Monday, November 25, 2024

మంత్రి పదవి కన్నా.. సినిమానే నా ప్రాణం: మంత్రి సురేష్ గోపి

- Advertisement -
- Advertisement -

కోచ్చి(కేరళ): మంత్రి పదవిలో ఉండి సినిమాల్లో నటించినందుకు తనను పదవి నుంచి తప్పించిన పక్షంలో తాను బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకుంటానని రాజకీయ నేతగా మారిన మలయాళ సినీ నటుడు, కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి వ్యాఖ్యానించారు. ఓట్టకొంబన్ చిత్రంలో నటించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కోరానని, ఇంకా అది అందలేదని బుధవారం నాడిక్కడ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, టూరిజం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. అయితే సెప్టెంబర్ 6 నుంచి తాను షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు ఆయన ప్రకటించారు.

20 నుంచి 22 చిత్రాలకు సంబంధించిన కథలు విని వాటిలో నటించడానికి అంగీకరించానని ఆయన వెల్లడించారు. సినిమాల్లో నటించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరితే ఎన్ని చిత్రాలలో అని ఆయన అడిగారని సురేష్ గోపి తెలిపారు. తాను 22 సినిమాలు అని చెప్పినపుడు అమిత్ సా తన అభ్యర్థనను పక్కనపెట్టేశారని ఆయన తెలిపారు. అయితే అనుమతి ఇస్తానని మాత్రం ఆయన చెప్పారని, ఏదేమైనా తాను సెప్టెంబర్ 6న ఇక్కడ ఉంటానని కేరళ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు.

తాను సినిమా షూటింగ్‌లో ఉన్నపుడు తన మంత్రివర్గ బాధ్యతల నిర్వహణ కోసం తన మంత్రిత్వ శాఖ నుంచి ముగ్గురు, నలుగురు అధికారులను ఇక్కడకు తెచ్చుకుంటానని, సినిమా సెట్స్‌లో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటానని సురేష్ గోపి వివరించారు. తాను చేయాల్సింది ఇదేనని, ఒకవేళ కేంద్ర మంత్రి పదవి నుంచి తనను తొలగిస్తే బతికిపోయానని భావిస్తానని, ఇంతకు మించి తాను చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించారు.

మంత్రి పదవిని తాను ఆశించలేదని, ఇప్పటికీ తనకు ఆ కోరిక లేదని ఆయన అన్నారు. మంత్రి పదవిని ఇస్తున్నామని పార్ట ఈనాయకత్వం చెప్పినపుడు వారి ఆజ్ఞను శిరసావించానని, తనను గెలిపించిన త్రిసూర్ ప్రజల కోసమే దీన్ని అంగీకరించానని ఆయన అన్నారు. పార్టీ నాయకుల ఆదేశాలను ఇప్పటికీ గౌరవిస్తానని, అయితే సినిమా(నటన) లేకపోతే తాను చనిపోయినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News