Sunday, December 22, 2024

జాతి వ్యతిరేక శక్తులను అణిచివేస్తాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశ అంతర్గత భద్రతకు మూల స్తంభాలలో సిఐఎస్‌ఎఫ్ ఒకటని, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో సిఐఎస్‌ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. హైదరాబాద్‌లోని హకీంపేట్‌లో సిఐఎస్‌ఎఫ్ 54వవ్యవస్థాపక వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం చేశారు. సీఐఎస్‌ఎఫ్ జవాన్ల వల్లే నక్సలైట్లు, ఉగ్రవాదులు అదుపులో ఉన్నారన్నారు. పటిష్ఠమైన భద్రతతో దేశ ఆర్థిక ప్రగతిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఉగ్రవాదం, వేర్పాటు వాదం, దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఉంటే కఠినంగా అణచి వేస్తామని హెచ్చరించారు. కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో హింస తగ్గుతోందని వివరించారు. సురక్షితమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు లేకుండా ఏ దేశమూ అభి వృద్ధి చెందదని చెప్పారు.

మన దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్ణయిం చారని వివరించారు. ఈ లక్ష్యం నెరవేరాలంటే మన విమానాశ్రయాలు, ఓడరేవులు, రైలు మార్గాలు, పారిశ్రామిక యూనిట్ల భద్రత చాలా ముఖ్యం అని అన్నారు. రాబోయే కాలంలో సిఐఎస్‌ఎఫ్ అన్ని సవాళ్లను అధిగమిస్తుందని తాను కచ్చితంగా అనుకుంటున్నానని అన్నారు. సిఐఎస్‌ఎఫ్‌కు ఓడరేవులు, విమానాశ్రయాలు వంటివాటి భద్రత చాలా ముఖ్యమని అన్నారు. గత 53 ఏళ్లుగా చేస్తున్నట్టుగానే సిఐఎస్‌ఎఫ్ వాటికి రక్షణ కల్పిస్తూ ఉందని, వాటి భద్రత కోసం రానున్న కాలంలో అన్ని సాంకేతికతలతో సిఐఎస్‌ఎఫ్‌ను హోం మంత్రిత్వ శాఖ బలోపేతం చేస్తుందని చెప్పారు. 1969 మార్చి 10న 3వేల సిబ్బందితో ప్రారంభమైన సిఐఎస్‌ఎఫ్ లక్షా 80 వేల మందికి చేరుకుందని వివరించారు. ఉగ్రవాదం, వేర్పాటువాదంపై 9 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి ప్రజల్లో విశ్వాసం నింపిందని చెప్పుకొచ్చారు. మోడీ సర్కార్ ఉగ్రవాదం పై అనుసరిస్తున్న కఠిన వైఖరి రానున్న రోజుల్లోనూ కొనసాగుతుందని స్పష్టం చేసారు. ’రైజింగ్ డే’ వేడుకల సందర్భంగా సీఐఎస్‌ఎఫ్‌సత్తాను కళ్లకు కట్టేలా నిర్వహించిన కవాతులు, విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది నిబద్ధతకు సెల్యూట్.. ట్వీట్ చేసిన అమిత్‌షా…

సిఐఎస్‌ఎఫ్ సిబ్బందికి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఆయన ట్వీట్ చేశారు. భారతదేశ కీలకమైన మౌలిక సదుపాయాలు, చరిత్రాత్మక ప్రదేశాలను సురక్షితం చేయడంలో వారు కీలక పాత్ర పోషించారని అన్నారు. దేశ భద్రత పట్ల వారికున్న తిరుగులేని నిబద్ధతకు సెల్యూట్ చేస్తున్నాను అని అమిత్ షా అన్నారు.

ప్రధాని మోడీ ట్వీట్

సిఐఎస్‌ఎఫ్ సిబ్బందికి ప్రధాని మోడీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కీలక ప్రదేశాల్లో 24 గంటలపాటు భద్రతను కల్పిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది అందరికీ రైజింగ్ డే శుభాకాంక్షలు అని ట్వీట్‌లో తెలిపారు. మన భద్రతా వ్యవస్థలో సిఐఎస్‌ఎఫ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వారు కీలకమైన, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలతో సహా కీలకమైన ప్రదేశాలలో రౌండ్ ది క్లాక్ భద్రతను అందిస్తారన్నారు. ఈ దళం శ్రమకు, వృత్తిపరమైన దృక్పథానికి ప్రసిద్ధి అని అన్నారు. ఇదే తొలిసారి…

కాగా, సిఐఎస్‌ఎఫ్ మార్చి 10, 1969న పార్లమెంటు చట్టం ప్రకారం స్థాపించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మార్చి 10న సిఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే జరుపుకుంటారు. ఈ ఏడాది సిఐఎస్‌ఎఫ్ వార్షిక రైజింగ్ డే వేడుకలు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఢిల్లీ కాకుండా సిఐఎస్‌ఎఫ్ ’రైజింగ్ డే’ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు.
అయితే, అంతకు ముందు శనివారం రాత్రి హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్ తమిళిసై, బిజెపి నేతలు స్వాగతం పలికారు.

అమిత్ షా వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. సిఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా శనివారం రాత్రి హైద్రాబాద్ కు చేరుకున్నారు. ఆది వారం హైద్రాబాద్‌లో జరిగిన సిఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. హైద్రాబాద్ నుండి కేంద్ర మంత్రి అమిత్ షా కొచ్చి వెళ్లాల్సి ఉంది. ఆదివారం ఉదయం 11:40 గంటలకుఅమిత్ షా కొచ్చి బయలుదేరాల్సి ఉంది. కానీ అమిత్ షా ప్రయాణం చేయాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. విమానంలో సాంకేతిక సమస్యను మంత్రి అమిత్ షాకు తెలిపారు. దీంతో హైద్రాబాద్ లోని అమిత్ షా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ బిజెపి నేతలు కేంద్ర మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతీం చేసే విషయమై అమిత్ షాతో పార్టీ నేతలు చర్చించారు. బిఆర్‌ఎస్ ఎదుర్కొనేందుకు అవలంభించాల్సిన వ్యూహంపై బిజెపి నేతలకు అమిత్ షా దిశా నిర్ధేశం చేశారని సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News