Sunday, December 22, 2024

చిత్రపురి హౌసింగ్ సొసైటీలో మరో స్కాం వెలుగులోకి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో మరో స్కాం వెలుగు చూసింది. సొసైటీ భూముల్లో ట్విన్ టవర్స్ నిర్మాణం పేరుతో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్ కోట్లు వసూలు చేశారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేటాయింపులో వందల కోట్లకు గోల్‌మాల్ జరిగినట్లు పోలీసు దర్యాప్తులో వెలుగుచూసిన తరుణంలో తాజాగా వసూళ్ల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ రాయదుర్గం ప్రాంతానికి చెందిన రత్న శ్రీరంగ జాయింట్ వెంచర్స్ భాగస్వామి వైఎల్ అమర్‌నాథ్‌బాబు కొన్నేళ్లుగా నిర్మాణ రంగంలో ఉన్నారు. మణికొండ చిత్రపురికాలనీలో సినీ కార్మికుల కోసం 3.20 ఎకరాల విస్తీర్ణంలో జంట భవనాలు నిర్మాణ కాంట్రాక్టు చేపట్టాలని ఆయనకు ఒ.కళ్యాణ్‌బాబు అనే మధ్యవర్తి ద్వారా సమాచారం అందింది. కళ్యాణ్‌బాబు మాటలు నమ్మిన అమర్‌నాథ్‌బాబు చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్, కార్యదర్శి పిఎస్‌ఎన్ దొర, కోశాధికారి లలిత ఇతర కమిటీ సభ్యుల్ని కలిశారు. మొత్తం 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టవర్స్ నిర్మాణానికి సంబంధించి టెండరు నమూనాలో కొటేషన్ ఇతర వివరాలు సమర్పించారు.

కొన్ని రోజుల చర్చల తర్వాత రత్న శ్రీ రంగ సంస్థ పేరిట 2023 ఫిబ్రవరిలో భవన నిర్మాణ కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకున్నారు. గతేడాది మార్చిలో అమర్‌నాథ్‌బాబు తన సంస్థ ఖాతా నుంచి అడ్వాన్సు కింద 3.20 కోట్లు హౌసింగ్ సొసైటీ ఖాతాకు బదిలీ చేశారు. ఆ తర్వాత అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్ హెచ్‌ఎండిఎ అనుమతులు పేరిట 1.80 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయగా ఓ మధ్యవర్తి ఇంట్లో నగదు రూపంలో చెల్లించారు. ఇదిగాక మరో 1.80 కోట్లు కళ్యాణ్ ఆరట్స్ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత అనిల్‌కుమార్ డిమాండ్ మేరకు మధ్యవర్తిత్వం చేసిన కళ్యాణ్‌కు 20 లక్షలు చెల్లించారు. ప్రాజెక్టు చేపట్టడానికి ముందు అమర్‌నాథ్‌కు 15 లక్షలు ఖర్చయ్యాయి. ఈ ప్రక్రియ కొనసాగుతుండగా అకస్మాత్తుగా సొసైటీ అమర్‌నాథ్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇతర కాంట్రాక్టర్ల నుంచి అనధికారికంగా బిడ్లు ఆహ్వానించింది. తనను ఉద్దేశపూర్వంగా మోసం చేసిన అనిల్, మధ్యవర్తి కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని అమర్‌నాథ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనకు తెలిసిన సమాచారం ప్రకారం ఓ కాంట్రాక్టరు దగ్గర 15 కోట్లు అడ్వాన్సుగా తీసుకుని అనిల్‌కుమార్ ట్విన్ టవర్ల నిర్మాణానికి కొత్త ఒప్పందం కుదుర్చుకున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. గతంలో ఇదే చిత్రపురి కాలనీ ఇళ్లు కేటాయింపులో అవకతవకలపై చిత్రపురి కాలని హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్‌ను రాయదుర్గం పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. ఇళ్లు కేటాయింపులో అనర్హులకు, చిత్ర పరిశ్రమకు సంబంధం లేని వారికి ఇచ్చారని బాధితులు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వల్లభనేని అనిల్‌ను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News