హైదరాబాద్: తెలంగాణను సాధించామని.. ఇక జై భారత్ మన నినాదమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇందుకోసం సమర శంఖం పూరించామన్నారు. ఇప్పుడే అసలైన ఆటను మొదలుపెట్టామన్నారు. ఇక కేంద్రంలోని మోడీ సర్కార్‌కు కం టిపై నిద్రకూడా ఉండదన్నారు. తెలంగాణ రా ష్ట్రం సాధించినటువంటి పురోగతి యావత్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని మారుమూల రావాలని ఈ సందర్భంగా కెసిఆర్ ఆకాంక్షించారు. దాని కోసమే మళ్లీ మనం కొత్త యుద్ధానికి, కొత్త సమరానికి శంఖం పూరించడానికి సిద్ధ్దమవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నాడు జై తెలంగాణ నినాదంతో ముందుకు సాగి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించామన్నారు. సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభ్యుదయ పదంలో ని లబెట్టగలిగామన్నారు. సరిగ్గా అదే తరహా ప్రస్తు తం జై భారత్ నినాదంతో అద్భుతమైన భారతావని నిర్మాణం కోసం పాటుపడతామని పిలుపునిచ్చారు. దీనికి ఈ క్రిస్మస్ వేడుకలతోనే ప్రారంభిద్దామన్నారు.
ఇందుకు ప్రతి ఒక్కరం అంకితం అవుదామన్నారు. అందుకోసం మీ ఆశీస్సులు అండదండలు కావాలని సిఎం కెసిఆర్ కోరారు. హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో క్రైస్తవ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే భారతదేశం అన్ని రకాలుగా పురోగమించి ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా శాంతికాముక దేశంగా నిలవాలన్నది తన లక్షమన్నారు. 20 ఏండ్ల క్రితం అశాంతితో, వలసలతో, ఆత్మహత్యలతో, దిక్కు తోచని స్థితిలో భయంకరమైన వివక్షకు గురవుతూ చిన్నబుచ్చుకున్నటువంటి తెలంగాణ సమాజాన్ని చూసి ఈ సమాజానికి మేలు జరగాలని జై తెలంగాణ అనే ఒక నినాదంతో మనం ఒక యుద్ధాన్ని ప్రారంభించి విజయాన్ని సాధించామన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఎనిమిది సంవత్సరల్లోనే అనేక అద్భుతాలు సృష్టిస్తే కేంద్రం వద్ద అన్నీ ఉండి కూడా భారత్ ఎందుకు వెనుకబడిపోతున్నదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని వర్గాల అభ్యున్నతి కోసమే పనిచేస్తోందన్నారు. వారికి ప్రయోజనాలు కలిగించడం కోసం దేశాన్ని అన్ని విధాలుగా అస్థిరపరుస్తోందని కెసిఆర్ ఆరోపించారు. ఈ విధానం మారాలన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో గుణాత్మక మార్పు రావాలన్నారు. ఇది బిఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ నినాదంతో ప్రభంజనం
నాడు జై తెలంగాణ నినాదంతో తానొక్కడిని ముందుకు వస్తే…. అది కాస్త ఒక ప్రభంజనంగా మారిందని కెసిఆర్ అన్నారు. స్వచ్చందంగా తెలంగాణ ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్ర సాధనం కోసం తరలివచ్చారన్నారు. పేద, గొప్ప, ఆడ, మగ, చిన్న, పేద, యువత, ముసలి అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు కదిలివచ్చి తెలంగాణ ఉద్యమాన్ని రగిలించారని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తు చేశారు.
దీంతో పిడికెడు మందితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం అనతికాలంలోనే ఉగ్రరూపం దాల్చి కేంద్రం దిగివచ్చేటట్లు చేసిందన్నారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితోనే ప్రస్తుతం దేశంలో సమగ్ర మార్పు కోసమే జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు కెసిఆర్ వెల్లడించారు.
