అగ్రరాజ్యం అమెరికాలో సోమవారం ఉదయం మరోసారి తుపాకుల కాల్పులు భయాందోళనలు కలిగించాయి. విస్కాన్సిన్ లోని మాడిసన్‌లో ఉన్న అబండంట్ క్రైస్తవ పాఠశాలలో ఓ 15 ఏళ్ల విద్యార్థిని కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోగా, మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో ఓ టీచర్, విద్యార్థి ఉన్నారు. గాయపడిన వారిలో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు మాడిసన్ పోలీస్ చీఫ్ షాన్‌బర్నెస్ తెలిపారు. అయితే కాల్పులకు పాల్పడిన అమ్మాయి కూడా మరణించింది.
ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీస్‌లు భావిస్తున్నారు. ఆమె 12 వ తరగతి విద్యార్థిని. 390 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో కాల్పులు జరగడం భయాందోళనలు చోటు చేసుకున్నాయి. భారీ ఎత్తున పోలీస్ వాహనాలు, అంబులెన్సులు, ఫైరింజన్లు మోహరించాయి. ఈ కాల్పుల సంఘటన వివరాలను దేశాధ్యక్షుడు బైడెన్‌కు అధికారులు తెలియజేశారు. వాస్తవానికి మైనర్లు తుపాకీ కలిగి ఉండడం నేరం. అయితే ఈ 15 ఏళ్ల అమ్మాయి దగ్గర తుపాకీ ఎలా వచ్చిందో పోలీస్‌లు దర్యాప్తు చేస్తున్నారు.