Friday, December 20, 2024

వెలివేతకు వెరవని స్ఫూర్తిదాత

- Advertisement -
- Advertisement -

బ్రాహ్మణ కుటుంబంలో పుట్టన ఒక యువకుడు మహత్మా గాంధీ బోధనలకు ప్రభావితమై తన గ్రామంలోని మాదిగల ఇండ్లలోకి వెళ్లి, వారిని చైతన్య పరచడానికి ప్రయత్నించారు. అయితే ఆయన కుల పెద్దలు ఆయన తోపాటు ఆయన కుటుంబాన్ని కులం నుంచి వెలివేశారు. అది కొంత కాలం కొనసాగింది. ఆ యువకుడి కుటుంబాన్ని కులంలో జరిగే ఎటువంటి శుభకార్యాలకు పిలిచేవాళ్లు కాదు. అది ఆ కుటుంబాన్ని ఎంతో వేదనకు గురి చేసింది. అయితే ఆ యువకుడు మాత్రం భయపడలేదు. కొంత కాలం పాటు వెలివేతకు గురైతేనే ఎంతో బాధపడతుంటే, తరతరాలుగా వివక్షకు, అంటరానితనానికి గురైన మాల, మాదిగలు ఎంత క్షోభను అనుభవిస్తున్నారో కదా అని ఆ యువకుడు ఆలోచించి, జీవితాంతం అటువంటి వారి సంక్షేమం కోసం తన చేతనైనంత సాయం చేయడానికి నిలబడ్డారు.

ఆ యువకుడు ఎవరో కాదు 98 ఏళ్ల నవ చైతన్య స్ఫూర్తి, నిత్యం అధ్యయనం, ఆలోచన, ఆచరణలతో సామాజిక ఉద్యమ కార్యశీలి చుక్కా రామయ్య. చుక్కా రామయ్య ఉమ్మడి వరంగల్ నేటి జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో నవంబర్ 20, 1925లో జన్మించారు. తండ్రి అనంత రామయ్య ఆ గ్రామ పురోహితుడు. తల్లి గృహిణిగానే ఉన్నప్పటికీ సాంప్రదాయ ఆలోచనల నుంచి బయటపడి, కొడుకును పౌరోహిత్యం వైపు వెళ్లవద్దని భర్తతో గొడవపడి చదువువైపు మళ్లించిన నరసమ్మ గొప్ప చైతన్యశీలి.

ఆ రోజుల్లో గ్రామాల్లో పాఠశాలలు చాలా తక్కువ. సొంత ఊరిలో మూడవ తరగతి చదువుకున్న రామయ్య ఆ తర్వాత హన్మకొండకు, ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వచ్చారు. హన్మకొండలో చదువుతున్న సమయంలోనే రోజు గ్రామానికి వస్తుండేవాడు. ఆ సమయంలోనే మొదట గాంధీయ ఉద్యమం వైపు, ఆ తర్వాత కమ్యూనిస్టు పోరాటాల వైపు మళ్లారు. ఆ సందర్భంలోనే నిజాం ప్రభుత్వం రామయ్యను అరెస్టు చేసి ఔరంగాబాద్ జైలులో నిర్బంధించారు. తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న సమయంలో చుక్కా రామయ్య కీలక భూమికను పోషించారు. గ్రామంలో రైతులను చైతన్యపరచడానికి రాత్రి సమావేశాలు, ప్రత్యేకించి పుస్తకాలు చదివి వినిపించి, తన ఉద్యమం భాగస్వామ్యానికి చాటుకున్నారు. చుక్కా రామయ్య జైలులో ఉన్నప్పుడే పుస్తక పఠనం వైపు ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రూ రాసిన లెటర్స్ టు డాటర్, డిస్కవరి ఆఫ్ ఇండియా లాంటి పుస్తకాలను చదివి ఎంతో ప్రభావితమయ్యారు.

తెలంగాణ సాయుధ పోరాటం అనంతరం ఉపాధ్యాయునిగా చేరారు. మొదటి నుంచి గణితంపై ఉన్న ఆసక్తిని ఆయన ఉపాధ్యాయునిగా మరింత పెంచుకున్నారు. ఆ తర్వాత ఆయన గణితంలో ఉన్న ప్రావీణ్యంతో ఐఐటి ప్రవేశాల కోసం శిక్షణను ఇచ్చి, ఐఐటి రామయ్యగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఒక వైపు ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా తన పాత్రను కొనసాగిస్తూనే సామాజిక ఉద్యమాల్లో ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యమంలో కీలక భూమికను పోషించారు. అయితే వీటన్నింటితోపాటు, 2009లో ప్రారంభమైన నిరంతర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆయన ఒక దిగ్గజంలాగా నిలబడ్డారు. ఉద్యమంలో ఉద్యమంలో అన్ని సంఘాలకు, సంస్థలకు ఒక పెద్ద దిక్కుగా ఉండేవారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులపై ఎటువంటి దాడి జరిగినా ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యేవారు.

