Thursday, January 23, 2025

ప్రసాదమూర్తి రెండు మహానదులు

- Advertisement -
- Advertisement -

ఎరుపెక్కిన పాదాల కింద కాలానికి వందనం
ప్రపంచపటం మీద నిప్పంటుకున్న/ అగ్రపతాకాల రెపరెపలు/ అభివృద్ధి భూతాన్ని తరుముతున్న/ అభాగ్య మృతదేహాల అనంత సమూహాలు / పిట్టల్లా రాలిపోతున్న నిరుపేదల నిస్సహాయ రోదన / ధనవంతులు, బలవంతులు / సామ్రాజ్యాల సార్వభౌములు /నీలిరంగు నక్కల్లా నీలుగుతున్న / వినోద, విషాద, వికృత దృశ్యాలు. /మన కళ్ళ ముందుంచడానికి ఈ కవి కన్ను మూతపడని జ్వర పీడితుడై ఉండాలి. లేకపోతే అదృశ్య శత్రువు దాడికి నిలువెల్లా గాయపడిన భూమిని బొంగరం చేసి కవిత్వ దారంతో ఎగరేసి అరిచేతిలో గిరగిరా తిప్పడం ఈ కవికెతా సాధ్యపడిందో? నికరాగ్వా నుంచి నిడమర్రు దాకా ఊపిరి బిగబట్టిన ఉన్మత్త నిరీక్షణ, నిరీక్షణలో నడక, నడకలో యుగాల గులకరాళ్ళు దొర్లుతున్న సంభ్రమ సంతాప సంగీతం వినిపించడానికీ కవి ఎందుకింత మధనపడాలి?
కాలి కింద నేలను కాలానికి చుడుతూ ద్విపాద పశువుగా నడక మొదలైన నుండీ భూగోళమంత పాదాలేసుకుని ఇప్పుడీ కాలానికి పగుళ్ళు పగుళ్ళుగా నెత్తురు చిమ్ముతుంటే ఎర్రబడుతున్న దారుల్లో తానొక ‘బొటనవేలై’ వేలిముద్ర వేయడానికి ఈ కవి ఎందుకు ముందుకు రావాల? భూమినొక ఉండగా చేసి అరిచేతిలో పెట్టడం చేతనైన కవితమ్ముడు ప్రసాదమూర్తి, అక్షరాల పూలచేతులతో రక్తసిక్త పాదాలను హత్తుకో గలిగే మెత్తని మనసున్నోడు మిత్రుడు ప్రసాదమూర్తి. మరి ఈ బాధంతా ఈ కవికి గాక మరెవరికి పడుతుందని?
‘నెత్తి మీద ఒక దేశాన్ని పెట్టుకుని/ గుడ్డిగా ఎటో వెళ్ళిపోతున్నాను, / ఏ దేశమ్మీదంటే ఈ దేశమే అంటాను, / మీరెటు పోతున్నారంటే మాదేశానికంటాను / ఏ దీపాలతో నాకు దారి చూపిస్తారు మీరు? / ఆకలి పేగుల్ని వందల కిలోమీటర్లు/ పరుచుకుంటూ వెళ్ళినవాణ్ణి/ మైలురాళ్ళకు నెత్తుటిబొట్లు పెడుతూ వచ్చిన దారి పట్టాను’/ మొన్నటి వలస దుఃఖాన్ని, నెత్తుటి పాదముద్రల మీద వెలిగించిన కొవ్వొత్తుల సాక్షిగా ప్రభువుల బాధ్యతా రాహిత్యం, నిర్లజ్జా, నిర్లక్షపు చప్పట్ల మోతలు గుండెల్లో దాచుకుని అవి ఇంతై అంతై మరెంతో అయి లోపల ఇమడలేక సలసల మరుగుతూ కావ్యమై ఉబికొచ్చిందని కవి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఆకలి నుంచే నగరాలు, దేశాలు, యుద్ధాలు, నేరాలు, ఘోరాలు హింస, విధ్వంసం ఎన్నెన్ని పుట్టుకొచ్చేయనీ.. వాటి