మన తెలంగాణ/హైదరాబాద్ : ‘రెడ్ బుక్’ అంశంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై సిఐడి దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఎసిబి కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. నారా లోకేశ్ తన ప్రసంగాల్లో ‘రెడ్ బుక్’ అంశం ప్రస్తావనకు తెస్తుండడం పట్ల సిఐడి గత నెలలో ఎసిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ‘రెడ్ బుక్’ పేరుతో లోకేశ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సిఐడి వివరించింది.
లోకేశ్ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్ లో కోరింది. దీనిపై డిసెంబరు 28న విచారణ జరగ్గా, జనవరి 9కి వాయిదా పడింది. మంగళవారం విచారణ సందర్భంగా. వాట్సాప్ ద్వారా లోకేశ్ కు నోటీసులు పంపినట్టు సిఐడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పోస్ట్ ద్వారా పంపిస్తే అందుబాటులో లేరని, ఆ నోటీసులు రిటర్న్ అయినట్టు వివరించారు. దాంతో, కోర్టు ద్వారా నోటీసులు పంపుతామని ఎసిబి కోర్టు పేర్కొంది. అనంతరం కేసు విచారణను వాయిదా వేసింది.