Thursday, January 23, 2025

రాజకీయాలకు అతీతంగా సినీ కార్మికులు ఉండాలి

- Advertisement -
- Advertisement -

కార్మిక దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి మైదానంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సినీ ప్రముకులు పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, వందేమాతరం శ్రీనివాస్, దిల్ రాజు, అలీ, సి.కల్యాణ్, గద్దర్, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… ‘రాజకీయాలకు అతీతంగా సినీ కార్మికులు ఐక్యంగా ఉండాలి. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం కావాలి. తెలుగు రాష్ట్రాల సీఎంలు పరిశ్రమకు ఎంతో భరో సా ఇచ్చారు. కార్మికులు ఉద్యమించి తెచ్చుకున్న పండుగ ఇది. 24గంటల్లో 8గంటలు శ్రామికులు పని చేస్తారు. కానీ సినిమా కార్మికులకు నిర్ణీత సమయం ఉండదు. అడవిలో ఉంటారు. చలిలో పనిచేయాలి. పండగలు, పబ్బాలు అన్న తేడా లేకుండా కష్టపడుతూ ఉంటాము. నాకింకా గుర్తుంది, షూటింగ్‌లో జరిగిన కారు ప్రమాదంలో నూతన ప్రసాద్‌కు తీవ్రగాయాలయ్యాయి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కూర్చీలో ఉండి క్లోజప్ షాట్స్‌లో నటించారు. వేరే ఇండస్ట్రీలో అయితే కోలుకునే వరకూ రేస్ట్ తీసుకుంటారు. సినీ పరిశ్రమ కోసం ఎంతోమంది తమ కుటుంబాలను త్యాగం చేశారు. సినీ కళాకారులు కాదు… సినీ కళా కార్మికులు అని నటుడు రావుగోపాల్ రావు అనేవారు, అలాగే అల్లూ రామలింగయ్య గారి తల్లి చనిపోయిన తర్వాత షూటింగ్‌కు వెళ్లారు. గుండెలనిండా విషాదం పెట్టుకొని మనకు నవ్వులు పంచారాయన’ అని అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… తెలుగు సినిమా అంతర్జాతీయ గుర్తింపు వెనుక కార్మికుల కృషి ఉంది. ప్రధాని మోదీ సైతం తెలుగు సినిమా ప్రాధాన్యతను ప్రశంసించారు అని పేర్కొన్నారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… తెలుగు సినీ ఇండస్ట్రీకి చిరంజీవి పెద్దదిక్కుగా ఉన్నారు. సినీ పరిశ్రమ పచ్చగా ఉండాలన్నదే ఆయన ఆకాంక్ష. సినీ కార్మికుల కోసం చిరంజీవి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అని అన్నారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… నేడు మన తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. తెలంగాణ అభివృద్ధి వల్లే తెలుగు సినిమాకు విశ్వఖ్యాతి దక్కింది. సినీ పరిశ్రమకు హైదరాబాద్ బంగారు గని. చిరంజీవితో కలిసి సినీకార్మికులకు మేలు చేసే కార్యక్రమాలు చేపడతా అని పేర్కొన్నారు.

Chiranjeevi participate in May Day Cine Karmikothsavam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News