ఐఐటి పట్టభద్రులకు ప్రధాని మోడీ పిలుపు
కాన్పూర్(యుపి): సౌకర్యవంతమైన జీవితం కన్నా సవాళ్లతో కూడిన మార్గాన్ని ఎంపిక చేసుకోవాలంటూ ఐఐటి పట్టభద్రులకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మంగళవారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పూర్ 54వ స్నాతకోత్సవంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ రానున్న 25 ఏళ్లలో ఎలాంటి భారతదేశాన్ని చూడాలనుకుంటున్నారో అందుకోసం ఇప్పటి నుంచే పనిచేయాలంటూ ఐఐటి పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చాలా సమయం వృథా అయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. భారతదేశం స్వయం సమృద్ధి సాధించే దిశగా యువ గ్రాడ్యుయేట్లు కృషిచేయాలని ఆయన కోరారు. స్వాతంత్య్రం అనంతరం భారత్ కూడా నూతన ప్రయాణాన్ని ప్రారంభించిందని, 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మన కాళ్ల మీద మనం నిలబడే విధంగా చాలా ప్రగతి సాధించి ఉండాల్సిందని, అయితే చాలా సమయం వృథా అయిపోయిందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
ఇప్పటికే రెండు తరాలు గడచిపోయాయని, ఇక రెండు క్షణాలు కూడా మనం వృథా చేసుకోరాదని ఆయన అన్నారు. సౌకర్యవంతమైన జీవితం కోసం అడ్డదారుల్లో వెళ్లాలంటూ విద్యార్థులకు చాలామంది చెబుతుంటారని, అయితే తాను మాత్రం సౌకర్యాల కోసం పాకులాడవద్దని మాత్రం సలహా ఇస్తానని మోడీ అన్నారు. మీకు ఇష్టమున్నా లేకున్నా జీవితంలో సవాళ్లను ఎదుర్కోవలసిందేనని, అందుకే తాను సవాళ్లను ఎంపిక చేసుకోవాలని సూచిస్తానని ఆయన చెప్పారు. సవాళ్ల నుంచి పారిపోయిన వారు జీవితంలో చాలా నష్టపోతారని ఆయన హితవు చెప్పారు. దేశానికి కొత్త ఉత్తేజాన్ని ఇవ్వడానికి రానున్న 25 ఏళ్ల కోసం కొత్త మార్గదర్శకం చేయవలసిందిగా ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.