తూ రాసిన ’మనిషీ నీవొక వేటగాడివై / దాహతాపత్రయాలను అణచివేసే / దిశగా యుద్ధం చెయ్ / అప్పుడే ఈ దాహతాపత్రయం / సమాధి అవుతుంది !/ఈ సమాధుల రెక్కల మీద / పూల ఋతువులు ఉదయిస్తాయి !’ అని కవి ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న దాహాలకు ఒక ముక్తాయింపు మాత్రమే కాక ప్రతి మనిషి ఈ సమాజ లౌల్యాల మీద యుద్ధం చేయాల్సివుందనే కర్తవ్యాన్ని గుర్తుచేస్తాడు. ’మన మనిషిని మనం ఆలింగనం చేసుకోకపోతే / కొత్త చరిత్రనెలా ఆవిష్కరిస్తాం.”ఇళ్ళు నదుల్లా గలగలలాడుతూ కళకళలాడాలి కానీ /ఎడారులై ప్రవహిస్తే, ఉదయాలు అస్తమించవా !’ ’దాహం కాలిగిట్టల క్రింద మానవ సంబంధాలు / మట్టిగొట్టుకొని పోతున్నాయి ’ లాంటి కొన్ని తాత్వికను అద్దుకున్న వాక్యాలు పుస్తకంలో తగులుతాయి. ఇవి ఈ పుస్తకానికి అదనపు కవితాసొబగులు అద్దాయి. కవిత్వ నిర్మాణం పట్ల, వస్తు గాఢత పట్ల మరి కాస్త ధ్యాన మగ్నమయితే ఈ కవి చిన్ని నారాయణరావు గారి నుండి మునుముందు మేలిమి రచనలు ఆశించవచ్చు.

(పుస్తక ముఖచిత్రం, ముద్రణ నాణ్యంగా వున్నాయి )
పుస్తకం : దాహం..దాహం, కవి : చిన్ని నారాయణరావు, వెల : 120/-, ప్రతులకు : 94402 02942

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News