మూలాలు తడివి, నిడివైన గీతాన్ని నిలువెత్తు ప్రశ్నగా ఆలపిస్తున్న కవి అసలు మూలాలే ప్రశ్నలు. అందుకే ఈ కవికీ ఆరాటం, అందుకే ఈ కవికీ నిరంతర అక్షర పోరాటం. ప్రసాదమూర్తి అసలుసిసలైన కవి గనకనే పాదాల కింద కాలాన్ని పట్టుకోగలిగేడు. ప్రపంచం దుఃఖం తన దుఃఖం గనక, భూమి ఒక ‘పుండై’ మండుతూ సలపరం పెడుతున్నప్పుడు ఆ బాధను తన గొంతులో పలికించడం ఏ కవికైనా తప్పని సరి బాధ్యత. చిరుగాలకీ రెపరెపలాడే పూలరేకు మనసున్న ప్రసాదమూర్తి వంటి కవికి మరీ.. తప్పించుకోలేని తప్పనిసరి బాధ్యత. అందుకే అణచివేతల ప్రస్థానాన్ని, అశ్రుదగ్ధ కావ్యంగా మలచ లేనని, ఆధిపత్యాహంకార వికృత దాడులను, విధ్వంసకర శక్తుల వినాశకర చర్యలను ఖండిస్తూ, చరిత్ర పుటలకు మరకల్లా అంటుకున్న అనేకానేక దుశ్చర్యల్ని తిరస్కరిస్తూ, విశ్వ వేదిక మీద నిలబడి ఆలపిస్తున్న సుదీర్ఘ నిరసన వాక్యమిది.
పురాణాల నుండి చరిత్ర మీదుగా వర్తమానం దాకా సాగిన మానవ ప్రస్థానంలో విధ్వంస‘కాండ’లలోనూ, వంచనా ‘పర్వాల’లోనూ, దగా పడ్డ దీనుల పక్షం వహించడం కంటే ‘కవి’ అన్నవాడికి మరో ధ్యాన ఉండకూడదని నమ్మి “గగనమంత తలతో భూమంత పాదాన్ని గురించి’ మాట్లాడుతున్నాడు. ఏ దేశానికీ అవసరంలేని, అసలు దేశమేలేని వాడి తరుపున, గుండె చీల్చి దేశపటాన్ని చూపినా కాదు పొమ్మంటున్న దేశం ముందు మోకరిల్లుతున్న నిస్సహాయుల ప్రతినిధిగా, దేహాలను దేశాల కవతల గుడా రాలుగా పాతుకుంటున్న కాందిశీకుల కళ్ళలో కత్తులు కన్నీటి ధారలే కవితా వాక్యాలుగా మలుస్తున్నాడు. ఇదొక అశ్రు జలపాతం, ఇది దేశ దేహ చరణాల చీలికల నుండి స్రవించే అశ్రు ధారాపాతం నిండా యాభై పేజీలు కూడా లేని ఈ కావ్యం నా కళ్ళు పట్టని విశ్వరూపాన్ని చూపించింది. ఏ వాక్యాన్ని ముట్టుకున్నా కరెంటు తీగను పట్టుకున్నట్టనిపించి ఆ ‘విద్వద్ఘాతాలకి’ గుండె కరిగి ధారలు గట్టిన కన్నీటి ప్రవాహం. విరి తీగల్లో విద్యుత్ప్రవాహాల్ని ప్రసరింప జేసే రసవద్విద్య నీకెలా అబ్బిందిరా నాయనా?!/ పద్యాల్ని కాంతిసుమాలుగా ప్రకాశింజేసే మాంత్రిక శక్తి నీకెలా పట్టుబడిందిరా తమ్ముడా?!/ నాకంటే చిన్నోడివే గానీ… నీకు గాదు, నీలోని ‘కవి పాదాల’కి, నీ కవిత్వ పాదాలకి, అలాగే ‘కాలాన్ని ఎరుపెక్కించే పాదాలకీ.. ‘నమస్కారం చెయ్యకుండా ఎలా వుండగలను.

గంటేడ గౌరునాయుడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News