Sunday, January 19, 2025

చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రదానం

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, అలనాటి నటి వైజయంతిమాల బాలి గురువారం రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 90 ఏళ్ల వైజయంతిమాల బాలి పద్మ విభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎం ఫాతీమా బీవీ, బాంబే సమాచార్ వ్యవస్థాపకుడు హోర్ముస్‌జీ ఎన్ కామాబిజెపి నాయకుడు ఓ రాజగోపాల్, లడఖ్ ఆధ్మాత్మిక గురువు తోగ్‌దన్ రిన్‌పోచే(మరణానంతరం), తమిళ నటుడు కెప్టెన్ విజయకాంత్(మరణానంతరం), గుజరాతీ వార్తాపత్రిక జన్మభూమి గ్రూపు ఎడిటర్, సిఇఓ కుందన్ వ్యాస్‌కు పద్మ భూషణ్ పురస్కారాల ప్రదానం జరిగింది. ఫాతీమా బీవీ, విజయకాంత్, రిన్‌పోచే తరఫున వారి కుటుంబ సభ్యులు రాష్ట్రపతి నుంచి అవార్డులు స్వీకరించారు. ఈ ఉత్సవానికి ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖర్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితర ప్రముఖులు హాజరయ్యారు.

దేశానికి చెందిన అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులను పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ పేరిట మూడు విభాగాలలో ప్రభుత్వం అందచేస్తుంది. భిన్న రంగాలకు చెందిన వ్యక్తులకు వారు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులను అందచేస్తారు. కళలు, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్య, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసులు తదితర వివిధ రంగాలకు చెందిన వ్యక్తులకు వారు చేసిన సేవలకు గుర్తింపుగా పద్మ అవార్డులకు ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం నాడు ఈ అవార్డులను ప్రభుత్వం ప్రకటిస్తుంది. 2024 సంవత్సరానికి 132 మందికి పద్మ అవార్డులను అందచేయడానికి రాష్ట్రపతి ఆమోదించారు. వీటిలో 5 పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్ , 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డుకు ఎంపికైన వారిలో 30 మంది మహిళలు ఉన్నారు. విదేశీయులు/ఎన్‌ఆర్‌ఐ విభాగంలో 8 మంది జాబితాలో ఉన్నారు. 9 మంది మరణానంతరం అవారుకు ఎంపికయ్యారు. ఏప్రిల్ 22న సగం మందికి పద్మ అవార్డుల ప్రదానం జరుగగా మిగిలిన వారు గురువారం అవార్డులను స్వీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News