పండుగల సమయంలో నిర్మాతలు ఓటీటీకి వెళ్లవద్దనీ… దీని వల్ల తమకు చాలా ఇబ్బంది కలుగుతుందని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వాపోయారు. పండుగల సమయంలో నిర్మాతలు ఓటీటీలో సినిమాలను విడుదల చేయవద్దని వారు కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్‌లో తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ సమావేశంలో తెలంగాణా ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్, సెక్రటరీ సునీల్ నారంగ్, జాయింట్ సెక్రటరీ బాలగోవింద్ రాజ్, టి ఎఫ్‌సిసి మెంబర్ అనుపమ్ రెడ్డి, థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీ విజయేందర్ రెడ్డి, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ నారంగ్ మాట్లాడుతూ “అక్టోబర్ నెల వరకు సినిమాలను ఓటీటీకి ఇవ్వవద్దని నిర్మాతలంతా కూర్చొని నిర్ణయం తీసుకున్నాం. మధ్య లో ఒకటి, రెండు సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఇప్పు డు ‘లవ్‌స్టోరి’ సినిమాను వచ్చే నెల 10న థియేటర్‌లలో విడుదల చేస్తామని ప్రకటించగా, దానికి పోటీగా ‘టక్ జగదీష్’ సినిమాను అదే రోజు ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నామని ఆ నిర్మాతలు ప్రకటించారు. ఓ వారం అటుఇటుగా ‘టక్ జగదీష్’ ను విడుదల చేయమని వాళ్లను కోరాము.
దీంతో ఆ నిర్మాతలు అమెజాన్ వాళ్లతో మాట్లాడి చెబుతామన్నారు. రెండు పెద్ద చిత్రాలు ఒకేరోజు థియేటర్, ఓటీటీలో విడుదలైతే నిర్మాతలు నష్టపోతారు. పండుగల సమయంలో నిర్మాతలు ఓటీటీకి వెళ్లొద్దు. దీని వల్ల నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు చాలా ఇబ్బంది కలుగుతుంది. భవిష్యత్తులో థియేటర్ల మనుగడకు ఇది సమస్యగా మారుతుంది. ఈ సమస్యను చిరంజీవి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ఈ విషయంలో మాట్లాడతానన్నారు”అని చెప్పారు. నిర్మాత చదలవాడ మాట్లాడుతూ “ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్ ఇప్పుడు లేకపోయినా వాళ్ళ సినిమాలు ఆడిన థియేటర్స్ ఇప్పటికీ వున్నాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మధ్య అవినాభావ సంబంధం వుంది. సినిమా అనుభూతి అనేది ఓటిటీ కన్నా థియేటర్‌లోనే బాగా వుంటుంది. నిర్మాతలకు నా విజ్ఞప్తి ఏమిటంటే ఓటీటీలను పక్కన పెడదాము. సెప్టెంబర్ 10న ‘లవ్ స్టోరీ’ రిలీజ్ అవుతున్నప్పుడు ‘టక్ జగదీష్’ చిత్రాన్ని అదే రోజు ఓటీటీలో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు”అని అన్నారు.