హైదరాబాద్: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నృత్యదర్శకుడు శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతూ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఇటీవల శివశంకర్ మాస్టర్ కుటుంబసభ్యులు కరోనా బారినపడ్డారు. శివశంకర్ మాస్టర్ పెద్దకుమారుడు విజయ్ శివశంకర్ కరోనాతో పోరాడుతున్నాడు. మాస్టర్ 1948 డిసెంబర్ 7న చెన్నైలో జన్మించారు. 10 భాషలకు పైగా చిత్రాల్లో కొరియోగ్రాఫర్ గా ఆయన పనిచేశారు. దక్షిణాదిలో పలు చిత్రాలకు నృత్యాలు సమకూర్చారు. 800 చిత్రాలకు పైగా డ్యాన్స్ మాస్టర్ గా పనిచేశారు శివశంకర్ మాస్టర్. దాదాపు 30 సిన్మాల్లో నటించి, పలు భాషల్లో ఉత్తమ అవార్డులను అందుకున్నారు. మగధీర చిత్రానికి జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. 1974లో మాస్టర్ సలీం వద్ద సహాయ నృత్యదర్శకుడిగా శివశంకర్ పనిచేశారు. అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, మహాత్మా, అరుంధతి, బాహుబలి-1 చిత్రాలకు శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. శివశంకర్ మాస్టర్ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని చిరంజీవి అన్నారు. తన అనేక చిత్రాలకు మాస్టర్ పనిచేశారని చిరు గుర్తుచేసుకున్నారు. ఖైదీ సినిమాతో తమ ఇద్దరి మధ్య స్నేహం మొదలైందని ఆయన చెప్పారు. శివశంకర్ మాస్టర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత
- Advertisement -
- Advertisement -
- Advertisement -