Thursday, September 19, 2024

ఓయూలో రేపటి నుంచి సిటిజన్ పార్లమెంటు

- Advertisement -
- Advertisement -

చట్ట సభల్లో అనుభవం ఉన్న వ్యక్తుల ప్రసంగాలు
తెలంగాణ యువతకు నాయకత్వ లక్షణాలు పెరిగే అవకాశం: విసి రవీందర్‌ యాదవ్

మన తెలంగాణ/హైదరాబాద్:  ఈ నెల 8 నుంచి పదో తేదీ వరకు మూడు రోజుల పాటు సిటిజన్ పార్లమెంట్ జరగనుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, సిటిజన్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని సిటిజన్ ఇండియా సీఈఓ స్వాతి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. పలువురు పార్లమెంటేరియన్లు, చట్టసభల నిర్వహణలో అనుభవం కలిగిన వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 1800 మంది దరఖాస్తు చేసుకున్నారని అందులో నుంచి 180 మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసే ఉద్దేశంతో 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న యువతకు యూత్ పార్లమెంట్ లో పాల్గొనే అవకాశం కల్పించినట్లు వివరించారు.

మొదటి రెండు రోజుల పాటు మర్రిచెన్నారెడ్డి మానవనరుల కేంద్రంలో,  మూడో రోజు ఓయూలోని దూరవిద్యాకేంద్రం ఆడిటోరియంలో యూత్ పార్లమెంట్ పలు అంశాలపై చర్చించనుందని వివరించారు. చట్ట సభల్లో ఉండే నిబంధనలు, నియమాలు పూర్తిగా ఇక్కడ పాటిస్తూ యువతకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇందులో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో డాక్టర్లు, ఇంజినీర్లు, ఐటీ నిపుణులు దరఖాస్తు చేసుకున్నారని అన్ని వర్గాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. యూత్ పార్లమెంట్ లాంటి కార్యక్రమాలతో తెలంగాణ యువతలో నాయకత్వ లక్షణాలను మరింత ఉత్తేజపరిచే అవకాశం ఉంటుందని ఓయూ ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవీందర్ యాదవ్ తెలిపారు.

ఎంతో మంది ఉత్తమ పార్లమెంటేరియన్లను, చట్టసభల సభ్యులను, అత్యున్నత సంస్థలకు నాయకత్వాన్ని ఓయూ అందించిందని గుర్తు చేశారు. జాతీయ స్థాయి యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ఓయూ విద్యార్థులు, తెలంగాణ యువతకు చట్టసభల నియమ, నిబంధనలపై అవగాహన ఏర్పడుతుందని అన్నారు. తద్వారా యువతలో సృజనాత్మక శక్తి, రాజకీయ నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓయూలోని తరచుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషచేస్తామని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య పి. లక్ష్మినారాయణ, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య శ్రీరాం వెంకటేశ్ ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News