అభివృద్ధిలో అగ్రస్థానం
ఏడేండ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం లక్ష ఉండేదని కెసిఆర్ అన్నారు. ప్రస్తుతంఅనేక పెద్ద పెద్ద రాష్ట్రాలను అధిగమించి ఇవాళ మన తలసరి ఆదాయం 2 లక్షల 75 వేలకు పెరిగిందన్నారు. పర్ క్యాపిట పవర్ యుటిలైజేషన్లో గానీ, ఇంకాఇతర అనేక విషయాల్లో గానీ మనమే నంబర్ వన్ నంబర్ టు స్థానానికి తెలంగాణ రాష్ట్రం పురోగమించిందన్నారు. ఇది ఒక చరిత్రగా మిగిలిపోనుందని కెసిఆర్ పేర్కొన్నారు.
ఇంత తక్కువ కాలంలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణ వలే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించ లేదన్నారు. ఈ ఘనత కేవలం మన రాష్ట్రానికే దక్కిందన్నారు. ఇదే తరహాల్లో రేపు కేంద్రంలో మనకు పాలించే అవకాశం లభిస్తే…. ఖచ్చితంగా తెలంగాణకు మించి భారత్ అభివృద్ధి సాధించే విధంగా కృషి చేస్తామన్నారు. శాంతియుత పంథాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రగతి పథాన సాగుతున్నాం. అదే స్ఫూర్తితో భారత దేశ ప్రగతిని సాధిద్దాం.ఈ దశలో శాంతి, ప్రగతికాముకులైన ప్రతి ఒక్కరి సహకారం అవసరమని కెసిఆర్ పిలుపునిచ్చారు.
త్వరలో క్రైస్తవ పెద్దలతో సమావేశం
క్రైస్తవ మతపెద్దలతో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో త్వరలోనే ఒక సమావేశం నిర్వహించనున్నట్లు కెసిఆర్ తెలిపారు. భారత్‌ను ప్రపంచంలోనే గొప్ప శాంతికాముక దేశంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. దీని కోసం జాతీయ స్థాయిలో క్రిస్టియన్ మత పెద్దలతో త్వరలో భేటీ అవుతామన్నారు. ఈ సందర్భంగా నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కూలంకషంగా చర్చిస్తామన్నారు.
మానవుడు పరిణితిని, పరిపక్వతను సాధిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగమిస్తున్నప్పటికీ ఇటువంటి విషయాల్లో ఇంకా పురోగమనం చెందాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు కెసిఆర్ పేర్కొన్నారు.
దాని కోసం క్రమపద్ధతిలో ఏ మతానికి సంబంధించినటువంటి మత బోధకులైనా, మత కార్యాలయాలైనా, ఆలయాలైనా చర్చిలైనా, మసీదులైనా, మరొకటైనా, బౌద్ధ జైన మందిరాలైనా, హ్యుమన్ ఇంపార్టెన్స్ గురించి హ్యుమన్ క్వాలిటీస్ ఇంప్రూవ్‌మెంట్ గురించి, కరుణ, దయ వంటి గ్రేస్పుల్ జీవితం గురించి ఎంత ఎక్కువ ప్రచారం చేస్తే అంత మంచిదని ఈ సందర్భంగా పెద్దలందరికీ మనవి చేస్తున్నానని కెసిఆర్ పేర్కొన్నారు. అటువంటి ప్రపంచం రావాలని క్రీస్తు తర్వాత కూడా ఎందరో మహనీయులు అనేక మంది స్వేచ్ఛ కోసం స్వాతంత్య్రం కోసం, ప్రగతి కోసం అందరూ చక్కగా బతికేటటువంటి సమాజం కోసం ప్రయత్నాలు చేశారన్నారు.
క్రీస్తు బోధనలు తూచ తప్పకుండా పాటిస్తే….
