Sunday, January 19, 2025

చిరంజీవికి ఎఎన్‌ఆర్ అవార్డు

- Advertisement -
- Advertisement -

నటసామ్రాట్, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఫిల్మ్ హెరిజ్ ఫౌండేషన్ ఎన్‌ఎఫ్‌డిసి… నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘ఏఎన్‌ఆర్ 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది. అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఏఎన్‌ఆర్ ఐకానిక్ ఫిలిం ’దేవదాసు’ స్క్రీనింగ్‌తో ఈ ఫెస్టివల్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ’దేవదాసు’ (1953), ’మిస్సమ్మ’ (1955) ’మాయాబజార్’ (1957), ’భార్య భర్తలు’ (1961), ’గుండమ్మ కథ’ (1962), ’డాక్టర్ చక్రవర్తి’ (1964), ’సుడిగుండాలు’ (1968), ’ప్రేమ్ నగర్’ (1971), ’ప్రేమాభిషేకం’ (1981) ’మనం’ (2014) సహా ఏఎన్‌ఆర్ ల్యాండ్‌మార్క్ మూవీస్‌ను దేశవ్యాప్తంగా ప్రదర్శించనున్నారు. ఫిల్మ్ హెరిజ్ ఫౌండేషన్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ 10 మాస్టర్ పీస్ మూవీ ప్రింట్‌లను 4కెలో పునరుద్ధరించడానికి చొరవ తీసుకున్నాయి. అద్భుతమైన క్యాలిటీలో ఈ క్లాసిక్స్‌ని ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు.

అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలని అక్కినేని కుటుంబం ఘనంగా నిర్వహించింది. అన్నపూర్ణ స్టూడియోస్ లోని అక్కినేని విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఇరు రాష్ట్రాలలోని అక్కినేని అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ కి తరలివచ్చి అక్కినేనికి అంజలి ఘటించారు. అక్కినేని కుటుంబ సభ్యులు అభిమానులతో కలిసి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా 600 వందల మంది అభిమానులకు బట్టలు బహుకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ “నాన్నగారు ఏఎన్‌ఆర్ నవ్వుతూ మాకు జీవితాన్ని నేర్పించారు. అందుకే ఆయన పేరు తలచుకుంటే నవ్వుతూనే వుంటాం. శివేంద్రకి థాంక్స్. వాళ్ళు చేసిన బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అద్భుతంగా వున్నాయి. ఆడియన్స్‌కి వండర్‌ఫుల్ ఎక్స్ పీరియన్స్ వుంటుంది. 31 సిటీల్లో ఈ ఫెస్టివల్ చేస్తున్నారు. గోవా ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నాన్న గారి పేరు మీద ఒక చాప్టర్ చేస్తున్నారు. ఈ విషయంలో చాలా హ్యాపీగా వుంది. పోస్ట్ మాస్టర్ జనరల్ బీఎస్ రెడ్డికి థాంక్ యూ. ఈ శత జయంతి రోజున నాన్న గారి స్టాంప్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా వుంది.

ఈ ఏడాది ఏఎన్‌ఆర్ అవార్డ్ చిరంజీవికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం చెప్పగానే చిరంజీవి చాలా ఎమోషనల్‌గా కౌగిలించుకొని ఏఎన్‌ఆర్ శత జయంతి ఏడాదిలో అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా వుందని చెప్పారు. దీని కంటే పెద్ద అవార్డ్ లేదని అన్నారు. అమితాబ్ బచ్చన్ ఈ అవార్డ్ ప్రధానం చేస్తారు. అక్టోబర్ 28న ఈ ఫంక్షన్ చేస్తున్నాం”అని తెలిపారు. శివేంద్ర సింగ్ దుంగార్పూర్ మాట్లాడుతూ “ఈ ఫెస్టివల్‌ని దేశంలోని 31 సిటీస్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదొక హిస్టారికల్ డే. ఈ మూడు రోజుల్లో అక్కినేని పది క్లాసిక్ సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చూడబోతున్నారు”అని అన్నారు. ఈ వేడుకలో మురళీమోహన్, వెంకట్ అక్కినేని, కె .రాఘవేందర్ రావు, జాయింట్ కలెక్టర్ సంజయ్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News