అతడి పాటలను ఎన్నింటినో వింటుంటాం. అతడు రాసిన పాటలెన్నో పాడుకుంటాం. అతడి పాటలతో ప్రభావితమూ అవుతాం. ఎంతగా అంటే తెలుగు నేల అక్షరాస్యతా శాతం 20% పెరిగేంతగా. రెండు లక్షల మంది బాలకార్మికులు బడిలో చేరేంతగా. ఆ పాట విన్న ప్రభుత్వాలు బాల కార్మిక నిర్మూలన పథకాలు చేపట్టేంతగా. కఠిన ముఖ్యమంత్రులను సైతం కన్నీరు పెట్టించేతగా సున్నితమైనది అతడి పాట. అలాంటి పాటే ‘నా చిట్టీ చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో/ నా సంకల మేడితో సాలిరువాలు దున్నినానయ్యో’. బహుశా చరిత్రలో తామే రాశామని ఎంతోమంది చెప్పుకుంటున్న పాట ఇదే కావచ్చు. నిజానికి ఈ పాట రాసింది, ఇంకెన్నో పాటలను అల్లింది నల్లగొండ జిల్లా, మేళ్ల దుప్పలపల్లి అనే పల్లెటూరి వాడు. ఏడవ తరగతిలోనే డ్రాప్ అవుట్ అయి ఎడ్లగాసి, నాగలి దున్ని వ్యవసాయానికి బాల్యాన్ని ఎరువుగా మార్చిన ఒకానొక చింతల యాదగిరి. అతడి పాటలు అందరికీ తెలుసు. అతడు మాత్రం ఎక్కువ మందికి తెలియదు. చింతల యాదగిరి విరివిగా రాస్తున్న కాలంలో ప్రజానాట్యమండలి కవి, గాయకుడిగా స్థిరపడి, సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. కనుకనే ఆయన రాసిన రాతలు, సాహిత్యం, ప్రజానాట్యమండలికి సొంతమై ఉన్నాయి. ఎందుకోగానీ ఆ సంస్థ రాతగాళ్ళను, పాటగాళ్ళను ప్రచారంలోకి రానివ్వదు. కనీసం పాటగాళ్లు కూడా ఆ పాట రాసినవారెవ్వరో చెప్పి పాడరు. ఒక వేళ రచయితే పాడినా తన పేరు చెప్పుకోడు. అలా ట్యూన్ చేయబడి, ఎవరికీ తెలియకుండా మిగిలిపోయినవాడే ఈ చింతల యాదగిరి. ఒక సంస్థలో పని చేసేవారు రాసినవి ఆ సంస్థకు, ప్రజల సొంతమే కావచ్చు. కానీ ఆ సంస్థ మూల ధాతువు అయిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఏమి రాసినా స్పష్టంగా వారి పేరుమీదనే ప్రచురితమవుతాయి. ఆ నాయకుల మేధస్సుగా, నైపుణ్యంగా లెక్కగట్టబడతాయి, దార్శనికతగా కీర్తించబడతాయి. మరి ఆ పార్టీ లీడర్లకు లేని వ్యవస్థీకృత విధానం కవులకు, కళాకారులకు మాత్రమే ఎందుకు వర్తిస్తుందో అర్థం కాని విషయం. ఇలాంటి ద్వంద్వ నీతి, సృజనకారుల పట్ల వివక్ష, ప్రజానాట్యమండలి తయారు చేసుకున్న, తీర్చిదిద్దుకున్న సామర్ధ్యం, నైపుణ్యం కలిగిన కవులు, రచయితలు, కళాకారులు ఎవ్వరికీ తెలియకుండా కనుమరుగైపోయారు. ఆ జాబితాలో ఉన్నది చింతల యాదగిరి ఒక్కడే కాదు. రాళ్లబండి నర్సింహా రాజు, దేవేంద్ర, బండి సత్తెన్న, సాంబరాజు యాదగిరి, మామిడి సైదులు, సన్యాసిరావు, పోతగాని, కన్నెగంటి, అనంగారి భాస్కర్ ఇలా ఎంతోమంది నేటి తెలంగాణ ప్రముఖ లిరిసిస్ట్‌లతో సమవుజ్జిగ నిలబడగలిగిన వారున్నారు. కానీ వారు పాట కవుల చరిత్రలో ఎక్కడా కనపడరు, వినపడరు. ఇలాంటి పరిస్థితుల్లో యాదగిరి రాసాడని తెలియకపోయినా తెలుగు సమాజం విన్న, పాడుకున్న అతడి పాటలు మచ్చుకు కొన్ని పరిశీలిద్దాం. ‘గుండెలోన రగిలిన బాధ కన్నీరై కారుతుంది/ కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది’ అంటూ చింతల యాదగిరి కంటికి కనిపించని బాధకు రూపంగా కన్నీటిని వస్తుగతంగా మనకు చూపెడుతున్నాడు. ఇలా అతను పాటను ఎత్తుకునే పల్లవే మనల్ని కట్టి పడేస్తుంది. కనుకనే ఈ పాటకు పలు యూట్యూబ్‌ల్లో పది మిలియన్లకు పైగా వ్యూస్ కనిపిస్తున్నాయి. పాట మొత్తం భావాన్ని ఒక్క పల్లవిలోనే పొదగడంలో, మొదటి లైన్లలోనే పదునైన పద ప్రయోగంతో, శ్రోతల్ని తన వైపుకు తిప్పుకోవడంలో చింతల యాదగిరికి ఉన్న టెక్నీక్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దానికి తోడు కష్టాలకు కారకులు ఎవరో తెలుసుకోమని తన పాటల ప్రశ్నలతో ప్రజల మెదళ్ళని రాజేస్తున్నాడు.
