Monday, December 23, 2024

బోధన్ నకిలీ చలాన్ల వ్యవహారం

- Advertisement -
- Advertisement -
34 మందిపై అభియోగం

హైదరాబాద్ : బోధన్‌లోని వాణిజ్య పన్నుల శాఖ నకిలీ చలాన్ల కుంభకోణం వ్యవహారంలో సిఐడి అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం 34 మందిని నిందితులుగా చేర్చారు. వీళ్లలో సింహాద్రి లక్ష్మీ శివరాజు, ఆయన కుమారుడు వెంకట సునీల్‌లను సూత్రధారులుగా పేర్కొన్నారు. బోధన్‌లోని వాణిజ్య పన్నుల శాఖకు చెందిన 23 మందిని నిందితులుగా చేర్చారు. సహాయ వాణిజ్య పన్నుల అధికారులతో పాటు జూనియర్ అసిస్టెంట్లు నిందితులుగా ఉన్నారు. 68 కంప్యూటర్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు సిఐడి అధికారులు ఛార్జిషీట్‌కు జతపర్చారు. ఛార్జిషీట్‌లో 143 కీలక డాక్యుమెంట్లు, 3 ఆడిట్ రిపోర్టుల సారాంశాన్ని సిఐడి పొందుపరిచింది.

సింహాద్రి లక్ష్మీ శివరాజు, ఆయన కుమారుడు వెంకట సునీల్.. నిజామాబాద్ పట్టణంలో వాణిజ్య పన్నుల శాఖలో ప్రైవేట్ ఆడిటర్లుగా పని చేసేవారు. ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకొని సిబ్బందిని నియమించుకొని ఆడిటింగ్ చేసేవారు. ఈ క్రమంలో పలు రైస్ మిల్లర్లతో పాటు ఇతర వ్యాపారులు విలువ ఆధారిత పన్ను చెల్లించేందుకు లక్ష్మీ శివరాజును ఆశ్రయించారు. ఈ క్రమంలో బోధన్‌లోని వాణిజ్య పన్నుల శాఖలో పని చేసే అధికారులు, సిబ్బందితో చేతులు కలిపిన శివరాజు, ఆయన కుమారుడు వెంకట సునీల్ నకిలీ చలాన్లు సృష్టించి పన్ను చెల్లించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.231.22 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. 2012 నుంచి 2017 వరకు నకిలీ చలాన్లతో విలువ ఆధారిత పన్ను(వ్యాట్) చెల్లించినట్లు వాణిజ్య పన్నుల శాఖ అంతర్గత ఆడిటింగ్‌లో తేలింది.

2017 ఫిబ్రవరి 2న అప్పటి బోధన్ సీటీవో విజయేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా పోలీస్ ఉన్నతాధికారులు సిఐడికి బదిలీ చేశారు. అనంతరం సిఐడి అధికారులు కేసు దర్యాప్తులో భాగంగా సిటివొ కార్యాలయంలోని కీలక పత్రాలు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, వేల సంఖ్యలో ఉన్న నకిలీ చలాన్లు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ చలాన్లను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. కరీంనగర్‌లోని ఎసిబి ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన అభియోగ పత్రంలో సిఐడి అధికారులు 123 మందిని సాక్ష్యులుగా చేర్చారు. ఈ కేసులో మొత్తం 34 మందిని నిందితులుగా చేర్చగా వారిలో కొందరు వాణిజ్యపన్నుల శాఖ సిబ్బంది ఇప్పటికే పదవీ విరమణ పొందారు. ఈ క్రమంలో తాజాగా సిఐడి అభియోగపత్రం దాఖలు చేయడంతో ఈ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News