Thursday, January 23, 2025

పశ్చాత్తాపం లేని కంగనా

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ విమానాశ్రయంలో ఈ నెల ఆరవ తేదీన ఒక అరుదైన అసాధారణమైన ఘటన జరిగింది. అందరికీ సుపరిచితమైన హిందీ సినిమా నటి కంగనా రనౌత్‌ను, అక్కడ భద్రతా విధులలో గల కుల్వీందర్ కౌర్ అనే సిఐఎస్‌ఎఫ్ జవాన్ విమర్శిస్తూ చెంప మీద కొట్టారు. అట్లా ఎందుకు చేసారో, కంగనాపై తన విమర్శ ఏమిటో ఆ జవాన్ అక్కడే తీవ్ర స్వరంతో మాట్లాడుతూ చెప్పారు. తను చెప్పిన కారణం ఈ విధంగా ఉంది: నరేంద్ర మోడీ ప్రభుత్వం 2020లో తెచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు 2020 21లో ఆందోళన చేసినపుడు కంగనా రనౌత్ వారిని దేశద్రోహులు, ఖలిస్థానీలు, నక్సలైట్లని నిందించారు. అదే ఆందోళనలో పాల్గొన్న మహిళా రైతులను రూ.100, రూ.200 తీసుకుని కూర్చున కిరాయి స్త్రీలన్నారు. అపుడు ఆందోళన చేసిన మహిళలలో ఈ జవాన్ కుల్వీందర్ కౌర్ తల్లి కూడా ఉన్నారు. ఆ పరిస్థితులలో అట్లా ఆందోళన చేసిన నా తల్లిని, ఇతర స్త్రీలను వంద, రెండొందలు తీసుకుని ధర్నాలో కూర్చున్న కిరాయి మహిళలు అంటావా అన్నది ఆ జవాన్, కంగనాకు వేసిన ప్రశ్నలు.

విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన వీడియోను, సంబంధిత ఇతర వీడియోలు, వార్తలను ఎందరు చూస్తున్నారో గాని, అదే ఆరవ తేదీ నుంచి మొదలుకొని దేశ విదేశాలలో దీనిపై చర్చోపచర్చలు విస్తృతంగా సాగుతున్నాయి. ఇప్పటికైతే సిఐఎస్‌ఎఫ్ అధికారులు కుల్వీందర్‌ను సస్పెండ్ చేసి విచారణ జరుపుతున్నారు. విడిగా పంజాబ్ పోలీసులు తనపై కేసు నమోదు చేశారు. అరెస్టు వార్తలు నిజం కాదని సిఐఎస్‌ఎఫ్ డిఐజి వినయ్ కాజ్లా ఆదివారం నాడు స్పష్టం చేశారు. తన పక్షాన కుల్వీందర్ బయట ఏమీ మాట్లాడలేదు. కంగనా మాత్రం వరుసగా మూడు రోజులు మూడు సార్లు మాట్లాడారు. అదేమిటో క్లుప్తంగా చూద్దాం. ఘటన జరిగిన వెంటనే ఢిల్లీ చేరుకుని మాట్లాడుతూ తాను క్షేమంగానే ఉన్నానని, అయితే పంజాబ్‌లో తీవ్రవాదం, ఉగ్రవాదం మళ్లీ పెరగటం ఆందోళనను కలిగిస్తున్నదన్నారు. ఘటన తర్వాత 24 గంటల పాటు కుల్వీందర్‌కు వివిధ వర్గాల నుంచి మద్దతు వ్యక్తమవుతుండగా, కంగనా కోసం బాలీవుడ్ నటులతో సహా ఎవరూ మాట్లాడలేదు. దానితో ఆమె రెండవ రోజున నిరసనగా స్పందిస్తూ, మీకు ఏదైనా జరిగితే ఇట్లానే ఉంటారా అని ఆగ్రహం చూపారు. దానితో కొందరు ఆ ఘటనను ఖండించారు. మరొక వైపు కుల్వీందర్ పక్షాన వ్యాఖ్యలు అదే విధంగా కొనసాగటంతో గతంలో తన మాటలకు కుల్వీందర్‌లో కలిగిన భావోద్వేగాలే కారణమంటున్నానరని, అందుకోసం ఆమెను సమర్థించటం సరైనదయితే, అత్యాచారాలు, హత్యలు చేసే వారికి కూడా ఏవో భావోద్వేగాలు ఉంటాయని, ఆ కారణంగా అటువంటి నేరస్థులను సైతం సమర్థిస్తారా అని మూడవ రోజు అన్నారు.