‘ఉన్న ఊరు కన్నా తల్లిని వదిలి పోలేనే/ నేల తల్లి పొదుగును కాదని చెదిరీ పోలేనే’ అని సరళంగా, సూటిగా, ఒక బలమైన స్టేట్‌మెంట్‌తో పాట ప్రారంభించాడు చింతల యాదగిరి. ఉన్న ఊరు కన్నతల్లి అనే పల్లె నుడికారాన్ని ఉపయోగించడంతో ఆగిపోకుండా, ఉన్న ఊరును నేలతల్లి పొదుగు అంటూ తనదైన పదప్రయోగం చేస్తూ మనల్ని తన పాటలోకి ఆకర్షిస్తాడు. ఆ పదబంధాల వేలు పట్టించి అక్షరాల చాల్ల వెంట తిప్పుతూ సమస్యను అర్థం చేయిస్తాడు. మనకి తెలియకుండానే మనను సమరానికి సన్నద్ధం చేస్తాడు. ‘అన్నదాత ఆగమవుతుండే/ పురుగుమందుతో ప్రాణాలొదిలిండే/ మట్టిబిడ్డడు మాయమవుతుండే/ మనలనిడిసీ వెళ్ళిపోతుండే/ కనికరించని కాలం తోడు/ కాటు వేసిన పాలన చూడు’ అని చింతల యాదగిరి విలపిస్తూ రైతుల ఆత్మహత్యలపై పాడిన ఈ పాట విన్నవారెవ్వరైనా ఏడవకుండా ఉండలేరు. అంతటి ఆర్ద్రతగా పాడాడు యాదగిరి. నిజానికి చాలామంది కవులు కరువుకు కాలాన్ని, ప్రకృతిని కారణంగా చూపిస్తారు. కానీ చింతల యాదగిరి మాత్రం రైతులను ప్రభుత్వం కాటు వేసిందని, లేదంటే లోకానికి అన్నంపెట్టే రైతు ఆత్మహత్య చేసుకోడని తీర్మానిస్తున్నాడు. అంటే సమస్య పట్ల ఇంతటి విషయ స్పష్టత, లోతైన అవగాహన కేవలం ప్రజాకవికి, ఉద్యమ కవికి మాత్రమే ఉంటుంది అనేది గమనించాల్సిన విషయం. ఇలా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన మార్క్సిస్టు దృక్పథాన్ని చింతల యాదగిరికి అందించినది మాత్రం ప్రజానాట్యమండలియే.
