26 నుంచి కాలేజీలు, వర్సిటీలకు అనుమతి
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్-19కు సంబంధించి అమలులో ఉన్న లాక్‌డౌన్ ఆంక్షలను మరింత సడలిస్తున్నట్లు కర్నాటక ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఈ నెల 19 నుంచి(సోమవారం) సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతించడంతోపాటు రాత్రి పూట అమలులో ఉన్న కర్ఫూను గంటపాటు సడలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జులై 26 నుంచి కాలేజీలు, యూనివర్సిటీలు తదితర ఉన్నత విద్యా సంస్థల ప్రారంభానికి కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప ఆదివారం తన నివాసంలో సీనియర్ మంత్రులు, అధికారులతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కొవిడ్-19 నిబంధనలను అనుసరించి 50 శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమా థియేటర్ల నిర్వహణకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కాలేజీలు, విశ్వవిద్యాలయాల పునఃప్రారంభానికి సంబంధించి కనీసం ఒక డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే తమ విధులకు, తరగతులకు హాజరు కావలసి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఉన్న కర్ఫూ ఆంక్షలను సోమవారం నుంచి రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 వరకు సడలిస్తున్నట్లు తెలిపింది.