పౌరులు, విద్యార్థులకు భారత్ అడ్వయిజరీ
న్యూఢిల్లీ : కెనడాకు వెళ్లే భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలని భారత ప్రభుత్వం హెచ్చరించింది. కెనడాలో విద్వేష నేరాలు, తెగలపై దాడులు, ప్రత్యేకించి కొన్ని చోట్ల భారత వ్యతిరేక కార్యకలాపాలు మితిమీరుతున్న దశలో తమ పౌరులకు , విద్యార్థులకు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తగు మార్గదర్శకాలతో శుక్రవారం ప్రకటన వెలువరించింది. హింసాత్మక ఘటనలపై భారతదేశం తరఫున ఎప్పటికప్పుడు కెనడా అధికార యంత్రాంగానికి స్పందన తెలియచేస్తున్నామని, వెంటనేతగు నివారణ చర్యలకు డిమాండ్ చేశామని ప్రకటనలో తెలిపారు. ఇది ఓ ప్రక్రియగా సాగుతోంది. మరో వైపు పౌరులు కెనడాకు వెళ్లుతున్నట్లు అయితే అప్రమత్తంగా ఉండాలి. ఇక విద్యార్థులు అనివార్యంగా పరిస్థితిని సమీక్షించుకుంటూ వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కెనడాలో జరుగుతున్న జాతిపరమైన హింసాత్మక ఘటనలపై ఎన్నిసార్లు ఫిర్యాదులకు దిగినా వీటిని ప్రేరేపించిన వారిపై ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రకటనలో తెలిపారు. ఇటీవలి కాలంలో కెనడాలో పలు చోట్ల ఖలీస్తాన్ అనుకూలవర్గాలు తిరిగి విద్వేష చర్యలకు పాల్పడుతున్నాయి. హిందూ ఆలయాల ధ్వంసానికి దిగుతున్నాయి. హిందువులపై దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయనే భయాందోళనల నడుమ ఇప్పుడు భారత ప్రభుత్వం అడ్వయిజీరిని వెలువరించింది. సిక్కులకు ప్రత్యేక దేశం పేరిట ఖలీస్థాన్ వర్గాలు రెఫరెండం నిర్వహించడంపై భారతదేశం దౌత్యపరంగా తీవ్రస్థాయి నిరసనను వ్యక్తం చేసింది. తీవ్రవాద, ఉగ్ర శక్తులు ఇటువంటి ప్రహసనం పేరిట భారతదేశపు అత్యంత మిత్రదేశంలో చెలరేగిపోవడం చాలా అభ్యంతరకరం అని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందం బగ్చి స్పందించారు.