హైదరాబాద్: నగరాన్ని శుక్రవారం పూర్తిగా మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో ఉదయం నుంచే నగరంలో చీకటి కమ్ముకుంది. మరోవైపు గడిచిన 5రోజులుగా నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సైతం మరో సారి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురువడంతో నగరవాసులు చిగురుటాకులా వణికిపోతున్నారు. వరస వర్షాల కారణంగా నగరంలోని అన్ని చెరువులు, కుంటలు నిండిపోవడమే కాకుండా అనేక కాలనీలు, బస్తీల్లో వరద నీరు నిలిచి ఉంది. చినుకుపడితే చాలు లొతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అవుతున్నాయి. మరో వైపు రోడ్లపై వరద నీరు, పెద్ద ఎత్తున బురద చేరుతుండడంతో అవి కాస్తా ధ్వంసం అవుతున్నాయి. మరోవైపు నీరు నిలిచి ప్రదేశాల్లో దోమల తీవ్రత పెరిగిపోవడంతో నగరవాసులు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు.
రోజుల తరబడి నీరు నిల్వ ఉండడం, ఎండ తీవ్రత సైతం తగ్గిపోవడంతో అంటు వ్యాధులు ప్రబల్లే అవకాశాలుండడంతో మరింత భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతి రోజు పలు ప్రాంతాల్లో 5 సె.మిలకు మించి వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా జిహెచ్‌ఎంసి సైతం చేపడుతున్న సహాయ చర్యలు సైతం వృదా అవుతున్నాయి. బల్దియా నీరు నిలిచిన ప్రదేశాల్లో పారిశుద్ద పనులు నిర్వహిస్తోంది. అయితే తిరిగి గంటల వ్యవధిలోనే భారీ వర్షం కురుస్తుండడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తోంది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, సనత్‌నగర్, మూసాపేట్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజుల రామారం, బోయిన్‌పల్లి, సుచిత్ర, అల్వాల్, బొల్లారం, తిరుమల్‌గిరి సికింద్రాబాద్, తార్నాక, హబ్సిగూడ, నాచారం, కాప్రా, ఉప్పల్, రామాంతాపూర్ అంబర్‌పేట్, హిమాయత్‌నగర్, కాచిగూడ, కోఠి, అబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, మెహిదిపట్నం తదితర ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షం కురిసింది.
ఎల్‌బినగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం
గడిచిన 5 రోజుల నుంచి ఎల్‌బినగర్ నియోజకవర్గంలో 5 సె.మి.లకు మించి వర్షం కురిస్తోంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో ఈ ప్రాంతం పూర్తిగా నీట మునుగడంతో వర్షం అంటేనే బెంబేలెత్తిపోతున్నారు. పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తుండగా మరో వైపు భారీ వర్షాలు కురుస్తుండడంతో లొతట్టు ప్రాంత వాసులు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. శుక్రవారం సైతం ఉదయం నుంచే సాయంత్ర వరకే హయత్‌నగర్ సర్కిల్ పరిధిలో 5.1 సె.మిలకు పైగా వర్షం కురిసింది. లింగోజిగూడ 4.8, వనస్థలిపురం 3 సెమివర్షం కురిసింది. అదేవిధంగా ఎల్‌బినగర్, సౌత్ హస్తినాపురం, బండ్లగూడ, నాగోల్, అలకపూరి కాలనీలో 2 సె.మిపైగా వర్షపాతం నమోదైంది.