ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఇచ్చిన జీఓ సంతృప్తికరంగా ఉందంటూ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు తెలియజేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపి సిఎం జగన్మోహన్ రెడ్డికి వారు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విషయంలో చొరవ చూపిన దర్శక నటుడు ఆర్. నారాయణమూర్తికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్వీ ప్రసాద్, చదలవాడ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సి కళ్యాణ్ మాట్లాడుతూ “వివాదాలకు తెరదించుతూ ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలపై జీఓ ఇవ్వడం ఆనందంగా ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పరిశ్రమను అభివృద్ధి చేయాలనుకుంటున్నారు.
దానికి మేం కూడా కృషి చేస్తాం. ఈ విషయమై మరోసారి సమావేశమవుతాం.. త్వరలోనే తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులను కలిసి సన్మానిస్తాం. పరిశ్రమలోని సమస్యలు తీర్చేందుకు చిరంజీవి ముందుకొచ్చారు. సమస్యల పరిష్కారంలో చిరంజీవి కీలక పాత్ర పోషించారు. ఇండస్ట్రీ విషయంలో ఆయనే మాకు పెద్ద”అని అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. “మా విజ్ఞప్తిని స్వీకరించి అమలు చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇతర సమస్యలకూ త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. చిన్న సినిమాల ఐదో షోకి పర్మిషన్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను”అని చెప్పారు.