Tuesday, December 24, 2024

ఆయన స్టెప్పులకు గిన్నిస్ దాసోహం

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటుడు చిరంజీవికి మరో అరుదైన పురస్కారం దక్కింది. ఆదివారం గిన్నిస్ వరల్డ్ రికార్డులో చిరంజీవి పేరు చేరింది. ‘మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ’ అని యాక్టర్, డ్యాన్సర్ కేటగిరీలో ఆయన స్థానం సంపాదించారు. 1978లో చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఏడాదే మొదలైన రికార్డుల పుస్తకంలో ఆయన పేరు చోటు చేసుకోవడం యాదృచ్చికమే అయినా అందమైన అనుభూతిగా భావిస్తున్నారు అభిమానులు.
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటిదాకా దాదాపు 24వేల డ్యాన్స్ మూవ్స్ చేశారు. ఆయన కెరీర్లో 537 పాటల్లో ఈ డ్యాన్స్ మూవ్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా 156 సినిమాల కెరీర్ ఆయనది. ఇన్నేళ్ల కెరీర్లో అనితర సాధ్యమైన ప్రతిభతో తెలుగు వారందరూ గర్వించేలా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ చైనాలో మెగాస్టార్ చిరంజీవిని ఇండియన్ మైఖేల్ జాక్సన్ అనే పిలుస్తారు. మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ వరల్ రికార్డు ప్రకటించే కార్యక్రమం హైదరాబాద్‌లో ఆత్మీయుల సమక్షంలో వైభవంగా జరిగింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమీర్‌ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిన్నిస్ వరల్ రికార్డ్ తరఫున రిచర్డ్ స్టెన్నింగ్ పాల్గొన్నారు. ఈ వేడుకలో ఆమీర్‌ఖాన్‌కు చిరంజీవి స్పెషల్ పెన్నును బహూకరించారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధి రిచర్డ్ స్టెన్నింగ్ మాట్లాడుతూ ‘చిరంజీవి 46 ఏళ్ల సినిమా ప్రయాణం గురించి మీ అందరికీ బాగా తెలుసు. కమర్షియల్గా రిలీజ్ అయిన సినిమాలను పరిగణలోకి తీసుకున్నాం. చిరంజీవి 156 సినిమాల్లో నటించారు. అన్ని సినిమాలు చేయడమే అద్భుతమైన అచీవ్మెంట్. ఆ సినిమాల్లో ఆయన డ్యాన్స్ చేసిన పాటలను పరిగణనలోకి తీసుకున్నాం. అన్ని పాటలను చూడటం వ్యక్తిగతంగానూ నాకు చాలా మంచి అనుభూతి. చరిత్రలో నిలబడిపోయే వ్యక్తి ఆయన. 537 పాటల్లో ఆయన స్టెప్పులను చూశాం. ఆయనకు గిన్నిస్ రికార్డు అందించాలని నిర్ణయించుకున్నాం’ అని అన్నారు. ఆమీర్‌ఖాన్ మాట్లాడుతూ.. ‘చిరంజీవి గిన్నిస్ విషయం నాతో చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఆయన చేసిన ప్రతి పాటలోనూ ఆయన మనసు కనిపిస్తుంది. అంత ఎంజాయ్ చేసి చేస్తారు. ఆయన్ని చూడ్డానికి మనకు రెండు కళ్లు సరిపోవు’ అని తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘నా జీవితంలో నేను ఎదురుచూడనిది నాకు దక్కింది. భగవంతుడికీ, దర్శకనిర్మాతలకు, అభిమానులకు రుణపడి ఉంటాను. నటన కన్నా ముందు నుంచే డ్యాన్సుల మీద నాకు ఆసక్తి ఉంది. అదే ఇవాళ నాకు ఈ అవార్డు వచ్చేలా చేసింది. ఎందుకంటే, ముందు నటనకి శ్రీకారం చుట్టడానికన్నా ముందే, నేను డ్యాన్స్ కి ఓనమాలు దిద్దాను. నా విజయపరంపరకు సహకరిస్తున్న నిర్మాతలకు, టెక్నీషియన్లకు, అభిమానులకు ధన్యవాదాలు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, అశ్వనీదత్, కె.ఎస్.రామారావు, తమ్మారెడ్డి భరద్వాజ, డి.సురేష్ బాబు, శ్యామ్ప్రసాద్ రెడ్డి, బి.గోపాల్, కోదండరామిరెడ్డి, సురేందర్ రెడ్డి, గుణశేఖర్, మల్లిడి వశిష్ట, బాబీ, మెగాస్టార్ కుటుంబసభ్యులు సుష్మిత, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు.

సిఎం రేవంత్ అభినందనలు
మెగాస్టార్ చిరంజీవికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్ చోటు దక్కడంపై ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ఆయనతోపాటు ఎపి సిఎం చంద్రబాబు, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News