Sunday, December 22, 2024

న్యూజిలాండ్‌ తదుపరి ప్రధానిగా క్రిస్‌ హిప్‌కిన్స్‌ !

- Advertisement -
- Advertisement -

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ తదుపరి ప్రధానిగా మాజీ మంత్రి క్రిస్‌ హిప్‌కిన్స్‌ ఎన్నిక దాదాపు ఖరారయింది. ప్రస్తుత ప్రధాని జెసిండా ఆర్డెన్‌  తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార లేబర్‌ పార్టీ నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన ఎంపీ, మాజీ మంత్రి హిప్‌కిన్స్‌ మాత్రమే నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన నామినేషన్‌కు ఈ నెల 22న జరుగనున్న సమావేశంలో పార్టీ ఎంపీలు మద్దతు తెలపాల్సి ఉంటుంది. అయితే కేవలం ఒకే నామినేషన్‌ రావడంతో తదుపరి ప్రధానిగా 44 ఏండ్ల హిప్‌కిన్స్‌ ఎన్నికైనట్లు లేబర్‌ పార్టీ ప్రకటించింది. దీంతో ఆయన దేశ 41వ ప్రధానిగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ 14న జరుగనున్న సాధారణ ఎన్నికలకు ఆయన సారధ్యం వహించనున్నారు. కాగా, దేశంలో కరోనా విపత్తు సమయంలో క్రిస్‌ హిప్‌కిన్స్‌ కోవిడ్‌ రెస్పాన్స్‌ మినిస్టర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన నాయకత్వంలో మహమ్మారిని కట్టడిచేయగలిగారు.

ప్రధాని జెసిండా ఆర్డెన్‌ ఫిబ్రవరి 7న తన పదవికి రాజీనామా చేయాలని సంచలన నిర్ణయం తీసుకొన్నారు. గురువారం అధికార లేబర్‌ పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె రాజీనామా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన జెసిండా. తన రాజీనామాకు ఇదే సరైన సమయమని తాను భావిస్తున్నట్టు తెలిపారు. తాను చేయాల్సినంత చేశానని, సవాలుతో కూడిన పనిని విజయవంతంగా నిర్వర్తించానని వెల్లడించారు. ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం పూర్తి స్థాయిలో లేనప్పుడు ఇంకా కొనసాగలేమని వివరించారు. 2017 నుంచి లేబర్‌ పార్టీ అధినేతగా కొనసాగుతున్న జెసిండా అదే ఏడాది సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాని బాధ్యతలు చేపట్టారు. 2020లో జరిగిన ఎన్నికల్లో లేబర్‌ పార్టీ విజయం సాధించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ, వ్యక్తిగత ప్రజాదరణ తగ్గినట్టు తేలటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నట్లు భావిస్తున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News