ఆయన అప్పుడు ఎం.ఎల్.సి గా ఉన్నారు. 2007 సంవత్సరంలో ఉపాధ్యాయ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆరు సంవత్సరాలు అంటే 2013 వరకు ఆ బాధ్యతల్లో ఉన్నారు. ఆ సమయంలో నేను తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడిగా, తెలంగాణ జాయింట్ ఆక్షన్ కమిటి (టిజెఎసి) కో చైర్మన్‌గా ఎన్నో సార్లు చుక్కా రామయ్య గారితో ఎన్నో సంఘటనల్లో, సందర్భాల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. వయసులో నేను ఎంతో చిన్నవాడనైనప్పటికీ, ఆయన ఇచ్చిన ఆదరణ, ప్రేమ మరువలేనిది. కొన్ని సార్లు ఒక కార్యకర్తగా అనుసరించేవారు. ఇక్కడ ఒక సంఘటనను గుర్తు చేసుకోవాలి. జనవరి 27, 2013న తెలంగాణ జెఎసి సమర దీక్షకు పిలుపు నిచ్చింది. ఇది రెండు రోజులు సాగించాలని జెఎసి నిర్ణయించింది. అయితే అప్పటి ప్రభుత్వం ఆ దీక్షకు అనుమతి నిరాకరించింది. అయితే జెఎసి తరపున ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్న నేను, ఇతఋర మిత్రులతో కలిసి పోలీసుల ఆంక్షలను ఎదిరించాలని, ఎట్లాగైన సరే అక్కడికి చేరాలని నిర్ణయించాం. ఇందిరా పార్క్‌లో ఈ దీక్షను చేయాలని నిర్ణయించాం.

అయితే పోలీసుల కన్ను గప్పి అక్కడికి చేరాలంటే, అక్కడికి దగ్గరలో ఉన్న ఏదైన ఒక ఇంటికో, భవనానికో చేరుకోవాలి. ఆరా తీస్తే అక్కడికి వంద మీటర్ల దూరంలో నిజామాబాద్ ఆర్మూర్‌కు చెందిన డాక్టర్స్ జెఎసి నాయకులు డాక్టర్ మధుశేఖర్ ఇల్లు ఉందని తెలిసి, మధును అడిగాం. వెంటనే ఆయన అంగీకరించారు. అయితే పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించడం సాధారణ కార్యకర్తలు చేస్తే అంత పెద్ద ప్రభావం ఉండదు. అందుకని తెలంగాణలో ఉన్నత స్థానాల్లో ఉన్న మేధావులను అడగాలనుకున్నాం. అందులో చుక్కా రామయ్య ఒకరు. ఆయనతోపాటు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని, డాక్టర్ గోపాల్ కిషన్ గారిని అడిగాం. చాలా పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. ఆ ముగ్గురి పెద్దలతో పాటు, దాదాపు వంద మందిని మధు శేఖర్ ఇంట్లోకి చేర్చగలిగాం. అదను చూసి ఒక్కుమ్మడిగా పోలీసు వలయాన్ని ఛేదించాలని నిర్ణయించాం. అయితే అప్పటి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి నుంచి నాకు ఫోన్ వచ్చింది.

ఒకసారి వచ్చి కలువమని దాని సారాంశం. అయితే నేనొక్కడిని వెళ్లకుండా చుక్కా రామయ్య గారిని కూడా తీసుకెళ్లాను. కొంత సేపు మాట్లాడిన తర్వాత రెండు రోజుల సమర దీక్షకు అనుమతి ఇస్తున్నట్టు సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అప్పటికి సాయంత్రం అయింది. ఆ సమర దీక్ష జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఇది ఎందుకు చెప్పానంటే అప్పటికే చుక్కా రామయ్యకు 88 సంవత్సరాలు. గోపాల్ కిషన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా సమాజంలో ఎంతో విలువ ఉన్న వాళ్ళు. అటువంటి వాళ్ళు అంత చొరవ చేశారంటే అది వారి గొప్ప హృదయానికి తార్కాణం. అట్లా చుక్కా రామయ్య తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని సంఘటన లేదు. దాదాపు ఆ అయిదేళ్లు ప్రతిరోజు ఒకటి కాదు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. దానితోపాటు, 2012 డిసెంబర్ 2 వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆమోదించిన ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ చట్టం సందర్భంలో లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఎంతో ముఖ్యమైన పాత్రను నిర్వహించారు. ఈ చట్టానికి ముందు అనేక సందర్భాల్లో ఎస్‌సి, ఎస్‌టిల సంక్షేమం, బడ్జెట్ పై జరిగిన చర్చల్లో సుదీర్ఘమైన ప్రసంగాలు చేశారు.

మల్లేపల్లి లక్ష్మయ్య
(సీనియర్‌జర్నలిస్టు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News