ఈ మొత్తం ఉదంతంలో గమనించవలసిన విషయాలు కొన్నున్నాయి. విమానాశ్రయంలో జరిగిన ఘటనను పురస్కరించుకుని ముందుకు వచ్చినవి కొన్నయితే, 2020 21 నాటి మోడీ ప్రభుత్వపు రైతు చట్టాలు, అందుకు నిరసనగా రైతుల సుదీర్ఘ ఆందోళనకు సంబంధించినవి మరికొన్ని. ముందుగా విమానాశ్రయం సంగతి చూద్దాము. యథాతథంగా కుల్వీందర్ చర్య ఎంత మాత్రం సమర్థించలేనిది. వ్యక్తిగా తన భావోద్వేగాలు ఎటువంటివైనా, తానక్కడ యూనిఫాంలో విధులు నిర్వర్తిస్తున్నందున ఆ క్రమ శిక్షణను, విధి బాధ్యతలను ఉల్లంఘించటం సరికాదు. వాస్తవానికి ఆమెను ఒక వెల్లువవలే సమర్థిస్తున్న సామాన్యులు, రైతులు, రైతుల సంఘాల వారు, సామాజిక ప్రముఖులు, కళాకారులు, యాక్టివిస్టులలోనూ అనేకులు తన ఆగ్రహ కారణాన్ని బలంగా సమర్థిస్తూనే, విధిని నిర్వహణలో ఉండి అట్లా చేయరాదనే అంటున్నారు.

తన చర్యపై విచారణ జరుపుతూనే అది పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగించాలని కోరుతున్నారు. సిఐఎస్‌ఎఫ్ డిఐజి వినయ్ కాజ్లా మాట్లాడినపుడు కూడా, గతంలో జరిగిన దాని పట్ల కుల్వీందర్‌లో ఆగ్రహం గూడుకట్టుకుని ఉందని, ఈ సందర్భంలో అది ఒక్కసారిగా తన్నుకు వచ్చినట్లు ఆమెతో మాట్లాడినపుడు తాను గుర్తించానని, విచారణ తప్పకుండా నిష్పక్షపాతంగా జరపగలమని అనటం గమనించదగ్గది. రైతు ఉద్యమ నాయకుడు మహేంద్రసింగ్ టికాయత్, ఇతర రైతు సంఘాల నాయకులు కూడా ఈ మూడు రోజులలో పోలీస్ డిజిపి తదితర అధికారులను కలిసి నిష్పక్షపాత విచారణను కోరారు. అదే సమయంలో కుల్వీందర్‌కు తమ పూర్తి మద్దతు ప్రకటించారు.

దీనంతటికీ మూల కారణం కంగనా రనౌత్ అయినందున ఇపుడు తన గురించి విచారిద్దాము. చండీగఢ్ ఘటన నుంచి మొదలుకొని మూడు రోజులలో తన వైఖరి ఏమిటి? కుల్వీందర్ చర్య సమర్థించరానిది అయినా, ఆ చర్య వెనుక గల కారణాలను గుర్తించకపోగా, పంజాబ్‌లో తీవ్రవాదం, ఉగ్రవాదం ఇంకా పెరుగుతున్నాయన్నారు. అనగా వ్యవసాయ చట్టాలు, రైతుల సమస్యలు, మహిళా రైతుల ఆందోళన, ఆ దరిమిలా తన వ్యాఖ్యల వల్ల కుల్వీందర్ వంటి రైతుబిడ్డల మనసులు గాయపడి స్పందించటం వంటివన్నీ ఆమెకు తీవ్రవాదం, ఉగ్రవాదం పెరగటంగా కనిపిస్తున్నాయన్న మాట కుల్వీందర్ చర్యకు ఇంత విస్తృతమైన మద్దతు ఎందుకు లభిస్తున్నదనే ఆలోచన అయినా తనకు లేకపోయింది.

అందుకే మూడవ రోజున మరొక వితండవాదనకు పూనుకున్నారు. తనను బలపరచనందుకు అంతకు ముందు రోజున తోటి నటులపై ఆగ్రహం చూపారు. గమనించదగినదేమంటే ఈ కాలమంతా ఆమెకు సమాజం నుంచి కాదు గదా కనీసం తన స్వంత పార్టీ అయిన బిజెపి నుంచి కూడా మద్దతు వాక్యాలు లభించలేదు. హోం మంత్రి అమిత్ షా అయినా ఆ ఘటనను ఖండించలేదు.తాను లోగడ ఆ మాటలు తొందర పాటులో అన్నానని, వాటిని ఉపసంహరించుకుంటున్నానని ఆమె ఒక్క మాట ఇపుడు అని ఉంటే సమస్య సమసిపోవటమే గాని తనపై గౌరవం కలిగేది. కాని ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రవర్తించి మరింత వ్యతికేకతను కొనితెచ్చుకున్నారు.

