అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో పరువు హత్య చోటుచేసుకుంది. మతాంతర వివాహం చేసుకుందని కూతురును కన్నతల్లిదండ్రులు చంపి ప్రభుత్వాస్పత్రి మార్చురీలో పడేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బాలాజీనగర్ కాలనీకి చెందిన యాస్మిన్ బాను(26), పూతలపట్టు మండలం చెందిన సాయితేజ(28) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. యాస్మిన్ ఎంబిఎ చదవగా, సాయితేజ బీటెక్ చదివాడు. సాయితేజ దళిత వర్గానికి చెందిన యువకుడు కావడంతో యాస్మిన్ తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో యాస్మిన్, సాయితేజ ప్రేమ పెళ్లి చేసుకొని రక్షణ కల్పించాలని తిరుపతి డిఎస్‌పిని ఆశ్రయించారు.
ఇరు కుటుంబాలను పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ ఇంటికి పంపించారు. గత రెండు నెలల నుంచి యాస్మిన్ కుటుంబ సభ్యులకు తెలియకుండా దూరంగా బతుకుతున్నారు. యాస్మిన్ మాత్రం తన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతోంది. ఆమె తండ్రి షౌకత్ అలీకి ఆరోగ్యం బాగోలేదని ఓ సారి వచ్చి చూడాలని యాస్మిన్ ఆమె కుటుంబ సభ్యులు బలవంతం చేశారు. దీంతో సాయి తేజ తన భార్య ను చిత్తూరులోని గాంధీ విగ్రహ వద్ద యాస్మిన్ సోదరుడి కారులో ఎక్కించారు. ముప్పై నిమిషాల తరువాత యాష్మిన్, ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా వాళ్ల ఇంటికి సాయితేజ వెళ్లాడు. యాష్మిన్ ఇంట్లో లేదని ఆత్మహత్య చేసుకోవడంతో ప్రభుత్వాస్పత్రికి తరలించామని నిర్లక్షంగా సమాధానం ఇచ్చారు. భయంతో భర్త చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చూడగా తన భార్య మార్చురీలో కనిపించడంతో కన్నీంటిపర్యంతమయ్యారు. వెంటనే సాయితేజ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన భార్యను చంపేసి ఆత్మహత్య చిత్రీకిరిస్తున్నాడని సాయితేజ మండిపడ్డారు. యాస్మిన్ తండ్రి, ఆమె పెద్దమ్మ కుమారుడు లల్లూ పరారీలో ఉన్నారు.