మత మార్పిడులకు పాల్పడుతున్నారని రైట్‌వింగ్ ఆరోపణ
బెంగళూర్: క్రిస్టియన్ మత గ్రంథాలను తగులబెట్టిన ఘటన కర్నాటకలోని కోలార్‌లో జరిగింది. రైట్‌వింగ్ బృందాలకు చెందినవారు ఈ చర్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. క్రిస్టియన్ మతప్రచారకులు ఇంటింటికీ తిరుగుతూ మతగ్రంథాలు ఇస్తున్నారని, చర్చిల ద్వారా మతమార్పిడులకు పాల్పడతున్నారని, అందువల్లే ఈ చర్యకు పాల్పడినట్టు రైట్‌వింగ్ కార్యకర్తలు చెబుతున్నారు. అటువంటి ప్రచారం నిలిపివేయాలని వారిని హెచ్చరించామని ఓ అధికారి తెలిపారు. రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చామని కూడా ఆ అధికారి తెలిపారు.
యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అండ్ యునైటెడ్ ఎగెనెస్ట్ హేట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు చర్చిలు, క్రైస్తవులపై 32 దాడులు జరిగాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆరు దాడులు జరిగాయి. కర్నాటకలో బిజెపి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. బలవంతపు మత మార్పిడులను అడ్డుకునే పేరుతో ఆ రాష్ట్రంలో ఓ చట్టాన్ని తెచ్చేందుకు బిజెపి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ శీతాకాల సమావేశాల్లోనే సంబంధిత బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు ముఖ్యమంత్రి బసవరాజ్‌బొమ్మై ఆదివారం వెల్లడించారు.