న్యూఢిల్లీ: పదోతరగతి బోర్డు పరీక్షల్ని సిఐఎస్‌సిఇ రద్దు చేసింది. దేశంలో కొవిడ్19 ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సిఐఎస్‌సిఇ బోర్డు కార్యదర్శి గెర్రీ అరాథూన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత వారమే 10, 12 తరగతుల పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు సిఐఎస్‌సిఇ తెలిపింది. అయితే, పదో తరగతి విద్యార్థులకు ఆ తర్వాత పరీక్షలకు హాజరు కావడం లేదా అంతర్గత మదింపు ద్వారా మార్కుల కేటాయింపులో ఏదో ఒకటి ఎంచుకునే ఐచ్ఛికమిచ్చింది. ఇప్పుడు ఐచ్ఛికాన్ని ఉపసంహరించి, అంతర్గత మదింపు ద్వారా ఫలితాలను వెల్లడి చేయనున్నట్టు తెలిపింది. ఫలితాల తేదీని త్వరలో వెల్లడిస్తామని గెర్రీ తెలిపారు. 12వ తరగతి విషయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులకే కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. సిబిఎస్‌ఇ కూడా గత వారమే పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ, 12వ తరగతి పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. పలు రాష్ట్రాల బోర్డులు కూడా పదో తరగతి పరీక్షల రద్దు లేదా వాయిదాలను ఇప్పటికే ప్రకటించాయి.
యుజిసి-నెట్ వాయిదా
యుజిసినెట్‌ను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌పోఖ్రియాల్ తెలిపారు. కొవిడ్19 ఉధృతి కారణంగా అభ్యర్థుల ఆరోగ్యరక్షణ దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గత షెడ్యూల్ ప్రకారం దేశవ్యాప్తంగా యుజిసినెట్‌ను మే 2నుంచి 17వరకు నిర్వహించాలి. తదుపరి షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) త్వరలో ప్రకటిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. ఎన్ టిఎ తాజా ఆదేశాలమేరకు పరీక్షలకు 15 రోజులముందే షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. పలు సబ్జెక్టుల్లో పిజి పూర్తి చేసినవారికి యూనివర్సిటీల్లో బోధనార్హతను నిర్ణయించేందుకు ఈ పరీక్షల్ని నిర్వహిస్తారు.
CISCE class 10 Exams 2021 Cancelled