గతానికి వెళితే, 2020 వ సంవత్సరంలో మోడీ ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలు, అవి ధనిక వ్యాపారులకు లాభం కలిగించి తమకు నష్టం చేయగలవంటూ ఉత్తరాది రైతులు 2020 21లో సాగించిన సుదీర్ఘమైన ఉద్యమం, చివరకు మోడీ ఆ చట్టాలను ఉపసంహరించుకుంటూ రైతులకు పార్లమెంటులో క్షమాపణలు చెప్పటం తెలిసిందే. అందుకు సంబంధించి వివరాలలోకి ఇక్కడ వెళ్ళనక్కరలేదు గాని, ఆ సందర్భంలో స్వయంగా మోడీ ఆ రైతులను ఖలీస్థానీలు, నక్సలైట్లు వగైరా మాటలతో నిందించటాన్ని గుర్తు చేసుకోవాలి.

ఆయనకు, బిజెపికి వీరాభిమానురాలైన కంగన కూడా అదే ధోరణిలో అపుడు ట్వీట్లు, ప్రకటనలు చేశారు. ఆందోళనకారులు రైతులు కారు టెర్రరిస్టులు. వాళ్లు దేశాన్ని విభజించాలని చూస్తున్నారు. దేశం ముక్కలు ముక్కలైతే చైనాకు స్వాధీనం చేయాలనుకుంటున్నారు అన్న ఆమె ట్వీట్లలో ఒకటి. ఆందోళన చేస్తున్న మహిళా రైతులు 100, 200 రూపాయలు తీసుకుని ఆ పని చేస్తున్నారన్నది మరొకటి. మోడీ మాటలకే ఆగ్రహించిన రైతులు, దేశ ప్రజలు కంగన వ్యాఖ్యలను ఆమోదించగలరా? ఆమె వ్యాఖ్యలపై అప్పుడే ఆగ్రహావేశాలు వ్యక్తమయాయి. రైతుల సమస్యలు ఇంకా కొనసాగటమే గాక వారికి మోడీ ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదు. ఈ నిరసనలే మొన్నటి లోక్‌సభ ఫలితాలలో, అంతకు ముందు అసెంబ్లీ ఫలితాలలో ప్రతిఫలించాయి.

గురువారం నాటి కుల్వీందర్ చర్యకు ఈ నేపథ్యమంతా ఉంది. కంగన లోక్‌సభకు పోటీ చేసి గెలిచిన మండీ నియోజకవర్గం పంజాబ్‌కు పొరుగునే గల హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంది. అందువల్ల గాని, ఇతరత్రానైనా తనకు ఆ చట్టాల మంచి చెడులేమిటో, రైతుల ఆందోళన ఎంత న్యాయబద్ధమైనదో తెలియకపోయే అవకాశమే లేదు. అయినప్పటికీ ఆ చట్టాలను తన కారణాలతో తాను బలపరచదలచుకుంటే అది ఆమె స్వేచ్ఛ. ఆ ప్రకారం రైతులను విమర్శించ వచ్చు కూడా. కాని ఆ విధమైన వ్యాఖ్యలు చేయడమంటే తన స్వభావం, వ్యక్తిత్వం ఎటువంటివో గ్రహించవచ్చు. అందుకే ఆమెపై ఆ రోజుల్లో విమర్శలు వెలువడగా, అప్పటి ఆగ్రహంతో ఇప్పటికీ రగిలిపోతున్న కుల్వీందర్, క్రమశిక్షణకు విరుద్ధమని తెలిసి కూడా, తన ఆగ్రహాన్ని ఆ విధంగా ప్రదర్శించారు. స్వయంగా తన తల్లి ఆందోళనకారి కావటం, తన సోదరుడు రైతు నాయకుడవటం, తన రైతు కుటుంబ నేపథ్యం ఆమెను నిగ్రహం కోల్పోయేట్లు చేశాయి. దేశ విదేశాలలో చర్చగా మారిన ఈ ఉదంతం కనీసం ఇప్పటికైనా కంగనా వంటి వారిని పశ్చాత్తాప పడేట్టు చేసి, ప్రధాని మోడీ వ్యవసాయ విధానాలను మార్చగలిగితే సంతోషించాలి.

టంకశాల అశోక్
9848191767

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News