సీతారామం, బింబిసార చిత్రాలపై ప్రశంసలు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి. శుక్రవారం విడుదలైన ఈ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. ఓ సినిమా మాస్ కమర్షియల్ అంశాలతో మాస్ ఆడియన్స్‌ని మెప్పిస్తుంటే, మరో సినిమా స్వచ్ఛమైన ప్రేమ కథతో, పొయెటిక్ లవ్ స్టోరీతో క్లాసీ ఆడియన్స్ హృదయాలను కొల్లగొడుతుంది. ఇలా బింబిసార, సీతారామం సినిమాలు రెండూ విజయవంతంగా రన్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్విట్టర్ ద్వారా అభినందించారు. “ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఈ విషయం ఎంతో ఊరటనీ, మరింత ప్రోత్సాహాన్నిస్తోంది. కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ శుక్రవారం విడుదలైన చిత్రాలు రెండు విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా సీతారామం, బింబిసార చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు నా మనః పూర్వక శుభాకాంక్షలు” అని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.
చిత్ర పరిశ్రమకు ఆక్సిజన్ అందించినట్టుగా…
బింబిసార, సీతారామం చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ఆదరణతో బ్రహాండమైన విజయాన్ని పొందగలిగాయని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శులు టి. ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల అన్నారు. వారు మాట్లాడుతూ “కరోనా మూలంగా ప్రేక్షకులు థియేటర్లకు రాని సమయంలో ‘అఖండ’ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగింది. ప్రస్తుతం సినిమా పరిశ్రమ అనేక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్న సమయంలో ప్రేక్షకులు థియేటర్ కు రావడం కష్టతరమైంది. ఇటువంటి సమయంలో బింబిసార సినిమా ప్రేక్షకుడిని థియేటర్ కు రప్పించగలిగింది. థియేటర్ల వద్ద ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది. అలాగే ‘సీతారామం’ విజయపథంలో దూసుకుపోతోంది. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొంది వైజయంతి మూవీస్ అధినేతలు అశ్వనీదత్, స్వప్న దత్, ప్రియాంక దత్, దర్శకులు హను రాఘవ పూడిలకు మంచి పేరు తీసుకొనివచ్చింది. ప్రస్తుత సినిమా పరిశ్రమ ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఈ రెండు సినిమాలు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆక్సిజన్ అందించినట్టుగా అందరు భావిస్తున్నారు. కాబట్టి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తరపున ఈ రెండు చిత్ర నిర్మాతలకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు ఇంత ఘన విజయాన్ని సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము”అని తెలిపారు.
Chiranjeevi praises on ‘Sita Ramam’ and ‘Bimbisara’