మన తెలంగాణ/హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవికి కొత్త ఐడి కార్డ్‌ను ఎఐసిసి జారీ చేసింది. పిసిసి డెలిగేట్‌గా గుర్తిస్తూ 2027 వరకు కాలపరిమితి ఉంటుందని తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. కాగా మంగళవారం చిరంజీవి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఓ ఆడియో క్లిప్‌లో ‘నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను, కానీ రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు’ అని పేర్కొన్నారు. అయితే ఈ డైలాగ్ తన తాజా చిత్రం గాడ్ ఫాదర్‌కు సంబంధించినదిగా తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం చిరంజీవి నోటి వెంట ఈ విధమైన డైలాగ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ డైలాగ్‌కు సంబంధించిన ఆడియోను పోస్టు చేసిన చిరంజీవి.. గాడ్ ఫాదర్ చిత్రంలో తన లుక్‌ను మాత్రమే పోస్టర్‌లో ఉంచారు. ఇక, చిత్రానికి సంబంధించిన ఎలాంటి వివరాలను గానీ, ఏ విధమైన సందేశాన్ని కూడా అటాచ్ చేయలేదు. దీంతో ఆయన రాజకీయ ఎంట్రీపై మరోసారి అభిమానుల్లో తీవ్రమైన చర్చ మొదలైంది. చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ, పరోక్షంగా తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వెన్నుదన్నుగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ను మెగా అభిమానులు విపరీతంగా రీట్వీట్ చేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌లో భాగమేనని ఫిల్మ్ వర్గాలు వెల్లడిస్తుండటం గమనార్హం.