Friday, November 22, 2024

150 మంది స్థానికులు మాపై దాడి చేశారు

- Advertisement -
- Advertisement -

CISF officials comment on Cooch Behar incident

ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సి వచ్చింది
కూచ్ బిహార్ ఘటనపై సిఐఎస్‌ఎఫ్ అధికారులు వివరణ

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో నాలుగో విడత పోలింగ్ సందర్భంగా కూచ్ బిహార్ జిల్లాలో చోటు చేసుకున్న కాల్పుల ఘటన రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ ఘటనపై తృణమూల్ కాంగ్రెస్, బిజెపిలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే హింసకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చిందన్న దానిపై సిఐఎస్‌ఎఫ్ అధికారులు వివరణ ఇచ్చారు. స్థానికులు తమపై దాడి చేయడం, ఆ క్రమంలో ఓ చిన్నారి గాయపడ్డంతో ఉద్రిక్తత చోటు చేసుకుందని తెలిపారు.‘ ఈ రోజు ఉదయం 9.25 గంటలకు సిఐఎస్‌ఎఫ్ క్విక్ రియాక్షన్ టీమ్ స్థానిక పోలీసులతో కలిసి సీతల్ కుచి నియోజకవర్గంలోని జోర్‌పట్కి ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించింది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఆపుతున్న 50 60 మందిని భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఈ గొడవలో ఓ చిన్నారికి గాయమై కిందపడింది. దీంతో ఆందోళనకారులు సిఐఎస్‌ఎఫ్ సిబ్బందిపై. వారి వాహనాలపై దాడులకు దిగారు.

వారిని చెదరగొట్టడానికి కేంద్ర బలగాలు గాలిలోకి ఆరురౌండ్లు కాల్పులు జరిపాయి. డిప్యూటీ కమాండెంట్ ర్యాంక్ అధికారి అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు’ అని సిఐఎస్‌ఎఫ్ అధికారులు చెప్పారు. అయితే ఈ ఘటన జరిగిన ఒక గంటతర్వాత దాదాపు 150 మంది స్థానికులు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని పోలీసు సిబ్బందిపై దాడి చేశారని ఓ సీనియర్ అధికారి తెలిపారు. హోంగార్డు, ఆశా కార్యకర్తపై దాడి చేయడమే కాకుండా విధుల్లో ఉన్న సిఐఎస్‌ఎఫ్ జవాన్లనుంచి ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించారని చెప్పారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో ఆత్మరక్షణ కోసం భద్రతా సిబ్బంది ఆందోళనకారులపై కాల్పులు జరిపినట్లు ఆ అధికారి వెల్లడించారు. ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News