Wednesday, January 22, 2025

కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే వేరే ఔషధం

- Advertisement -
- Advertisement -

గుండె జబ్బులు రాకుండా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి స్టాటిన్ మందులను వాడుతుంటారు. వీటిని దీర్ఘకాలం వాడితే గుండె, రక్తనాళాల సమస్యలు చాలావరకు తగ్గుతాయి. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ముప్పు తగ్గించుకోడానికి వీలవుతుంది. కానీ కొన్ని లక్షల మంది వీటిని వాడడానికి భయపడుతున్నారు. దుష్ప్రభావాలు తలెత్తుతాయని వీరి అనుమానం. అయితే ఈ నేపథ్యంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే వేరే ఔషధం నెక్స్‌లిటోల్ ( nexletol)ను వినియోగించవచ్చని పరిశోధకులు తమ అధ్యయనంలో సూచిస్తున్నారు.

డాక్టర్లు స్టాటిన్‌తోపాటు ఈ ఔషధాన్ని గుండెపోటు ఎక్కువగా ఉన్న వారికి ప్రిస్రైబ్ చేస్తున్నారు. రసాయనికంగా దీన్ని బెంపెడోయిక్ యాసిడ్ ( bempedoic acid ) అని వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు చేపట్టిన కొత్త అధ్యయనంలో స్టాటిన్ కాంబినేషన్ లేకుండా నెక్స్‌లెటోల్‌తో ప్రయోగాలు చేశారు. ఇది కూడా కొలిస్ట్రాల్ రిస్కును బాగా తగ్గిస్తుందని గుర్తించారు. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే వైద్య చికిత్సల్లో స్టాటిన్ మందులు కీలకంగా ఉంటున్నాయి. కానీ వీటిని వినియోగించని వారికి కొత్తగా గుర్తించిన మాత్రలు ఉపయోగపడతాయని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఈ అవకాశం ప్రజారోగ్యంపై పెద్ద ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. చెడు కొలెస్ట్రాల్ వల్ల రక్తం ప్రవహించే ధమనులు మూసుకుపోయి, గుండె పోటు, పక్షవాతాలకు దారి తీస్తాయి. లిపిటర్ ( lipitor). క్రెస్టర్ (crestor) వంటి స్టాటిన్ మాత్రలు లేదా చవకబారు జనరిక్ మందులతో సమానమైనవి కొలెస్ట్రాల్‌ను తగ్గించే ప్రధాన ఔషధాలుగా ఉంటున్నాయి. ఇవి గుండె జబ్బులను నివారిస్తాయి. కాలేయం లోని కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. అయితే కొంతమంది స్టాటిన్ మందుల కారణంగా తీవ్రమైన కండరాల నొప్పితో బాధపడుతుండడం జరుగుతోంది. ఈ విధంగా తరచుగా నొప్పి ఎందుకు వస్తుందో తెలియడం లేదు. అయితే 10 శాతం మంది రోగులు ఈ మాత్రలు తీసుకోడానికి అర్హులైనప్పటికీ వీటిని వినియోగించడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో నెక్స్‌లెటోల్ కూడా స్టాటిన్ కన్నా వేరే విధంగా కండరాల నొప్పి లేకుండా కాలేయం లోని కొలెస్ట్రాల్ ఉత్పత్తిని ఆపగలుగుతుందని పరిశోధకులు కనుగొన గలిగారు. ఐదేళ్ల పాటు సాగిన ఈ అధ్యయనంలో దాదాపు 14,000 మందిపై ప్రయోగాలు చేశారు. వీరు స్టాటిన్ తక్కువ డోసును కూడా తట్టుకోలేని వారే. వీరిలో సగానికి సగం మంది రోజూ నెక్స్‌లెటోల్ తీసుకోగా, మిగతా సగం మంది డమ్మీ మాత్రలు తీసుకునే వారు. ప్రధానమైన గుండె సమస్యలున్న గ్రూపు వారిలో నెక్స్‌లెటోల్ వల్ల గుండె సమస్యల రిస్కు 13 శాతం తగ్గగా, 23 శాతం గుండెపోటు రిస్కు తగ్గినట్టు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News