Monday, December 23, 2024

చింతమడక టు ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

నదులనే జలాశయాలుగా మార్చి.. నీటి నిలువ సామర్ధాన్ని పెంచి..దేశంలోనే జల వనరుల వినియోగంతో తెలంగాణ రాష్ట్రం అధ్భుత ప్రగతిని చాటుతోంది. గోదావరి నదీగర్భంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టే కెసిఆర్ ప్రభుత్వ సమర్థతకు అద్దం పడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సిఎం కెసిఆర్ సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. పట్టుదల, అంకిత భావం ఉంటే సాధ్యం కానిదేదీ లేదని ప్రాజెక్టుల రీడిజైన్ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేసిన టీఆర్‌ఎస్ సర్కారు నిరూపించింది. అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుంటూ కృష్ణాగోదావరి నదుల పరీవాహకంగా 1200 టిఎంసిసిల నీటిని వినియోగించుకుంటూ రాష్ట్రంలో కోటి 26లక్షల ఎకరాలకు సాగునీటిని అందజేస్తూ జలవనరుల రంగం పురోగమిస్తోంది. నైరుతి , ఈశాన్య రుతుపవనాల ద్వారా ఏటా కురుస్తున్న వర్షాలకు దేశమంతటా 70వేల టిఎంసిల నీరు అందుబాటులో ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు గడిచిపోయింది. ఎన్నో ప్రభుత్వాలు మారిపోయాయి.

జల కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం

నీటి ప్రాజెక్టుల్లో
తెలంగాణకే అగ్రస్థానం
జలవనరుల వినియోగంలో
అద్భుత ప్రగతి చూపిన
కెసిఆర్ సర్కారు
దేశంలోని ప్రాజెక్టుల్లో
10755టిఎంసిలకు
నీటి నిలువ సామర్థ్ధం
తెలంగాణలోనే 1500
టిఎంసిలపైగా నీటి నిలువ
అగ్రస్థానంలో నిలిచిన
కృష్ణా,గోదావరి జలాశయాలు

