భారత్‌లో తయారీకి అమెరికా సంస్థ ఎలీలిల్లీతో ఒప్పందం
హైదరాబాద్ : రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే బారిసిటినిబ్ ఔషధాన్ని కరోనా రోగుల చికిత్సకు కూడా వినియోగించడానికి వీలుగా అమెరికా కు చెందిన ఎలీ లిల్లీ ఔషధ సంస్థతో సిప్లా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఔషధాన్ని భారత్‌లో తయారు చేసి విక్రయించనున్నట్టు సిప్లా సంస్థ సోమవారం ప్రకటించింది. బారిసిటినిబ్‌ను పరిమిత అత్యవసర వినియోగానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోలు ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఒ)కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అనుమతించాయి. ఆస్పత్రిలో కరోనా రిస్కుతో ఉన్న వయోజన రోగులకే దీన్ని వినియోగిస్తారు. కొవిడ్ బాధితులకు రెమ్‌డెసివిర్ ఔషధంతో కలిపి బారిసిటినిబ్ ఇవ్వడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ గత ఏడాది నవంబరులో అత్యవసర అనుమతి ఇచ్చింది. తాజాగా భారత్‌లో కూడా దీనికి అనుమతి మంజూరైంది. ఇప్పటికే రెమ్‌డెసివిర్, ఫావిపిరావిర్, టోసిలిజుమాబ్ వంటి కరోనా ఔషధాలను సిప్లా తయారు చేస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో బారిసిటినిబ్ చేరింది. కరోనా రోగుల భద్రతలో సిప్లా ఇప్పటికే ముందంజలో ఉంటుండగా, అమెరికా సంస్థ ఎలీలిల్లీ తో ఒప్పందం కుదరడం, భాగస్వామ్యం పొందడం కొవిడ్ కట్టడికి మరింత అంకితభావం చూపడమౌతోందని సిప్లా సంస్థ సిఇఒ యుమాంగ్ వోహ్రా పేర్కొన్నారు.