వాషింగ్టన్: అమెరికా కేంద్ర గూఢచార సంస్థ సిఐఎ చీఫ్ తాలిబన్లతో రహస్య చర్చలు జరిపినట్లు ప్రముఖ దినపత్రిక ‘వాషింగ్టన్ పోస్ట్’ వెల్లడించింది. తాలిబన్ల సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ బరాదర్‌తో సిఐఎ చీఫ్ విలియమ్ బర్న్ సోమవారం మాట్లాడినట్లు ఆ పత్రిక తెలిపింది. తాలిబన్ల అధీనంలోని అఫ్ఘన్‌నుంచి భారీ ఎత్తున అమెరికన్లను తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఈ చర్చలు జరగడం స్రాధాన్యతను సంతరించుకుంది. ఒక వేళ అదే నిజమైతే.. అఫ్ఘన్‌లో తాలిబన్లు మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లతో బైడెన్ ప్రభుత్వం జరిపిన అత్యున్నత స్థాయి చర్చలు ఇవే అవుతాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో బర్న్ అత్యంత అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త కాగా.. ఇటు తాలిబన్ల కీలక నేతల్లో బరాదర్ ఒకరు కావడం గమనార్హం. ఈ ఇద్దరి మధ్య రహస్య చర్చలు జరిగినట్లు వెల్లడించిన వాషింగ్టన్ పోస్ట్ .. అందులో ఏ అంశాలపై చర్చించారో మాత్రం చెప్పలేదు. దీనిపై వ్యాఖ్యానించడానికి సిఐఎ నిరాకరించిందనిఆ పత్రిక తెలిపింది. అయితే అఫ్ఘన్‌నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ఆగస్టు 31 లోగా ముగించని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని తాలిబన్లు హెచ్చరించిన నేపథ్యంలో ఆ అంశంపైనే వీరిద్దరూ చర్చించి ఉంటారని భావిస్తున్నారు.