నదులకు నడక నేర్పిన శేఖరుడు

ఎల్. భాస్కర్‌రెడ్డి
కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడి నేతృత్వంలో నడుస్తున్న బిజేపి ప్రభుత్వానికి కూడా ఏకధాటి పాలనలో ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. జలవనరుల వినియోగం తీరు చూస్తే దేశంలోని అన్ని నదులపై నిర్మించిన ప్రాజెక్టుల్లో నీటి నిలువ సామర్ధం 10,755టిఎంసిలు మాత్రమే అని కేంద్ర జలవనరుల సంఘం నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందులో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే రికార్డుస్థాయిలో 1500 టి.ఎం.సీ.ల నదీ జలాల నిల్వ సామర్ధం ఉంది. నీళ్లు, నిధులు ,నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పట్టుపమని పదేళ్లు కూడా నిండకముందే నీటి వనరుల సద్వినియోగంలో సత్తా చాటి దేశమంతా తెలంగాణవైపు చూసేలా చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత ప్రాజెక్టులన్నీ పూర్తయితే కృష్ణా, గోదావరి నదుల పరివాహకంగా రాష్ట్రంలో జల వనరుల వినియోగం 1500టిఎంసీలకు పేరిగే అవకాశాలు ఉన్నట్టు నీటిపారుదల రంగం నిపుణులు అంచనా వేస్తున్నారు. నదీ జలాలను అత్యధికంగా వినియోగించుకొంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలిచింది. మిషన్ కాకతీయ పథకం కింద రాష్ట్రంలోని 44వేల చెరువులను పునరుద్ధరించడం ద్వారా వర్షపు నీటిని ఒడిసి పట్టడంతోపాటు భూగర్బ జలమట్టాలను కూడా పెంచటంలో తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో రెపరెపలాడించింది. వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ ఇచ్చి రైతులను పంటల సాగుకు ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో భూగర్భ జలాల నుంచి కూడా ఏటా సుమారు 300టిఎంసీలను ఉపయోగించుకుంటోంది. దేశంలోని హిమాలయ నదులు , ద్వీపకల్పనదులపై ఉన్న జలాశయాల్లో నీటి నిలువ సామర్ధం, నిర్మాణంలో ఉన్నవాటి సామర్ధం ఎంత అన్నదానిపై కేంద్ర జలవనరుల సంఘం ఇటీవల అధ్యయనం చేయించి నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశంలోనే కృష్ణానదీజలాశయాలు నీటినిలువ సామర్ధంలో అగ్రభాగాన నిలిచాయి. కృష్ణానదీ బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టుల్లో నీటినిలువ సామర్ధం ఇతర నదీపరివాహక ప్రాజెక్టుల కంటే అత్యధికంగా ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. దేశంలోనే అతిపెద్ద నదిగానే కాకుండా , హిమాలయ నదిగా, నిత్యం నీటిగలగల సవ్వడులతో నడయాడే గంగానది రెండవస్థానంలోకి వేళ్లిపోయింది. గోదావరి బేసిన్ ప్రాజెక్టులు మూడస్థ్థానంలో నిలిచాయి. కృష్ణానదీ పరివాహకంగా ఉన్న ప్రాజెక్టుల్లోనీటి నిలువ సామర్ధం 1788.73టీఎంసీలు ఉండగా, గంగా నదీపరివాహకంగా ఉన్న ప్రాజెక్టుల్లో నీటి నిలువ సామర్ధం 1718.66టీఎంసిలుగా కేంద్ర జలసంఘం అధ్యయనంలో వెల్లడయ్యింది. గంగానదీ ప్రాజెక్టుల్లోని మొత్తం నీటినిలువ సామర్ధం కంటే కృష్ణానదీ ప్రాజెక్టుల్లో 70టీఎంసిల మేరకు నీటినిలువ సామర్ధం అధికంగా ఉన్నట్టు స్పష్టమయ్యింది. దేశంలో అన్ని నదులపై నిర్మాణం పూర్తి చేసుకుని ఉపయోగంలో ఉన్న ప్రాజెక్టుల్లో మొత్తం నీటినిలువ సామర్ధం 9,104.55టీఎంసిలు కాగా, నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టుల్లో నీటి నిలువ సామర్ధం 1651.42టీఎంసిలు ఉన్నట్టు సిడబ్యుసి నివేదిక స్పష్టం చేసింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తయితే దేశంలో మొత్తం ప్రాజెక్టులోని నీటినిలువ సామర్ధం 10,755.91టిఎంసిలకు చేరుకుంటుందని నివేదిక బయటపెట్టింది. కాలాలతో నిమిత్తం లేకుండా హిమాలయాలపై నిరంతరం మంచు కురుస్తూనే ఉంటుంది. కొండల్లా పేరుకుపోయిన మంచు గడ్డలు కరిగినీటిగా మారి గంగా, బ్రహ్మపుత్ర తదితర జీవనదులు నిత్యనీటి ప్రవాహాలను అందిస్తుంటాయి. అయితే ప్రాజెక్టులు , వాటిలో నిటినిలువల స్థాయిల్లో మాత్రం హిమాలయ నదులకంటే ద్వీపకల్ప నదులే ముందు వరసలో నిలుస్తున్నాయి. హిమాలయ నదుల కంటే ద్వీపకల్ప నదులపై ఉన్న ప్రాజెక్టుల్లో నీటినిలువ సామర్ధం 25శాతం అధికంగా ఉన్నట్టు సీడబ్యుసి నివేదిక స్పష్టం చేసింది. దేశంలోనే అతిపెద్ద నదిగా ఉన్న గంగానది పరివాహకంగా ఉన్న ప్రాజెక్టుల్లో నీటినిలువ సామర్ధం 1718.66టిఎంసిలు కాగా , నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సామర్ధం 270.13టిఎంసిలుగా ఉంది. ఇవికూడా పూర్తియితే ఈ బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో మొత్తం నీటినిలువ సామర్దం 1988.79టీఎంసిలకు చేరుకోనుంది.దేశంలో మూడవ అతిపెద్ద నదిగా ఉన్న కృష్ణానది పరివాహకంగా ఉన్న ప్రాజెక్టుల్లో 1788.73టీఎంసిల నీటినిలువ సామర్ధం కాగా , నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో 146.77టీఎంసిల నీటినిలువ సామర్ధంతో ఉన్నాయి. దేశంలో రెండవ అతిపెద్ద నదిగా పేరుగాంచిన గోదావరి బేసిన్‌లో పూర్తయిన ప్రాజెక్టుల నీటినిలువ సామర్ధం 1237.43టీఎంసిలు అని సిడబ్యుసి తేల్చింది. మిగిలిన నదులకు సంబంధించిన బేసిన్లలో ఉన్న ప్రాజెక్టుల్లో నీటినిలువ సామర్ధం ఇప్పటికే నిర్మాణం పూర్తయినవి, నిర్మాణంలో ఉన్నవి కలిపి ప్రాజెక్టుల నీటినిలువ సామర్ధం నర్మదా ప్రాజెక్టుల్లో 863.70టీఎంసిలు, ఇండస్ ప్రాజెక్టుల్లో 576.45టీఎంసిలు, మహానది ప్రాజెక్టుల్లో 513.01టీఎంసిలు, తాపిలో 377.71టీఎంసిలు, కావేరిలో 321.30టీఎంసిలు, మహిలో 182.48టీఎంసిలు, పెన్నా బేసిన్‌లో 190.67టీఎంసిలు, బ్రహ్మపుత్రలో 88.76టిఎంసిలు ఉన్నట్టు కేంద్ర జలసఘం అధికారవర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తే దేశంలోనే నీటివనరులు సమర్ధవంతంగా వినియోగించుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలవనుంది.