‘అమ్మ రొమ్ము పాలలోన ఫ్లోరీను జాడ/ అన్నమిచ్చె పంట మీద విషపు నీళ్ల నీడ/ పాకులాడే ప్రాయమందు పట్టుకుంది వెన్ను/ కీలుకీలు అరగదీసి సంపుతుంది నన్ను’ అంటూ నల్లగొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరిన్ సమస్య మీద పాట రాసిన మొట్టమొదటి వాగ్గేయకారుడు చింతల యాదగిరి. ఫ్లోరిన్ విష ప్రభావం నల్లగొండ జిల్లా నీళ్లలో ఎంత దారుణంగా ఉందో పైచరణంలో మనకు తెలుస్తుంది. సమస్య తీవ్రతను ఎలుగెత్తి చాటడానికి ఆవేదనతో, దుఃఖంతో, బాధతో ఈ పాట రాశాడని చెప్పవచ్చు. కొండంత భావాన్ని ఉండలా చుట్టినట్టు, ఫ్లోరిన్ విషపు నీళ్ల ప్రమాదాన్ని అమ్మ పాలలో కూడా ఫ్లోరిన్ ఉందనే ఒక్క మాటలో చెప్పడంలో కవికి ఉన్న లోతైన అవగాహనా కనిపిస్తుంది. ఇదే కాకుండా ‘నల్లగొండ నీ కడుపుల గనులున్నాయి/ అవి మా ఆకలి తీర్చలేని సిరులైనాయి’ అంటూ సహజ సంపదల గురించి రాస్తాడు. నల్లగొండ జిల్లాలోని పరిస్థితులను, సమస్యలను, గొప్పతనాన్ని, సహజ సంపదలను తన పాటలతో చింతల యాదగిరిలా చిత్రికపట్టిన పాట కవి లేడనడం అతిశయోక్తి కాదు. ‘నల్లగొండ జిల్లా తల్లి ఏమి పాపంజేసెనో/ ఏలేటోళ్ల చిన్నచూపుకు ఎక్కిఎక్కి ఏడ్చెనో/ ఎవరి దీపం ఆర్పినామని ఎందుకింత కక్షరో/ కోటి గొంతుల ఆశలన్నీ ఎనకబడ్డవి ఎందుకో’ అంటూ కైగట్టిన ఈ పల్లవి నిండా జాతీయాలు నుడికారాలే కనిపిస్తున్నాయి. పల్లె ప్రజల పలుకుబడులతో పాటగట్టినాడు కనుకనే నల్లగొండ జిల్లాలో రైతు, కూలీలు పొలాల్లో పనిచేస్తూ ఈ పాట పాడుకుంటున్నారు. ప్రజాభాషలో రాసిన పాటలు, జనం నాలుకలపై నడియాడు తాయనడానికి ఈ పాట చక్కని ఉదాహరణ.
ఇలా చింతల యాదగిరి వందల పాటలు రాశాడు. ఆయన రాసిన కొన్ని పాటలతో ‘తీగో నాగో ఎన్నియ్యలో’ అనే పుస్తకాన్ని మట్టిముద్రణలు, అలగడప వారు ముద్రించారు. అందులో ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యమని చెప్పవచ్చు. తను రాయడమే కాకుండా రాతగాళ్ళను తయారు చేయడంలో ప్రజానాట్యమండలి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. అలా తన సహచర్యంలో మనిమద్దె జానయ్య, మందుల విప్లవకుమార్, రాచకొండ రమేష్, అంజంపల్లి విప్లవ భగత్ సింగ్ లాంటి పాట కవులను తయారు చేసి సమాజానికి అందించాడు. అలా తెలుగు నేల మీద మూడు దశాబ్దాలుగా పాటల వ్యవసాయం చేస్తున్నవాడు చింతల యాదగిరి. నడుస్తున్న తెలంగాణ వాగ్గేయ చరితలో ప్రామాణికమైన పాటకవిగా, ప్రజాకవిగా, వాగ్గేయకారుడిగా ప్రచారం కావాల్సిన, గుర్తింపు దక్కాల్సిన, తెలంగాణ నేల, తెలుగు భాష గర్వించదగిన గొప్ప కవిగాయకుడు చింతల యాదగిరి. నిజానికి చింతల యాదగిరి పాటంటే ఆనందంకాదు. ఆవేదనలమూట. తన్మయత్వంకాదు తనువు అణువణువులో చెలరేగే ఆవేశం. తన స్వరం నిప్పురవ్వల్ని వెదజల్లే ఎర్రని కొలిమి. ఆ మండే గొంతులోంచి తన్నుకొచ్చే జీర సముద్రపు అలల హోరును, తుఫాను గాలి జోరును గుర్తు చేస్తూ పాడుతుంది. ఆయన కలంతో పొడిచే పొద్దుపై సంతకం చేస్తూ, కాలం నుదుటన మరిన్ని పదునైన పాటలు రాయాలని ఆశిద్దాం.
ఎం. విప్లవకుమార్
9515225658
(బహుజన సాహిత్య అకాడమీ అవార్డు, డిసెంబర్ 15న ఢిల్లీలో చింతల యాదగిరి అందుకుంటున్న సందర్భంగా)