క్రీస్తు బోధనలు తూచా తప్పకుండా పాటిస్తే ప్రపంచంలో ఈర్ష, ఆసూయ, ద్వేషం, స్వార్థం, ఇతరుల పట్ల అసహనం అనేవి ఉండనే ఉండవని కెసిఆర్ అన్నారు. మనిషి తనకు తాను ఏ విధంగా ప్రేమించుకుంటాడో, పొరుగువారిని, ఇతరులను కూడా ప్రేమించడం అలవాటు చేసుకోవాలన్నారు. ఇది ఒక శాంతిదూతగా ప్రపంచానికి సందేశం ఇచ్చినటవుంటి మహోన్నతమైనటువంటి దేవుని బిడ్డ జిసస్ క్రీస్తు అని వ్యాఖ్యానించారు. ఆయన సిద్దంతాలను తప్పకుండా పాటిస్తే ఈ ప్రపంచంలో యుద్ధాలే జరగవన్నారు.
మనలను మనము ఎంతగా ప్రేమించుకుంటామో కూడా అంతగా ప్రేమించాలి అనే మానవత్వం క్రీస్తు సొంతమని కెసిఆర్ అన్నారు.
తనను హింసించిన వారిని సైతం క్షమించే గుణం మహోన్నతమైనదన్నారు. రాగద్వేషాలకు అతీతంగా మనిషి ఉన్నతమైన సంఘజీవిగా ఎదుగుతాడన్నారు. ఆ దిశగా పురోగమిద్దామని కెసిఆర్ పేర్కొంటూ దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కీస్తు బోధనలు ప్రపంచశాంతికి బాటలు..
అది సాధించగలిగితే…మనిషి దేవుడవుతాడు
క్రీస్తు కాంక్షించిన ప్రపంచం ఎంత ఉదాత్తమన, ఔన్నత్యమైనటువంటిదని కెసిఆర్ అన్నారు. ఎంత గొప్ప మానవ ప్రపంచమన్నారు. అది సాధించగలిగితే మనిషి దేవుడు అయిపోతాడని వ్యాఖ్యానించారు. వారు చెప్పిన ప్రపంచం, వారు కలలగన్న ప్రపంచంఆ సందేశం తీసుకునే వారు దేవదూత, దేవుని బిడ్డగా మన మధ్యకి వచ్చి చాలా ప్రయత్నం చేశారన్నారు.
దీని కోసం ఎన్నో హింసలకు, అవమానాలకు, నమ్మిన సొంత వ్యక్తుల చేతిలోనే హత్యకు గురయ్యేటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా తన చివరి క్షణంలో కూడా విశాలమైనటువంటి ఈ భూమి అంతా వసుదైక కుటుంబంగా, యూ నివర్స్ ఒక ఫ్యామిలీగా ఉండాలని ఆకాంక్షించారన్నారు. అం దులో మహోన్నతుడు మన క్రీస్తు కూడా ఉన్నారన్నారు. క్రీస్తు మార్గంలో పయనించడానికి ప్రయత్నిద్దామన్నారు.
అనాధ పిల్లకు క్రిస్మస్ బహుమతులు
వేడుకల్లో పాల్గొనేందుకు స్టేడియంకు వచ్చిన కెసిఆర్ తొలుత అనాధ పిల్లల వద్దకు వెళ్లారు. వారికి క్రిస్టమస్ బహుమతులను అందించి వారిని ఆప్యాయంగా పలకరించారు. వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వేదిక పైన ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ ని వెలిగించారు. క్రిస్మస్ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రిస్టియన్ మత పెద్దలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మత పెద్దలు కలిసి సిఎంకు జ్ఞాపకను అందజేశారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విందులో సిఎం పాల్గొన్నారు. ఈ వేడుకల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, సిఎంవో అధికారులు, కార్డినల్ పూల ఆంథోనీ తో పాటు పలువురు క్రైస్తవ మత సంఘాల పెద్దలు, బిశప్పులు, ప్రభుత్వ మైనారిటీ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.