భూపాలపల్లి కలెక్టరేట్: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రోడ్లు, భవనాల శాఖ సర్కిల్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా శనివారం సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన జిల్లా క్రమ క్రమాన అన్ని సౌలభ్యాలను నిర్మించుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే భూపాలపల్లికి అన్ని కార్యాలయాలు తరలివచ్చాయని, ఇటీవలే జిల్లా కేంద్రంలో రోడ్లు, భవనాల అతిధి గృహాన్ని కూడా నిర్మించుకుందామని తెలిపారు. నాడు ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం భూపాలపల్లికి ఒక ఔటర్ రింగ్ రోడ్డు తీసుకువస్తానని చెప్పిన క్రమంలో నేడు మంత్రి తారక రామరావు ప్రత్యేక చొరవతో భూపాలపల్లికి ఔటర్ రింగ్‌రోడ్డు అమలు జరిగిందని, దాదాపు 22 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డు ఉంటుందని తెలిపారు.
ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్డు కోసం 137 ఎకరాల భూమి అవసరం ఉంటుందని అధికారులు భూ సేకరణ పనిలో ఉన్నారని తెలిపారు. గణపురం మండలం కర్కపల్లి గ్రామ శివారు నుండి భూపాలపల్లి మున్సిపాలిటీ బాంబులగడ్డ వరకు ఔటర్‌రింగ్ రోడ్డు వస్తుందని గుర్తు చేశారు. ఈ మేరకు సర్కిల్ కార్యాలయంలో మీడియా మిత్రుల సమీక్ష సమావేశంలో భూపాలపల్లి ఔటర్ రింగ్ రోడ్డు మ్యాప్‌ను ఆవిష్కరించారు. రోడ్లు, భవనాల శాఖ కార్యాలయం ములుగు నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు తీసుకొచ్చుకోవడం చాలా శుభసూచకమని పూర్తి స్థాయి అధికారులు ఇక్కడ నుండే కార్యక్రమాలు నిర్వహించుకుంటారని అన్నారు. చెల్పూర్ గ్రామం నుండి బాంబులగడ్డ వరకు ఇప్పటికే నాలుగు లైన్ల ప్రధాన రహదారి కూడా పనులు జరుగుతున్నాయని వాహనదారులకు, పట్టణ వాసులకు ట్రాఫిక్, ఇతరత్రా అవసరాలు సుగుమంగా జరుగుతాయని తెలిపారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ దినోత్సవం సందర్బంగా వికలాంగుల సోదర సోదరీమణులకు పెద్ద దిక్కుగా నిలబడి నిన్న జరిగిన మంచిర్యాల సభ వేదికగా రూ.3016కు అదనంగా రూ.1000 పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజల పక్షాన వికలాంగ సోదర సోదరీమణుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రమేష్‌గౌడ్, సిద్దు, పట్టణాధ్యక్షుడు కటకం జనార్థన్, కౌన్సిలర్లు గండ్ర హరీష్‌రెడ్డి, శిల్పానిల్, పిల్లల నారాయణ, దార పూలమ్మ, నూనె రాజు, చిరంజీవి, కోఆప్షన్ వార్డు అధ్యక్షులు కెవి అశోక్‌గౌడ్, బాలరాజ్, బిడ్డల పోశం ఐలయ్య, టిబిజికెఎస్ అధ్యక్షులు బడితల సమ్మయ్య, సదానందం, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.