ప్రాంతీయం టు జాతీయం

మన తెలంగాణ/హైదరాబాద్ : అసలు ఉనికి లేని తెలంగాణకు కెసిఆర్ ఒక ఉద్యమ పంథాతో అలజడి సృష్టించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) పార్టీని ఏర్పాటు చేశాడు. కెసిఆర్ లాంటి బక్క పలుచని ఒక నేత…. ఒక్కడితో మొదలైన ఈ పార్టీ ప్రస్థానం స్వరాష్ట్రం సాధించి తొలి ముఖ్యమంత్రి అయ్యి అభివృద్ధి బాటలో పయనించే వరకూ సాగింది. ఇప్పటి వరకు ఏ ప్రాంతీయ పార్టీ కలలో కూడా ఊహించని విజయాలను తన పేరిట నమోదు చేసుకుంది. సరిగ్గా 21 ఏళ్ల క్రితం జలదృశ్యంలో పిడికెడు మందితో ప్రారంభించిన టిఆర్‌ఎస్ ఇప్పుడు తెలంగాణ సాధించిన పార్టీగా అవతరించింది. ప్రస్తుతం తెలంగాణ టు ఢిల్లీకి అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన పార్టీలు సరైన పాలనను ప్రజలకు అందించలేకపోయారని కెసిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపత్యంలో తాను జాతీయ పార్టీని ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తానంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి సోయి వచ్చేలా చేస్తామని చెబుతున్నారు. ఢిల్లీ టార్గెట్ గా గత ఏప్రిల్ నెలలో జరిగిన టిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం ప్లీనరీలోనే కెసిఆర్ రోడ్ మ్యాప్ ఖరారు చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ఆధారంగా కూటములపై దృష్టి సారించవచ్చని పార్టీలో చర్చ సాగుతున్నది.

ఉద్యమంతో స్వరాష్ట్ర సాధన

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హయంలో మంత్రిగా, ప్రభుత్వ విప్‌గా కొనసాగిన కెసిఆర్….తెలంగాణ సాధన కోసం ఆ పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈక్రమంలోనే జలదృశ్యంలో కొద్దిమందితో టిఆర్‌ఎస్ స్థాపించారు. తొలి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఆ పార్టీ సత్తా చాటింది. అనంతరం 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని పలు ఎంఎల్‌ఎ సీట్లు గెలిచి ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా మారింది. కెసిఆర్ కేంద్రమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరారు. అయితే తెలంగాణ సాధనే లక్ష్యంగా అనుకున్నారు. కానీ కాంగ్రెస్ ఇవ్వకపోవడంతో రాజీనామాలతో మళ్లీ మళ్లీ గెలుస్తూ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. వైఎస్‌ఆర్ రెండో సారి సిఎం అయ్యాక అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దీంతో ఎపిలో రాజకీయ శూన్యత ఏర్పడింది. దీనిని తనకు అనుకూలంగా మలుచుకున్న కెసిఆర్ ‘ఆమరణ దీక్ష’తో తెలంగాణ ఉద్యమాన్ని రగిలించాడు. ఈ సారరి ఉద్యమం సెగ కేంద్రాన్ని మరింత తాకడంతో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దిగొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సి వచ్చింది.

2001 ఏప్రిల్ 21 నాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశాడు. తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ప్రారంభించిన కార్యక్రమాలు కెసిఆర్‌ను ప్రభావితం చేశాయి. 2001లో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఏర్పాటు తెలంగాణ ఏర్పాటు ఏమీ అసాధ్యం కాదన్న అభిప్రాయం ఏర్పడింది. అదే సంవత్సరం తెలంగాణ ఉద్యమకారులతో ఏర్పాటుచేసిన సమావేశాల్లో రాష్ట్ర సాధన ఉద్యమం గురించి చర్చించాడు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి టిఆర్‌ఎస్‌ను ఏర్పాటుచేయాలన్న ఆయన ఆలోచనను బలపరిచాయి. పార్టీ స్థాపనకు ముందు సైద్ధాంతికంగానూ తెలంగాణ ఏర్పాటు, దాని అవసరాల గురించి అధ్యయనం చేశాడు. తెలంగాణను రాజకీయ పోరాటం ద్వారా సాధిస్తామని ప్రకటించాడు. ఆపైన తన వాగ్ధాటికి, రాజకీయ వ్యూహాలకు పదును పెట్టుకుంటూ సాగాడు. 2004 ఎన్నికలలో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు. ఐదుగురు లోక్‌సభ సభ్యులున్న టిఆర్‌ఎస్ కాంగ్రెస్ నేపథ్యంలోని యుపిఎ కూటమిలో భాగస్వామిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది.

ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ నాయకులుగా కెసిఆర్, ఆలె నరేంద్ర కేంద్ర మంత్రులయ్యారు. 2004 నుండి 2006 వరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కెసిఆర్ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవులకు రాజీనామా చేసి యుపిఎ నుంచి బయటకు వచ్చాడు. ఈ సమయంలో మంత్రి పదవులతో పాటు లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తదనంతరం జరిగినఉపఎన్నికలలో కరీంనగర్ స్థానం నుండి మళ్ళీ పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.జీవన్ రెడ్డిపై రెండు లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించాడు. 2008లో మళ్ళీ రాష్ట్రమంతటా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు చేసిన రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలలో మళ్ళీ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీచేసి 15,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 15వ లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విఠల్ రావుపై గెలుపొందాడు. జనరల్ ఎన్నికల్లోనే కాకుండా పలుమార్లు రాజీనామాలు చేయగా వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా కెసిఆర్‌ను తిరిగి భారీ మెజారిటీలతో ఎన్నుకుని ప్రజలు విజయాలు కట్టబెట్టారు. ఒక దశలో రాజీనామా కెసిఆర్‌కు రాజకీయంగా పెద్ద అస్త్రంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News